ఎన్నో నిగూఢమైన రహస్యాలను తనలో దాచుకున్న అంతరిక్షంలో ఒక్కసారైనా అడుగుపెట్టాలని, ఖగోళ రహస్యాలను శోధించాలని ఎంతోమంది వ్యోమగాములు పరితపిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి వీరి కల నెరవేరుతుంది. వ్యోమ గాములే కాదు సామాన్యులు కూడా స్పేస్ సూట్ ధరించి అంతరిక్షంలో అడుగుపెట్టొచ్చు. అంతేగాక అక్కడ ఉన్న పాలపుంతలు, నక్షత్ర మండలాల ముందుండి సెల్ఫీలు కూడా దిగొచ్చు. అదెలా అని ఆశ్చర్యపడకండి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చెందిన జెట్ ప్రొపల్యూషన్ ల్యాబొరేటరీ ఈ సెల్ఫీ యాప్‌తో ఇది సాధ్యం కానుంది. ఇందులో దాదాపు 30 కంటే ఎక్కువ, పాలపుంతలు, సిగర్ గెలాక్సీ, క్రాబ్ నెబులా, గెలాక్టిక్ సెంటర్, లార్జ్ మెగెల్లానిక్ క్లౌడ్ వంటి హై క్వాలిటీ బ్యాగ్రౌండ్‌లు అందుబాటులో ఉంటాయి.
అంతరిక్ష విహారం
ద సెల్ఫీస్ యాప్, ఎక్సో ప్లానెట్ ఎక్స్‌కర్సన్స్ వర్చువల్ రియాలిటీ అనే రెండు వర్చువర్ రియాలిటీ యాప్స్‌ను నాసా రూపొందించింది. నాసా స్పిట్జర్ స్పేస్ టెలీస్కోప్‌ను ఆవిష్కరించి 15 ఏళ్లు అయిన సందర్భంగా వీటిని విడుదల చేసింది. సెల్ఫీస్ యాప్ ద్వారా స్పేస్‌సూట్ ధరించి అంతరిక్షంలో విహరిస్తున్నట్లు కనిపిస్తాం. ఈ అద్భుతమైన చిత్రాల వెనుక ఉన్న కథ, అవి ఏర్పడిన విధానం, ఇతర అంశాలను వివరిస్తుంది. ప్రస్తుతం 30 వరకే బ్యాగ్రౌండ్లు ఉన్నా.. తర్వాత మరిన్ని జోడించనుంది.
NASA Selfies
ఆండ్రాయిడ్ ఫోన్‌లో NASA Selfies యాప్‌ని ఓపెన్ చేయాలి. మెయిన్ స్క్రీన్‌పై ట్యాప్ చేస్తే.. బిల్ట్ ఇన్ కెమెరా ఓపెన్ అవుతుంది. స్క్రీన్‌పై కనిపించే తెల్ల ఫ్రేమ్‌లో ఫేస్ ఉంచి Tick బటన్ మీద క్లిక్ చేయాలి. మెరుగైన ఫలితాలు రావాలంటే బ్యాగ్రౌండ్ ఖాళీగా ఉండటం మంచిది. కేవలం సెల్ఫీ కెమెరాతోనే గాక.. వెనుక ఉన్న కెమెరాను కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. సెల్ఫీ దిగిన తర్వాత.. ఆటోమేటిగ్గా స్పేస్ సూట్‌లో మన ఫేస్ యాడ్ అయి అంతరిక్షంలో విహరిస్తున్న భావన కలిగిస్తుంది. తెల్ల ఫ్రేమ్‌లో ఎంత సరిగ్గా సెల్ఫీ తీసుకుంటే.. అంత యథార్థంగా ఫొటో కనిపిస్తుంది. ఒకవేళ ఫొటో బ్యాగ్రౌండ్ నచ్చకపోతే.. Select బటన్ మీద క్లిక్ చేసి అందుబాటులో ఉన్న 30 బ్యాగ్రౌండ్లలో నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. ఈ ఫొటో నచ్చితే.. Save బటన్ మీద క్లిక్ చేస్తే ఫోన్‌లో అంతరిక్ష సెల్ఫీ సేవ్ అవుతుంది.
Exoplanet Excursions app
వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ సాయంతో ఎక్సో ప్లానెట్ ఎక్స్‌కర్షన్స్ యాప్‌ను ఉపయోగించగలం. దీని వల్ల భూమి పరిమాణం గల గ్రహాలు గల ఇతర గ్రహ వ్యవస్థల్లో ఒకటైన TRAPPIST-1కి మనల్ని తీసుకువెళుతుంది. ఇందులో స్పిట్జర్ అనే టెలీస్కోప్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రహాలను గుర్తించడంతో పాటు, వీటి గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఈ ట్రాపిస్ట్-1 వ్యవస్థ టెలీస్కోప్‌కి దూరంగా ఉన్నా.. విర్చువల్ రియాలిటీ ద్వారా మనం అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ వ్యవస్థలో ఉన్న ఏడు గ్రహాల్లో.. ఐదింటిని నిశితంగా పరిశీలించవచ్చు. వీటి మీద గల నక్షత్రాలు, ఉపరితలం, కాంతి, ఇతర అంశాలను గమనించవచ్చు.