డిజిటల్ వాలెట్ పేరు చెప్పగానే ఇండియాలో అందరికీ గుర్తొచ్చేది పేటీఎం. డీమానిటైజేషన్‌తో ఇండియాలో ఏర్పడిన నగదు కొరతను అవకాశంగా మలుచుకుని డిజిటల్ వాలెట్ బిజినెస్‌లో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగింది. వీధి చివర పాల బూత్ నుంచి ఇంటర్నేషనల్ బ్రాండెడ్ స్టోర్ల వరకు అన్నిచోట్లా ఇప్పుడు పేటీఎం ఎవాయిలబుల్ అనే బోర్డులు కనిపిస్తున్నాయి. కాకపోతే పేటీఎం వాడుకోవాలంటే మీ మొబైల్‌లో పేటీఎం యాప్, డేటా కనెక్షన్ ఉండాలి. ఆ అవసరం లేకుండా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీతో పనిచేసే ట్యాప్ కార్డ్‌లను పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. అసలు ఈ ట్యాప్ కార్డు ఏమిటి? ఎలా పని చేస్తుంది తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే.
ఇంటర్నెట్ లేకుండానే
పేటీఎం వాడాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి రావడం పెద్ద ప్రతిబంధకం అవుతోంది. ముఖ్యంగా ఫోన్లలో డేటా లేకపోయినా, మనం వస్తువు కొంటున్నచోట సెల్ సిగ్నల్స్ సరిగా లేకపోయినా ట్రాన్సాక్షన్ చేయలేకపోతున్నాం. అదే ఆఫ్‌లైన్‌లో కూడా పేటీఎం వాడుకోగలిగితే అని పేటీఎం ఆలోచించింది. ఎల్దీ.కామ్‌తో కలిసి పేటీఎం ట్యాప్ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పని చేస్తుంది. కాబట్టి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం ఉండదు.
పేటీఎం ట్యాప్ కార్డ్ ఎలా పని చేస్తుంది?
1. పేటీఎం యూజర్ ఏదైనా షాప్‌కి వెళ్లి కావల్సిన వస్తువులు కొనుక్కున్నాక పేటీఎంతో చెల్లించాలనుకున్నారు. వాలెట్‌లో బ్యాలెన్స్ ఉన్నా వాడుకోవడానికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదనుకోండి.
2. పేటీఎం ట్యాప్ కార్డ్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కార్డ్‌ను పేటీఎం మనీతో లోడ్ చేయొచ్చు. వ్యాపారి దగ్గర ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీతో పని చేసే యాడ్ వాల్యూ మెషీన్స్ (AVM) ఉంటాయి. వాటితో కూడా మనీ నింపుకోవచ్చు.
3. వ్యాపారి దగ్గర ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీతో పని చేసే పీవోఎస్ టెర్మినల్స్‌ను పేటీఎం ఏర్పాటు చేస్తుంది. మీ ట్యాప్ కార్డ్ మీద క్యూఆర్ కార్డ్ స్కాన్ చేయగానే ఎన్ఎఫ్‌సీ టెక్నాలజీ సాయంతో మీ వాలెట్‌లోని మనీ మర్చంట్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.
4. ఈ కార్డు ఉంటే యూజర్ స్మార్ట్‌ఫోన్ కూడా తీసుకెళ్లకుండా కార్డ్ ద్వారానే పేటీఎం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.
ఫ్రీయేనా?
పేటీఎం ట్యాప్ కార్డ్ డిజిటల్ వాలెట్లలో ఓ కొత్త మార్పుకు నాంది పలుకుతుందని పేటీఎం చెబుతోంది. ఇకపోతే ఈ ట్యాప్ కార్డ్‌తో పేమెంట్స్ తీసుకోవాలంటే వ్యాపారులు ఎన్ఎఫ్‌సీ పీవోఎస్ టెర్మినల్స్‌ను పేటీఎం దగ్గర నుంచి తీసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. పేటీఎం ఎల్దీ.కామ్‌తో కలిసి ఈ ట్యాప్ కార్డ్‌లు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈ కార్డు కోసం యూజర్లు 100 రూపాయలు చెల్లించాలి. త్వరలోనే పేటీఎం ఈ కార్డులను ఇష్యూ చేయనుంది.ఈ కార్డు ఫ్రీగా ఇస్తుందా 100 రూపాయలు తీసుకుని ఇస్తుందా అనేది అప్పటి వరకు క్లారిటీ రాదు.