ఏదైనా ప్రదేశానికి వెళ్లే మార్గం తెలియకపోతే.. అక్కడికి ఎలా వెళ్లాలో మనల్ని నిరంతరం గైడ్ చేసే యాప్‌లు ఉన్నాయి! ఏ రోడ్డులో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది? ఎటువైపు వెళితే సులువుగా గమ్యాన్ని చేరుకోవచ్చో చెప్పే యాప్‌లు కూడా ఉన్నాయి! మరి ఏ రోడ్డులో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి? ఎక్కడ గుంతలు ఉన్నాయి? అవి ఎంత దూరంలో ఉన్నాయో చెప్పే యాప్ గురించి విన్నారా? ఒక్కసారి ఊహించుకోండి.. కారులో రయ్ మంటూ దూసుకె ళుతున్నప్పుడు.. కొంత దూరంలో స్పీడ్ బ్రేకర్ ఉందనో లేక రోడ్డుపై గతుకులు ఉన్నాయనో అలర్ట్ చేసే యాప్ ఉంటే ఎంత బాగుంటుంది! సరిగ్గా ఇలాంటి పనులన్నీ చేసిపెట్టి.. గమ్యానికి మనల్ని సురక్షితంగా చేర్చే యాప్ ఉంది. దీని పేరు ఇంటెంట్స్ నావిగేషన్(Intents Navigation).
నివేదికల ప్రకారం.. రహదారులపై గుంతలు, స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రమాదాలకు గురై సుమారు 10వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరెంతో మంది గాయాల పాలవుతున్నారు. ఇక వర్షాకాలంలో మన దేశంలోని కొన్ని నగరాల్లో రోడ్లు ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయమేస్తుంది. ఎక్కడ గోతులు, గుంతలు ఉన్నాయో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసుకోవడం అంత సులువు కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రయాణమంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో నేవిగేషన్ సిస్టమ్‌ని ఉపయోగించుకుని రోడ్డుపై ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గుంతలు, స్పీడ్ బ్రేకర్లను ముందుగానే గుర్తించి అలర్ట్ చేసే ఈ ఇంటెంట్స్ నావిగేషన్ యాప్‌ను ముగ్గురు ఇంజినీర్లు అభివృద్ధి చేశారు.
దీనిని గూగుల్ ప్లే స్టోర్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ మ్యాప్స్ లేదా యాపిల్ మ్యాప్స్ లానే పనిచేస్తుంది. మొబైల్ స్క్రీన్‌పై మనం ఎటువైపు వెళుతున్నామో చూపిస్తూనే.. వాయిస్ కమాండ్స్‌తో పాటు ఏ వైపు వెళ్లాలో చెబుతుంది. ఇవి రహదారి రోడ్ ఇందులో ఉన్న కొన్ని సెన్సర్లు మనం ప్రయాణిస్తున్న వాహనాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. ఇలా వివిధ రకాల వాహనాల నుంచి సేకరించిన సమాచారం సెంట్రల్ సర్వర్‌కి వెళుతుంది. ఇలా వచ్చిన సమాచారాన్నంతా విశ్లేషించి మనం వెళ్లే ప్రాంతంలో ఎక్కడెక్కడ గుంతలు, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి.. ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేసి వాయిస్ కమాండ్ల రూపంలో సంకేతాలు ఇస్తుంది. సో.. సురక్షితమైన ప్రయాణానికి ఈ ఇంటెంట్ నావిగేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదుకదా!