తమ సంస్థ నుంచి రాబోతున్న ఆవిష్కరణల గురించి తెలిపేందుకు టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవల నిర్వహించిన `ఇన్నోవోషన్స్ ఇన్ ద ఓపెన్` సదస్సులో అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం `గూగుల్ డూప్లెక్స్`. అచ్చం మనిషిలానే మాట్లాడుతూ.. ఎదుటివారు చెప్పిన దానికి అప్పటికప్పుడు, సందర్భానుసారంగా స్పందించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని రూపొందిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచయ్ ప్రకటించారు. ఆటోమేషన్ వల్ల ఎంతో మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ గూగుల్ డూప్లెక్స్ ప్రభావం.. కాల్ సెంటర్లపై తీవ్రంగా ఉండబోతోంది. భవిష్యత్‌లో మావన కాల్ సెంటర్లు కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఏమిటీ గూగుల్ డూప్లెక్స్
టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా టెక్ దిగ్గజం గూగుల్ మరో ముందడుగు వేసింది. స్మార్ట్‌ఫోన్లలో ఉన్న `గూగుల్ అసిస్టెంట్`ను మరింత అభివృద్ధి చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జోడించి ఈ గూగుల్ డూప్లెక్స్‌ను రూపొందించింది! ఉదాహరణకు.. రెస్టారెంట్‌లో టేబుల్ బుక్ చేయాలని గూగుల్ అసిస్టెంట్‌కి కమాండ్ ఇవ్వగానే.. హోటల్‌కు ఫోన్ చేస్తుంది. అక్కడి కస్టమర్ కేర్ ప్రతినిధితో మనం మాట్లాడినట్లే మాట్లాడుతుంది. వాళ్లు అడిగిన ప్రశ్నలకి మనం ఎలా స్పందిస్తామో అలానే స్పందించి వివరాలన్నీ చెప్పి టేబుల్ బుక్ చేసి చివరిగా మనకు నోటిఫికేషన్ ఇస్తుంది.
అంతర్జాతీయ కంపెనీల ప్రయోగాలు
ఈ టెక్నాలజీ కనుక మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే.. కస్టమర్ కేర్ రంగంలో అనూహ్యమైన మార్పులు జరుగుతాయని అంతా భావిస్తున్నారు. ఇక కాల్ సెంటర్లలో మనుషుల అవసరం చాలా వరకూ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. కొన్ని క్లిష్టమైన సందర్భాల్లో మనుషుల కంటే మెరుగ్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయగలదని కొన్ని అంతర్జాతీయ కంపెనీలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ గూగుల్ డూప్లెక్స్ టెక్నాలజీపై కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ప్రయోగాలు చేస్తున్నాయట. ఆటోమేటిక్‌గా కాల్స్ రిసీవ్ చేసుకోవడం, కస్టమర్లతో మాట్లాడటం, వారు అడిగిన ప్రశ్నలకు ఏవిధంగా చెబుతున్నాయనే అంశాలను పరిశీలిస్తున్నాయట.
గూగుల్ ఏం చెబుతోంది
ప్రస్తుతం ఇది వైరల్ అవుతుండటంతో ఈ విషయంపై గూగుల్ స్పష్టత ఇచ్చింది. ఉద్యోగాలు పోగొట్టాలనేది తమ ఉద్దేశం కాదని, ప్రజల సౌకర్యం కోసమే ఈ గూగుల్ డూప్లెక్స్‌ను రూపొందించామని చెబుతోంది. దీనిపై ఎటువంటి సంస్థలు ప్రయోగాలు చేయడం లేదని తెలిపింది. ప్రస్తుతం రెస్టారెంట్ సంభాషణలు, సెలూన్ బుకింగ్, హాలిడ్ అవర్స్.. వంటి ప్రత్యేకమైన అంశాలపైనే దృష్టిసారించామని, వీటిపైనే ప్రయోగాలు చేస్తున్నామని వివరించింది. కొన్నిసార్లు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. దీనికి కూడా ఒక పరిష్కారం ఉందని గూగుల్ చెబుతోంది. ముందుగా `నేను ఫలానా వ్యక్తి గూగుల్ అసిస్టెంట్‌ని` అని చెప్పిన తర్వాతే సంభాషణ మొదలవుతుందని వివరిస్తోంది. ఈ గూగుల్ ఆసిస్టెంట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న కంపెనీలు, స్టార్టప్‌లను ఇటీవలే గూగుల్ ఆహ్వానించింది.
సర్వేల్లో తేలిన అంశాలివి
రానున్న 45 ఏళ్లలో అన్ని రంగాల్లో మానవ మేధస్సును ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధిగమించే అవకాశాలు 50 శాతం ఎక్కువగా ఉన్నాయని గత ఏడాది నిర్వహించిన సర్వేలో తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని ఫ్యూచర్ ఆఫ్ హ్యూమనిటీ ఇన్‌స్టిట్యూట్ చెందిన కట్జా గ్రేస్, అతడి బృందం ఈ సర్వే చేసింది. ఇందులో భాగంగా ప్రపంచంలోని 1,634 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తలను కలసి వారు చెప్పిన విషయాలన్నింటితో ఒక నివేదిక తయారుచేసింది. 2020 కల్లా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 23లక్షల కొత్త ఉద్యోగాలు ఈ సాంకేతికత వల్ల వస్తాయట. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. దీనివల్ల ఉద్యోగాలు కోల్పోయేవారు అంత కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారట.