• తాజా వార్తలు

ప్రివ్యూ - మీ స్మార్ట్‌ఫోన్‌కి తొలి ఎయిర్‌బ్యాగ్ వ‌చ్చేసింది!

ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న ఫోన్ ఒక్కసారి చేతి లోంచి జారిపోతే విలవిల్లాడిపోతాం! మురిపెంగా చూసుకుంటున్న స్మార్ట్‌ఫోన్‌కి ఏమైనా అయ్యిందేమో అని చ‌టుక్కున చేతిలోకి తీసుకుంటాం! ఫోన్‌పై గీత‌లు ప‌డినా, స్క్రీన్‌ డ్యామేజ్ అయిందని తెలిసినా నీరుగారిపోతాం! కానీ ఇప్పుడు మీ ఫోన్ కింద ప‌డినా మీరు హాయిగా, నిశ్చితంగా, ప్రశాంతంగా ఉండొచ్చు! ఎందుకంటే ఫోన్‌ను ర‌క్షించేందుకు ఎయిర్ బ్యాగ్ వ‌చ్చేసింది. కారులో ఎయిర్‌బ్యాగ్ గురించి తెలుసుగానీ.. ఈ మొబైల్ `ఎయిర్ బ్యాగ్` ఏంటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చ‌ద‌వండి

ప్ర‌స్తుతం స్మార్ట్‌ఫోన్ల‌న్నీ ఎంతో నాజూకుగా ఉంటున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో అనుకోకుండా ఫోన్ చేతిలోంచి, జేబులోంచిగానీ ప‌డి దానిమీద గీత‌లు ప‌డినా, స్క్రీన్‌ డ్యామేజ్ అయితే ఇక అంతే సంగ‌తులు. ఫోన్ అంద‌మంతా పోతుంది. ఇలాంటి ప్ర‌మాదాల నుంచి స్మార్ట్‌ఫోన్‌ను కాపాడుతుంది ఎయిర్ బ్యాగ్‌! దీనిని జర్మనీలోని అలెన్ యూనివ‌ర్సిటీకి చెందిన యువ‌ ఇంజినీర్ ఫిలిప్ ఫ్రెంజ‌ల్ రూపొందించాడు. ఈ ఎయిర్ బ్యాగ్ చూడ‌టానికి మార్కెట్‌లో ల‌భించే ప్లాస్టిక్ మొబైల్‌ కేస్ మాదిరిగానే ఉంటుంది. మార్కెట్ దొరికే ప్లాస్టిక్‌, ఇత‌ర పౌచ్‌ల కంటే చాలా తేలిక‌గా ఉంటూనే ఫోన్‌ను సుర‌క్షితంగా ఉంచుతుంది. ఈ కేస్‌లో మొత్తం ఎనిమిది అతి స‌న్న‌ని మెట‌ల్ స్ప్రింగ్‌ల‌తో పాటు కొన్ని సెన్స‌ర్లు కూడా ఉంటాయి. ఫోన్ కింద ప‌డుతున్న స‌మ‌యంలో సెన్స‌ర్లు యాక్టివేట్ అవుతాయి. వెంట‌నే స్ప్రింగులు మొబైల్ నాలుగు వైపుల నుంచి తెరుచుకుంటాయి. సో ఫోన్‌కు ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఇవి కాపాడ‌తాయ‌న్న‌మాట‌! ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా ఫ్రెంజ‌ల్‌ దీనిని త‌యారుచేశాడు. అంతేకాదు.. ఈ ఆవిష్క‌ర‌ణ‌కు జెర్మ‌నీ సొసైటీ అందించే అవార్డు కూడా గెలుచుకున్నాడు. 

జన రంజకమైన వార్తలు