• తాజా వార్తలు

తొలి బ్లూటూత్ స్పీక‌ర్‌, రిమోట్ ఉన్న ఫ్యాన్‌- ఫ్యాన్జార్ట్ మెల‌డీ

ఫ్యాన్జార్ట్ మెల‌డీ... ఇదొక అద్భుత‌మైన ఫ్యాన్‌! ఇందులో బ్లూటూత్ స్పీక‌ర్‌,  LED లైట్‌కిట్ అంత‌ర్భాగంగా ఉంటాయి. అంతేకాదు... వీటిని రిమోట్‌తో ప‌నిచేయించ‌వ‌చ్చు. ఫ్యాన్జార్ట్ కంపెనీ త‌యారుచేసిన అత్యాధునిక డిజైన‌ర్‌ ఫ్యాన్ ‘‘మెలడీ’’ ఆ పేరుకు త‌గిన‌ట్లే మ‌న‌కు విన‌సొంపైన సంగీతం వినిపిస్తుంది. అలాగే సాధార‌ణ ఫ్యాన్ల‌తో పోలిస్తే మూడురెట్లు ఎక్కువ‌గా గాలిని ప్ర‌వ‌హింప‌జేస్తుంది. యాంగ్ల‌ర్ బ్లేడ్ల‌తోపాటు రిమోట్‌తో నియంత్రించ‌గ‌ల LED లైట్‌కిట్ దీని మ‌రో ప్ర‌త్యేక‌త‌. ఫ్యాన్జార్జ్ మెల‌డీ ఇప్పుడు ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగాగ‌ల కంపెనీ ఫ్రాంచైజీ స్టోర్ల‌లో రూ.29,990 ధ‌ర‌కు ల‌భిస్తోంది.
చ‌ల్ల‌నిగాలి... చ‌క్క‌ని సంగీతం
ఈ ఫ్యాన్‌ను విస్ప‌ర్ క్వైట్ టెక్నాల‌జీ (Whisper Quiet Technology)తో రూపొందించిన‌ట్లు కంపెనీ చెబుతోంది. ఇందులోని ఇంటిగ్రేటెడ్ స్పీక‌ర్ 10వాట్ల అవుట్‌పుట్‌తో వినియోగ‌దారుల‌కు నిరంత‌ర‌ సంగీత మాధుర్యాన్ని చ‌విచూపుతుంద‌ట‌! ఫ్యాన్ తిరుగుతున్న‌ప్పుడు సంగీత త‌రంగాలు గ‌దినిండా ప‌ర‌చుకునే గాలితో క‌లిసిపోయి వీనుల విందు చేస్తాయ‌ని తెలిపింది. ఫ్యాన్జార్ట్ మెల‌డీ ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్‌తో ప‌నిచేస్తుంది. గాలి వేగంతోపాటు లైట్లు, ఫ్యాన్ సెట్టింగ్స్‌, బ్లూటూత్‌తో జోడించ‌డం వంటివ‌న్నీ ఈ రిమోట్‌తో చేసుకోవ‌చ్చు. మొత్తం 38 అంగుళాల వెడ‌ల్పుగ‌ల ఈ ఫ్యాన్‌కు నాలుగు బ్లేడ్స్ ఉంటాయి... దీని మోటారు 17-60 వాట్ల విద్యుత్ వినియోగంతో  నిమిషానికి 16-210 చుట్లు (RPM) తిరుగుతుంది. ‘‘సాదాసీదా ఫ్యాన్ల‌తో పోలిస్తే సీలింగ్ ఫ్యాన్ల రూపురేఖ‌ల‌ను ఫ్యాన్జార్ట్ మెల‌డీ స‌మూలంగా మార్చేస్తుంది. అద్భుత‌మైన రూప‌మే కాకుండా అత్య‌ద్భుత‌మైన ప‌నితీరు దీని సొంతం. ఇది వినిపించే సంగీతం, ఇందులోని ఎల్ఈడీ లైటింగ్ మీ లివింగ్ రూమ్‌కు కొత్త శోభ‌నిస్తాయి. కాబ‌ట్టి పురాత‌న ఫ్యాన్ల‌కు స్వ‌స్తిచెప్పి, డిజైన‌ర్ యుగానికి స్వాగ‌తం ప‌ల‌కండి’’ అంటున్నారు కంపెనీ సీఈవో అనిల్ లాలా.

జన రంజకమైన వార్తలు