ఎన్నికలు, ఫలితాల కౌంటింగ్ సమయాల్లో ఎన్నికల నియమావళిని ఎవరైనా ఉల్లంఘిస్తే బాధ్యతాయుత పౌరుడిగా దానిని అడ్డుకునేందుకు ఇంత వరకూ మనం చేయగలిగింది ఒక్కటే.. రిటర్నింగ్ ఆఫీసర్‌కి కంప్లైంట్ చేయడం! కంప్లైంట్ చేసే ధైర్యం లేక మరికొంతమంది వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇప్పుడు పౌరుల శక్తిని మరింత చాటేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక పవర్‌ఫుల్ యాప్‌ను రూపొందించింది. సీవిజల్(cVIGIL)గా వ్యవహరించే ఈ యాప్‌ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ విడుదల చేశారు. జెల్లీబీన్, ఆపై వెర్షన్ గల ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్, జీపీఎస్ సిస్టమ్ ఉంటే చాలు.యాప్‌ను సులువుగా ఉపయోగించి సాక్ష్యాలతో అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
యాప్ ఎలా పనిచేస్తుందంటే..
* ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఏదైనా చర్యలు జరుగుతుంటే.. దానికి సంబంధించిన వీడియోగానీ, ఫొటోలు తీయాలి. వీడియో రెండు నిమిషాల వ్యవధి కంటే ఎక్కువగా ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
* ఫొటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్‌లోడ్ చేస్తే మన మొబైల్‌కి ఐడీ వస్తుంది. దీనిని ఉపయోగించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.
* మనం పంపిన వీడియోలు, ఫొటోలతో కూడిన కంప్లైంట్ డిస్ట్రిక్ కంట్రోల్ రూమ్‌కి వెళుతుంది.
* వెంటనే అక్కడున్న ఫీల్డ్ యూనిట్, ఫ్లైయింగ్ స్క్వాడ్, నిఘా బృందాలన్నింటినీ అలర్ట్ చేసే హెచ్చరిక జారీ అవుతుంది.
* ప్రతి ఫీల్డ్ యూనిట్ వద్ద సీవిజిల్ డిస్పాచర్(cVIGIL Dispatcher) అనే జీఐఎస్ ఆధారిత మొబైల్ అప్లికేషన్ ఉంటుంది. కంప్లైంట్ వచ్చిన ప్రదేశాన్ని గుర్తించి ఫీల్డ్ సిబ్బంది చేరుకుని ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్చలు తీసుకుంటారు.
* ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిపేలా.. కంప్లైంట్ ఇచ్చిన వారి మొబైల్‌కు cVIGIL Dispatcher ద్వారా చివరిగా ఒక నివేదిక వెళుతుంది.
దుర్వినియోగం చేయకుండా..
ఎవరైనా ఈ యాప్‌ను దుర్వినియోగం చేసే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఇందులో కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ముందుగా తీసిన ఫొటోలు, చిత్రీకరించిన వీడియోలు అప్‌లోడ్ చేసే అవకాశం లేదు. దీంతో పాటు ఒక్కసారి వీడియోగానీ, ఫొటోగానీ అప్‌లోడ్ చేస్తే.. అవి ఫోన్ మెమొరీలో సేవ్ అవ్వవు.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రమే..
కంప్లైంట్ చేసిన వారి వివరాలు చాలా రహస్యంగా ఉంచుతారు. ఈ యాప్ కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మాత్రమే పనిచేస్తుంది. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుంచి మాత్రమే దీనిని ఉపయోగించాలి. ఎన్నికలు జరిగే ప్రదేశం నుంచి ఇతర ప్రదేశానికి వెళితే ఈ యాప్ పనిచేయదు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్‌లో పైలట్ ప్రాజెక్టుగా ఈ యాప్‌ను వినియోగించబోతున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు పూర్తి స్థాయిలో దీనిని ప్రవేశపెట్టేందుకు చర్చలు తీసుకుంటున్నారు.