కొన్న ఫోన్‌లో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని తిరిగి కంపెనీలకు ఇచ్చేస్తుంటాం. అందులోని లోపాలు పరిష్కరించి మళ్లీ సేల్ చేస్తుంటారు. వీటినే రీఫర్‌బిష్డ్ ఫోన్లు అని పిలుస్తుంటా. ఈ ఫోన్లను కొనేందుకు చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇలాంటి 5 లక్షల ఫోన్లను కేవలం రెండేళ్లలో అమ్మి సంచలనం సృష్టించిన ఢిల్లీకి చెందిన స్టార్టప్ కంపెనీ యంత్ర.. ఇప్పుడు మరో ముందడగు వేసింది. ఎవరైనా తాము ఉపయోగిస్తున్న ఫోన్లను సులువుగా అమ్మేసేందుకు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
సులువుగా అమ్మేయండి
Yantra BuyBackగా వ్యవహరించే ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఓఎస్‌లపైనా పని చేస్తుంది. దీని ద్వారా తమ పాత మొబైల్‌ను తక్షణమే అమ్మేయచ్చు. తక్షణమే అంటే.. కేవలం 60 సెకన్లలోనే! ఇందులో మన మొబైల్ గురించి అతి తక్కువ వివరాలు ఇస్తే చాలు.. ఫోన్ కండీషన్‌ను తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఎంత ధరకు దానిని అమ్మయవచ్చో తెలిసిపోతుంది. ఇది నచ్చి అమ్మేందుకు యూజర్ ముందుకువస్తే.. 24 నుంచి 48 గంటల్లో ఆ ఫోన్‌ను కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకున్న సమయంలోనే పేమెంట్ కూడా చేసేయవచ్చు. వినియోగదారుడు సులువుగా, వేగంగా, సురక్షితంగా ఆన్‌లైన్లో మొబైల్ అమ్మకాలు నిర్వహించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ యాప్ సేవలు దేశంలోని 7 నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. రానున్న6 నెలల్లో 20 నగరాలకు తమ సేవలను విస్తరించబోతున్నట్లు యంత్ర సీఈవో, సహ వ్యవస్థాపకుడు జయంత్ ఝా తెలిపారు. నమ్మకమైన ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్ ద్వారా సులువుగా వినియోగదారులు మొబైల్ అమ్మకం, కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఈ సర్వీసును ప్రారంభించామన్నారు.
ఆ రెండూ విజయసూత్రాలు
గ్యాడ్జెట్‌వుడ్ అనే స్టార్టప్‌ని 2013లో అంకిత్ సరాఫ్, అన్మోల్ గుప్తా, జయంత్ ఝా ప్రారంభించారు. స్మార్ట్‌ఫోన్ సర్వీసెస్‌కి డిజిటల్ మోడల్‌ని రూపొందించాలనే లక్ష్యంతో దీనిని స్టార్ట్‌చేశారు. తర్వాత ఈ కంపెనీ పేరును యంత్రగా మార్చారు. ఐదేళ్లలోనే ఎంతోమంది నమ్మకాన్ని గెలుచుకుని సంస్థ మరింతగా వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం ఏడు నగరాల్లో సొంతంగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. దేశంలోని 250 నగరాల్లో 30000 మంది రిటైల్ పార్ట్‌నర్స్ ఉన్నారు. దాదాపు 36 క్వాలిటీ చెక్ పాయింట్లు ఉండటంతో పాటు.. ఈ కంపెనీ ద్వారా అమ్మే ప్రతి ఫోన్‌కీ ఆరు నెలల పాటు వారెంటీ ఇస్తారు. ఇదే ఈ కంపెనీ విజయసూత్రమని చెబుతారు.