స్మార్ట్‌ఫోన్ పాపులరయ్యాక వైఫై గురించి తెలియనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఫోన్‌లో లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్న వైఫై సింబల్‌ను టాప్ చేసి దగ్గరలో ఉన్న వైఫైని పాస్‌వర్డ్‌తో కనెక్ట్ చేసుకోవచ్చు. వైర్ పెట్టకుండానే రెండు డివైస్‌లను కనెక్ట్ చేసే టెక్నాలజీయే వైఫై. రేడియో వేవ్స్‌ను ఉపయోగించుకుని హైస్పీడ్ నెట్‌వర్క్ కనెక్ట్ చేయడం వైఫై ప్రత్యేకత.
1999లో ప్రారంభం
1999లో వైఫై తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఇది వైఫై 1. అంటే వైఫైలో ఫస్ట్ జనరేషన్. తర్వాత ఇప్పటి వరకు వైఫై 2,3,4,5 వచ్చాయి. ఇలా కొత్త వెర్షన్ వచ్చిన ప్రతిసారి వైఫైతో కనెక్టివిటీ స్పీడ్, డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ పెరుగుతూ వస్తున్నాయి. సెక్యూరిటీ పరంగానూ డెవలప్‌మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా వైఫై 6 అందుబాటులోకి వచ్చింది.
వైఫై 6 స్పెషాలిటీస్ ఏమిటి?
ఫాస్టర్ స్పీడ్స్: కంపాటబుల్ డివైస్‌లో ఎక్కువ స్పీడ్‌గా కనెక్ట్ కావడం వైఫై 6 టార్గెట్. ప్రస్తుతం నడుస్తున్న వైఫై 5లో రూటర్‌తో ఒక డివైస్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు మ్యాగ్జిమం స్పీడ్ 800 ఎంబీపీఎస్. అదే వైఫై 6లో దాన్ని 1300 ఎంబీపీఎస్‌కు పెంచారు.
బెటర్ బ్యాటరీ లైఫ్: సాధారణంగా వైఫై, బ్లూటూత్ వంటివి కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ తొందరగా అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి టార్గెట్ వేక్ టైమ్ (TWT) అనే కొత్త ఫీచర్‌ను వైఫై 6లో ప్రవేశపెట్టారు. దీనితో డివైస్‌కు నెట్‌వర్క్ కావల్సినప్పడే యాక్సెస్ పాయింట్‌ను యూజ్ చేసుకునేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
రద్దీ ప్రదేశాల్లోనూ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్: రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్ట్‌లు వంటి చోట్ల వైఫై ఉన్నా కనెక్ట్ అవడానికి టైం తీసుకుంటుంది. ఇందుకు కారణం రద్దీయే. ఎక్కువమంది ఒకేసారి యూజ్ చేయడానికి ప్రయత్నించడం వల్ల నెట్‌వర్క్ చాలా స్లో అయిపోతుంది. అయితే వైఫై 6లో స్పేషియల్ ఫ్రీక్వెన్సీ రీ యూజ్ అనే కొత్త టెక్నాలజీని వాడడంతో ఇలాంటి ప్రదేశాల్లో కూడా వైఫై స్పీడ్‌గా కనెక్ట్ అవుతుంది.
అయితే వైఫై 6లో వచ్చే ప్రయోజనాలన్నీ పొందాలంటే రూటర్, డివైస్ కూడా అందుకు తగిన కంపాటబులిటీతో ఉండాలి.