బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఇప్పుడు యూత్‌ను భయపెడుతుంటే.. వీటికి ఒక కొత్త వ్యాధి తోడయింది. ఎక్కువ సమయం స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోతున్న వారు అనారోగ్యాల బారిన పడిపోతున్న విషయం తెలిసిందే. మెడ కిందికి పెట్టి ఫోన్ వంకే చూడటం వల్ల మెడ కండరాల నొప్పులు, రాత్రి వేళల్లోనూ ఫోన్ ఉపయోగించడం వల్ల కంటి సమస్యలు, గంటల కొద్దీ అస్పష్టమైన పోశ్చర్‌లో కూర్చోవడంతో వెన్ను నొప్పి.. ఇలా యుక్త వయసులోనే అన్ని సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా మరీ ముఖ్యంగా వాట్సాప్ ఎక్కువగా ఉపయోగించం వల్ల Whatsappitis అనే కొత్త వ్యాధి వస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ అనారోగ్య సమస్యలే..
ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగి తేలిపోతోంది. దాదాపు 25 శాతం ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు అనేక అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతోంది. సోషల్ మీడియా ప్రభావంతో ఇప్పుడు Whatsappitis అనే కొత్త వ్యాధి వస్తోంది. సెల్‌ఫోన్‌లో ఎక్కువ సేపు బొటన వేలితో టైప్ చేస్తుండటం వల్ల చేతి బొటనవేలి కండరాలు ఒత్తిడికి గురై దెబ్బతింటున్నాయని, ఫలితంగా చేతి మణికట్టు సమస్యలు వస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోవడంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ని ఎక్కువ సేపు ఉపయోగించడం ఎముకలు, కండరాలు, కీళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.
యుక్తవయస్కులు అప్రమత్తం
మెడను వంచి చూడటంతో పాటు ఎక్కువసేపు అస్పష్టమైన ఆకృతిలో ఉండటంతో వెన్నెముక సమస్యలు వస్తున్నాయని ఆర్థోపిడీషియన్లు వివరిస్తున్నారు. ముఖ్యంగా యుక్తవయస్కుల్లో ఇది ఎక్కువగా ఉందని ఆకాశ్ హెల్త్‌కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఎండీ, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఆశిష్ చౌదరి తెలిపారు. ఎక్కువ సేపు బొటనవేలితో మెసేజ్‌లు టైప్ చేస్తూ ఉండటం వల్ల టెక్ట్స్ నెక్ అనేది ప్రస్తుతం అందరిలోనూ సర్వసాధారమైపోయిందని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి టీనేజర్ల వరకూ ఎంతోమంది కండరాల నొప్పులు, భుజం, మెడ కండరాల నొప్పులతో పాటు వెన్నెముక నొప్పులతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ కాలం గ్యాడ్జెట్స్ ఉపయోగించడంతో చేతి కండరాలు, మణికట్టు కండరాలను బలహీనపరుస్తుందని బీఎల్‌కే సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఈశ్వర్ బోహ్రా తెలిపారు.