టెక్ దిగ్గజం ఆపిల్ క్రెడిట్ కార్డు సేవల్లోకి అడుగు పెట్టనున్నది. తన సొంత వాలెట్ యాప్ ఆధారంగా సునాయాసంగా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు దీని ద్వారా వీలు కల్పిస్తోంది. కార్డు నంబర్, సంతకం, సీవీవీ సెక్యూరిటీ కోడ్ వంటి సంప్రదాయ ఫిజికల్ క్రెడిట్ కార్డ్ మాదిరిగా వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేకుండా చిటికెలో చెల్లింపులు జరిగేలా అధునాతన డిజిటల్ కార్డును ఐఫోన్ వినియోగదారులకు అందించనుంది.
ఆపిల్ క్రెడిట్ కార్డ్ అన్ని క్రెడిట్ కార్డుల్లా పనిచేయదు. దానికి ఫిజికల్‌గా కార్డు ఏమీ ఉండదు. యూజర్లకు చెందిన ఐఫోన్లే ఆపిల్ కార్డులుగా పనిచేస్తాయి. ఆ కార్డు సర్వీస్‌ను యాక్టివేట్ చేసుకుంటే వెంటనే ఓ నంబర్ క్రియేట్ అవుతుంది. కానీ అది యూజర్లకు కనిపించదు. కాకపోతే ఆ నంబర్, ఇతర సమాచారం అంతా ఆపిల్ పే లో సెక్యూర్ గా స్టోర్ అవుతుంది. ఈ క్రమంలో యూజర్లు ఆపిల్ పే ఉన్న మర్చంట్ల దగ్గర ఆపిల్ కార్డుతో బిల్లు చెల్లింపులు చేయవచ్చు. ఆపిల్ పే లేని చోట కార్డును వాడుకునేందుకు వీలుగా ఫిజికల్ కార్డును కూడా యాపిల్ అందివ్వనుంది. ఆపిల్ కార్డుకు ఎలాంటి ఫీజు లేదని కంపెనీ వెల్లడించింది. ఈ కార్డును వాడేవారికి రివార్డులు, క్యాష్‌బ్యాక్‌ను కూడా అందివ్వనున్నారు. అలాగే ఈ కార్డు బిల్లు చెల్లింపులో ఎలాంటి ఆలస్యం అయినా అధిక రుసుం వసూలు చేయబోమని యాపిల్ వెల్లడించింది.
ఇందుకోసం ప్రముఖ ఆర్థిక సేవల కంపెనీ గోల్డ్ మాన్ సాక్స్ తో జట్టు కట్టింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఆపిల్ క్రెడిట్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ఆగష్టు 15 లోపే కార్డును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆపిల్ ఫోన్ కలిగి ఉన్న వారు వాలెట్ అప్ ద్వారా ఈ కార్డు ను ఆక్సిస్ చేయవచ్చు. ఐఓఎస్ 12.4 అప్డేట్ కలిగిన అన్ని ఫోన్ల లోనూ ఆపిల్ కార్డు ఇన్ బిల్ట్ గా లభించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రస్తుతం ఆపిల్ క్రెడిట్ కార్డు అమెరికా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అంటున్నారు. అక్కడ పరీక్షించిన తర్వాతే ఇతర మార్కెట్లకు విస్తరించే అవకాశం ఉందని చెబుతున్నారు. కానీ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చేసున్న దేశంగానూ ఆపిల్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ల లో భారత్ ఒకటి కావడంతో త్వరలో ఆపిల్ క్రెడిట్ కార్డు ఇండియాలో అందుబాటులోకి వస్తుందని విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.