ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సరికొత్త నిర్ణయంతో వినియోగదారుల్లో ఆసక్తి పెంచింది. వందల బ్రాండ్లకు చెందిన వేల ఫోన్లను నిత్యం విక్రయించే అమెజాన్ పనిలోపనిగా తన సొంత బ్రాండ్ తో స్మార్టు ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. భారత్ వంటి వర్ధమాన దేశాలు, గాడ్జెట్స్ మార్కెట్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే లక్ష్యంగా బడ్జెట్ రేంజిలో మంచి ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఓఎస్ స్మార్టు ఫోన్లను లాంఛ్ చేయనున్నట్లు సమాచారం.
బడ్జెట్ రేంజిలోనే...
కాగా అమెజాన్ తయారుచేస్తున్న ఈ ఫోన్ల గురించి పలు అంతర్జాతీయ టెక్ వెబ్ సైట్లలో వివరాలు దర్శనమిస్తున్నాయి. 5.2...5.5 అంగుళాల స్క్రీన్లతో రెండు ఫోన్లను తయారుచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో 13 ఎంపీ కెమెరా, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఉంటాయట. అంతేకాదు.. గూగుల్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ 7.1.1 ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లూ ఇందులో ఉంటాయని సమాచారం. వీటి ధర రూ.6 వేలు ఆపైన ఉండొచ్చని టాక్.
రెండో ప్రయత్నం సక్సెస్ అయ్యేనా?
కాగా అమెజాన్ స్మార్టు ఫోన్లను తయారుచేయడం ఇదే తొలిసారి కాదు. 2014లో ఒకసారి ఫైర్ ఫోన్ పేరుతో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఒకటి అమెజాన్ విడుదల చేసింది. అయితే, దీనికి పెద్దగా ఆదరణ రాలేదు. దీంతో వాటి తయారీని నిలిపివేసింది. ఇప్పుడు రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.