చేతికి స్మార్ట్‌ఫోన్ దగ్గరైన కొద్దీ కంటికి నిద్ర దూరమవుతూ వస్తోంది! మొబైల్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుండటంతో నిద్ర పోయే సమయం తగ్గుతోందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫలితంగా ఉదయాన్నే బద్ధకం, మైండ్ యాక్టివ్‌గా ఉండకపోవడం వంటి సమస్యలు వస్తాయి. రాత్రి వేళ హాయిగా, ప్రశాంతంగా, త్వరగా నిద్రపుచ్చేలా చేసే.. CANT SLEEP యాప్ మీ మొబైల్‌లో ఉంటే ఇలాంటి సమస్యలేమీ మీ దరిచేరవు!
సంగీతం పరమ ఔషధం
నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సంగీతం ఒక ఔషధంలా పనిచేస్తుందని అధ్యయనాలు, సర్వేలు తేల్చాయి. వీటి ఆధారంగా ఈ CANT SLEEP యాప్‌ను రూపొందించారు. నిద్ర పోయేందుకు సిద్ధమైన సమయంలో మైండ్‌లోకి వచ్చే ఆలోచనలన్నింటినీ తగ్గించి.. త్వరగా నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. పడుకున్నప్పుడు బయటి నుంచి వచ్చే శబ్దాలను వినిపించకుండా చేస్తుంది. ఇందుకోసం ఆడియో మాస్కింగ్ అనే ఫీచర్ ఉంది. ఈ యాప్ పనిచేసేందుకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. సో ఎప్పుడైనా ఎక్కడైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఆండ్రాయిడ్ యాప్‌లో మరిన్ని అడిషినల్ ఫీచర్లు పొందాలంటే ప్రీమియమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇందులో ఉండే ఫ్రీ ఫీచర్ల గురించి తెలుసుకుందాం!
Presets & Modes
యాప్ ఓపెన్ చేయగానే Presets ట్యాబ్ కనిపిస్తుంది. ఇందులో Default, Jazz, Gypsy, Water, Barque, Spring, New Age, All అనే 8 రకాల ఆప్షన్లు ఉంటాయి. మనం ఎంచుకున్న పద్ధతిని బట్టి.. మ్యూజిక్ వినిపిస్తుంది. ఇందులోనూ Relax, Focus, Sleep, and Infant Sleep అనే మోడ్స్ ఉంటాయి.
Personalize
మనం ఎంచుకున్న పద్ధతిని బట్టి.. యాప్ బ్యాగ్రౌండ్ ఫొటో మారుతుంది. ఇందులో ప్లే, పాజ్ బటన్లతో పాటు మరో మూడు ఆప్షన్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి. హార్ట్ ఆకారంలో ఉండే బటన్ సాయంతో మ్యూజిక్ టెంపోని సెలెక్ట్ చేసుకోవచ్చు. హార్ట్ రేట్‌కి తగినట్లుగా టెంపోని ఎంచుకుంటే మరింత మెరుగైన ఫలితాలు పొందవచ్చు. గడియారం ఆకారంలో ఉండే బటన్ ద్వారా.. యాప్ ఎంత సమయంలో ఆగిపోవాలో టైమ్‌ని సెట్ చేసుకోవచ్చు. చివరిలో ఉండే ఆప్షన్.. High Notes, Melody, Bass, Sound Effects, Beat, Soundscape వంటి ఆప్షన్లు సెలక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
Custom tab
ఈ Custom tabలో మరిన్ని సౌండింగ్ ఆప్షన్లు ఉంటాయి. మన అభిరుచికి తగినట్టుగా వీటిని ఎనేబుల్ లేదా డిజేబుల్ చేసుకోవచ్చు. పియానో, గిటార్, ఫ్లూట్.. ఇలాంటి 11 వాయిద్యాల శబ్ధాలు, 6 Drums & Sound FX sounds, ప్రకృతి సహజ సిద్ధమైన 17 రకాల శబ్దాలు(వాటర్ ఫాల్, రెయిన్, బీచ్ వంటి ప్రాంతాల్లోని లైవ్ సౌండ్స్) ఉంటాయి. ఒకేసారి ఈ మూడింటిని కలిపి వినొచ్చు. ఈ కస్టమ్ ట్యాబ్‌లోనే Mode/Image ఆప్షన్ కూడా ఉంటుంది. వీటి ద్వారా ప్లే అవుతున్న మ్యూజిక్ మోడ్‌తో పాటు, బ్యాగ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఏదైనా ప్రీమియర్ ప్లాన్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని బ్యాగ్రౌండ్ ఇమేజ్‌లతో పాటు ఎక్కువ ఫీచర్లు కూడా పొందచ్చు!