ఐఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 8 రిలీజ్ కు ముహూర్తం దగ్గరపడుతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 17న దీన్ని యాపిల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐఫోన్ 8 విడుదలకు సంబంధించి ఇప్పటికే చాలా సార్లు అదిగోఇదిగో అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు.. యాపిల్ ఐఫోన్ 8కు 8 అని కాకుండా ఐఫోన్ ఎక్స్ (X) అని పేరు పెడుతుందని... యాపిల్ ఐఫోన్ విడుదలై పదేళ్లు పూర్తవుతున్న తరుణంలో పదిని సూచించే రోమన్ అంకె X వచ్చేలా ఆ పేరు ఖరారు చేశారని కూడా వదంతులు వచ్చాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం యాపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ 8 పేరుతోనే సెప్టెంబరు 17న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆ తేదీ కాకుంటే సెప్టెంబరు 17 నుంచి నవంబర్ 4 మధ్య ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చని యూఎస్ కు చెందిన ప్రముఖ టెక్నాలజీ బ్లాగుల్లో పోస్టింగులు వస్తున్నాయి. యాపిల్ ఐఫోన్లకు చెందిన వివరాలను ఎప్పటికప్పుడు లీక్ చేసే బెంజమిన్ గెస్కిన్ అనే ట్విట్టర్ అకౌంట్లోనూ ఇదే సమాచారం పోస్ట్ అవుతోంది. దీంతో ఈ తేదీపై ఐఫోన్ ప్రియులు నమ్మకం పెంచుకుంటున్నారు.
యాపిల్ సంస్థ ఐఫోన్ 8 ఒక్కటే కాకుండా దాంతోపాటు ఐఫోన్ 7ఎస్, 7ఎస్ ప్లస్ ఫోన్లను కూడా విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మూడు ఫోన్లకు చెందిన డిజైన్లుగా భావిస్తున్న పలు ఫొటోలు కూడా నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. మరోవైపు యాపిల్ మాత్రం దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.