దేశంలోని చిన్నవ్యాపారులతో పాటు చిన్న మొత్తంలో రుణం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఉపయోగపడేలా డిజిటల్ పేమెంట్ కంపెనీ మొబీక్విక్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌ను ఉపయోగిస్తున్న వారి ఆర్థిక అవసరాలకు ఉపయోగపడేలా.. తక్షణం రూ.5వేలు లోన్ అందజేయాలని నిర్ణయించింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వామ్యంతో దీనిని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈ సొమ్మును ఉపయోగించి బిల్లులు చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. ఇటువంటి సదుపాయాన్ని తీసుకురావడం ఇదే తొలిసారని, ఎన్నో లక్షల మందికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని ప్రకటించింది.
రుణం చిన్నదే అయినా.. లాభాలెన్నో
2017లో మొబిక్విక్, బజాజ్ ఫిన్‌సర్వ్ భాగస్వాములయ్యాయి. మొబిక్విక్‌లో 10.83 శాతాన్ని రూ.225కోట్లకు బజాజ్ ఫిన్‌సర్వ్ కొనుగోలు చేసింది. అదే సంవత్సరం అక్టోబర్‌లో `బజాజ్ ఫిన్‌సర్వ్ వాలెట్` అనే మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేశాయి. చిన్న చిన్న మొత్తాల్లో తక్షణ రుణ సదుపాయం అందించడం వల్ల మెరుగైన అవకాశాలు కలగజేస్తాయని మెబిక్విక్ సహవ్యవస్థాపకుడు, డైరెక్టర్ ఉపాసనా ఠాకు తెలిపారు. ఆన్‌లైన్ లావాదేవీలు సగటున 30 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ రుణ సదుపాయం లేని ఎంతోమందికి దగ్గరయ్యేలా చేస్తుందని తాము బలంగా నమ్ముతున్నామని తెలిపారు. ఇప్పటికే దేశం మొత్తం మీద లక్షల మంది కోసం రూ.3500 కోట్ల రుణాలు అందజేసేందుకు ముందుగా ఆమోదం తెలిపామన్నారు. ఎన్నో వేల అవకాశాలను రుణం కలగజేస్తుందని, వ్యక్తిగత, బిజినెస్ వినియోగదారుల కోసం అతి తక్కువలో మరిన్ని ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పేటీఎంను బీట్ చేసేందుకేనా..
ప్రస్తుతం మొబిక్విక్‌కి పేటీఎం పోటీదారుగా మారిపోయింది. ప్రస్తుతం ఆ సంస్థ కూడా ఇలాంటి లోన్‌ను అందజేసేందుకు చర్చలు తీసుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ అనుమతి కోరిందని తెలుస్తోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నుంచి ఆమోదం పొందిన తర్వాత Paytm Money ద్వారా ఈ సర్వీసు ప్రారంభించబోతోంది. సుమారు పది లక్షల డాలర్లను ఈ కొత్త విభాగంలోపేటీఎం పేరెంట్ కంపెనీ One97 Communications పెట్టుబడి పెట్టబోతోందని తెలుస్తోంది.