• తాజా వార్తలు

రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రివ్యూ


రెడ్‌మీ నోట్ 7 ప్రో.. మార్కెట్లోకి రాక‌ముందే ఎంతో సంచ‌ల‌నం సృష్టించిన స్మార్ట్ ఫోన్. ఈ మ‌ధ్య కాలంలో ఏ ఫోన్ కోసం వెయిట్ చేయ‌నంత‌గా జ‌నం ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.. వీట‌న్నింటికీ కార‌ణం ఒక‌టే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ఉన్న 48 మెగాపిక్సెల్ రియ‌ర్  కెమెరా. అదీ సోనీ లెన్స్‌తో రావ‌డం, ధ‌ర కూడా అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది ఈ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 13న ఈ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ స్టోర్స్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా ల‌భిస్తుంది. ఇంత‌గా ఆస‌క్తి రేపుతున్న ఈ రెడ్‌మీ నోట్‌7 ప్రో మీద ప్రివ్యూ మీకోసం..

స్టైల్‌, డిజైన్‌
గ్లాస్ బ్యాక్‌తో వ‌చ్చిన తొలి రెడ్‌మీ నోట్ ఫోన్ ఇది. నెబ్యూలా రెడ్‌, నెఫ్ట్యూన్ బ్లూ, బ్లాక్ క‌ల‌ర్స్‌లో ల‌భిస్తుంది. గ్లాస్‌తో కూడిన ప్యాన‌ల్ కావ‌డంతో గీత‌లు ప‌డే అవ‌కాశం ఉంది.  అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్ ఉండ‌డంతో చాలా ప్రొటెక్ష‌న్ ఉన్న‌ట్టే. అంతేకాదు ప్రొటెక్టివ్ లేయ‌ర్ కూడా రెడ్‌మీలో వ‌చ్చిన మిగతా మోడ‌ల్స్ కంటే 0.1 మి.మీ. ఎక్కువ మందంగా ఉంటుంది. కాబ‌ట్టి పొర‌పాటున చేయి జారినా ఫోన్ త‌ట్టుకోగ‌లుగుతుంద‌ని కంపెనీ చెబుతోంది. 

డిస్‌ప్లే
డాట్ నాచ్‌తో కూడిన 6.30 అంగుళాల డిస్‌ప్లే రెడ్‌మీ నోట్ 7 ప్రో సొంతం. త‌క్కువ బీజిల్స్‌తో ఉండ‌డం వ‌ల్ల  రెడ్‌మీ నోట్ 6 ప్రో సైజ్‌లో ఉన్నా డిస్‌ప్లే దాని క‌న్నా కాస్త‌ ఎక్కువగా వ‌స్తుంది. కొద్దిగా పొడ‌వు ఎక్కువ ఉంటుంది. కానీ మందం 8.1 మి.మీ. ఉంటుంది. 

మాన్‌స్టర్ కెమెరా
రెడ్‌మీ నోట్ 7 ప్రోను ఇంత పాపుల‌ర్ చేసింది కెమెరానే. 48 మెగాపిక్సెల్ సోనీ లెన్స్‌తో వెనుక‌వైపు కెమెరా ఉంటుంది. అంతేకాదు లెన్స్ సైజ్ కూడా పెద్ద‌దిగా అరంగుళం వ‌ర‌కు ఉంది. 48 మెగాపిక్సెల్ షాట్ అనే ఆప్ష‌న్ ఉంది. దీంతో ఫోటో తీస్తే ఫోటో సూప‌ర్ డెప్త్‌తో  వ‌స్తుంది. ఎంత పెద్ద ఫోటో వేయించుకున్నా డిటైల్స్ ఏమీ పోవు (అంటే ఫోటో పిక్సెల్స్ బ్రేక్ కావు). దీంతోనే 12 మెగాపిక్సెల్ షాట్స్ కూడా తీసుకోవ‌చ్చు. ఇవి కూడా మంచి డెప్త్‌తో వ‌స్తాయి. మామూలు ఫోన్ల‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాతో వ‌చ్చే ఫొటోల కంటే ఈ ఇమేజ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీనికి కార‌ణం పెద్ద లెన్సే. ఇక సెకండ‌రీ కెమెరాగా వెన‌క‌వైపు మరో 5 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. 

ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్స్‌. దీని ముందు మోడ‌ల్ అయిన రెడ్‌మీ నోట్ 6 ప్రోలోనే 20 ఎంపీ, 2 ఎంపీతో రెండు సెల్ఫీ కెమెరాలున్నాయి. ఇప్పుడు ఎందుకు వెన‌క్కి త‌గ్గార‌ని ప్ర‌శ్నిస్తే ఒక్క‌సారి ఫోటో తీశాక చూడండి  మా సెల్ఫీ కెమెరా పెర్‌ఫార్మెన్స్ ఏమిటో అని రెడ్‌మీ చెబుతోంది.  13 ఎంపీ కెమెరాయే అయినా ఈ సెల్ఫీ కెమెరాలో ఏఐ బ్యూటీ, స్టూడియో లైటింగ్ వంటి సూప‌ర్ ఫీచ‌ర్లున్నాయి.

వాల్యూమ్ బ‌ట‌న్‌తో ఫోటోలు తీసుకోవచ్చు.  అలాగే గూగుల్ అసిస్టెంట్‌ను కూడా ఫోటో తీయ‌మ‌ని అడ‌గొచ్చు. 

ప‌వ‌ర్‌ఫుల్‌
ఇక ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్పెక్యులేష‌న్స్ చూస్తే రెడ్‌మీ నోట్ 7 ప్రోలో ప‌వ‌ర్‌ఫుల్‌, లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 675 చిప్ సెట్ ఉంది. ఇండియాలో ఈ చిప్ సెట్ ఉన్న రెండో ఫోన్  ఇదే.  రెడ్‌మీ నోట్ 7 ప్రో కి ప్ర‌ధాన ఆకర్ష‌ణ అయిన 48 మెగాపిక్సెల్ కెమెరాను ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌ని చేయించ‌డానికి ఇంత లేటెస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ చిప్‌సెట్ వాడారు. స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెస‌ర్ క‌న్నా ఇది చాలా అడ్వాన్స్‌డ్.  అందుకే ప‌బ్‌జీ లాంటి హెవీ గేమ్ కూడా స్మూత్‌గా ఆడుకోవ‌చ్చ‌ని రెడ్‌మీ హామీ ఇస్తోంది. 4జీబీ/ 6జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ ఫాస్ట్‌గా ప‌ని చేస్తుంది. 64/128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంది. ఎస్డీ కార్డ్‌తో ఎక్స్‌పాండ్ చేసుకునే అవ‌కాశం లేదు.

క‌నెక్టివిటీ ఆప్ష‌న్స్ 
4జీ, బ్లూటూత్‌, వైఫై, జీపీఎస్ క‌నెక్టివిటీ ఉన్నాయి. వీటితోపాటు ఇన్‌ఫ్రారెడ్ పోర్ట్ కూడా ఉంది. కాబ‌ట్టి దీన్ని అవ‌స‌ర‌మైతే టీవీ, ఏసీ రిమోట్‌గా కూడా వాడుకోవ‌చ్చ‌ని రెడ్‌మీ చెబుతోంది. 

బ్యాట‌రీ 
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఉంది. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే యావ‌రేజ్ యూజ‌ర్ రెండు రోజుల‌పాటు వాడుకోవ‌చ్చు. క్విక్ చార్జి 4.0 ఫీచ‌ర్‌తో వ‌చ్చిన ఈ ఫోన్‌లో యూఎస్‌బీ సీ టైప్ పోర్ట్ ఉంది.  

ఓఎస్‌
ఎంఐయూఐ 10తో టాప్ చేసిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ పై ఓఎస్ ఈ ఫోన్ సొంతం. చిన్న‌చిన్న చినుకుల్లో త‌డిచినా ఏమీ కాదు. ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్ వెన‌క‌వైపు ఉంది.  ఫేస్ అన్‌లాక్ ఫీచ‌ర్ ఉంది. ఈ రెండూ కూడా ఫాస్ట్‌గా ప‌ని చేస్తున్నాయి. 

ఒప్పో కే1, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 30 లాంటి ఫోన్లు దాదాపు ఇదే ఫీచ‌ర్ల‌తో వ‌స్తున్నా దీనిలో ఉన్న 48 మెగాపిక్సెల్  కెమెరా, సూప‌ర్ ఫాస్ట్ ప్రాసెస‌ర్‌ను రెడ్‌మీ నోట్ 7 ప్రోను మార్కెట్లో కింగ్‌ను చేస్తాయ‌ని రెడ్‌మీ చెబుతోంది. చూద్దాం 10 రోజుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వ‌స్తుంది క‌దా.. 
 

జన రంజకమైన వార్తలు