• తాజా వార్తలు

ప్రివ్యూ- మ‌న కొత్త వంద రూపాయ‌ల నోటు

అతి త్వ‌ర‌లోనే కొత్త వంద రూపాయల నోటు దేశీయ మార్కెట్‌లోకి విడుద‌ల కాబోతోంది. వెయ్యి, రూ. 500 నోట్ల‌ను 2016, న‌వంబ‌రు 8న ర‌ద్దు చేసిన త‌ర్వాత‌.. కొత్త రూ.2000, రూ.500, రూ.200, రూ.50, రూ.10 నోట్ల‌ను భార‌త రిజ‌ర్వ్ బ్యాంకు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో రూ.100 నోటు విడుద‌ల చేయ‌బోతోంది. ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన కొత్త నోట్ల కంటే భిన్నంగా ఉండ‌టంతో అంద‌రి దృష్టి ఆక‌ర్షిస్తోంది. లావెండ‌ర్‌(లేత వంగ‌పువ్వు) రంగులో మెరిసిపోతూ ఉన్న ఈ కొత్త నోటులో చాలా కొత్త విష‌యాలే దాగున్నాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం!! 

* పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఙానంతో ముద్రించిన‌ తొలి క‌రెన్సీ నోట్ ఇది. ఈ నోటు డిజైన్‌,పేప‌ర్, సెక్యూరిటీ ఫీచ‌ర్లు, ఇంక్ వంటివ‌న్నీ భార‌త్‌లో రూపొందించిన‌వేన‌ని ప్ర‌భుత్వాధికారులు చెబుతున్నారు. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న క‌ల నిజ‌మైంద‌ని దేశంలో నోట్ల‌ను ముద్రించే భార‌తీయ రిజ‌ర్వ్ బ్యాంక్ నోట్ ముద్ర‌న్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుధాక‌ర్‌ తెలిపారు.

* మైసూర్‌లోని BRBNM Design Studioలో కొత్త నోటును ముద్రించారు. ప్ర‌స్తుతం చ‌లామ‌ణీలో ఉన్న రూ.100 నోటు కొల‌త‌కు ఈ కొత్త నోటుకు పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇది 66 mm x 142 mm ప‌రిమాణంలో ఉంది.

* లావెండ‌ర్‌ రంగుతో పాటు దీని డిజైన్ కూడా కొత్త‌గా ఉండ‌టంతో మ‌రింత ఆకర్ష‌ణీయంగా ఉంది. ముందు, వెనుక భాగంలో రేఖా గ‌ణిత న‌మూనాలను ముద్రించారు. వీటిని ఈ కొత్త నోటు కోస‌మే రూప‌క‌ల్ప‌న చేశారు. 

* కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన నోట్ల వెనుక భాగంలో ఏదో ఒక వార‌స‌త్వ క‌ట్ట‌డాలను ముద్రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే! కొత్త రూ.10 నోటుపై కోణార్క్ సూర్య దేవాల‌యం, రూ. 50 నోటుపై ప్రపంచ వారస‌త్వ సంప‌ద‌గా యునెస్కో గుర్తించిన‌ హంపిలోని రాతి శిల్పాలను రూ.200 నోటుపై సాంచీ స్థూపాల చిత్రాల‌ను ముద్రించింది. 

* కొత్త రూ.100 నోటుల వెనుక భాగంలో క‌నిపిస్తున్న కోట `రాణీకీ వావ్‌`. చారిత్రక గుర్తింపు గ‌ల ఈ క‌ట్ట‌డం గుజ‌రాత్‌లో ప‌ఠాన్ ప‌ట్ట‌ణంలో  ఉంది. ఏడు భూగ‌ర్భ అంత‌స్తుల మెట్ల‌ బావి. భూగ‌ర్భ నీటి వ‌న‌రుల‌ను వాడుకునేందుకు దీనిని నిర్మించారు. రాతితో నిర్మించిన ఈ స్తంభాల‌పై శిల్ప‌క‌ళ ఉట్టిప‌డుతుంది. దీనికి ప్రపంచ వార‌స‌త్వ క‌ట్ట‌డంగా యునెస్కో 2014లో గుర్తింపు ఇచ్చింది.  స‌రస్వ‌తీ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో పూడుకు పోయింది. 

* ముందు భాగంలో ప్ర‌చ్ఛ‌నంగా ఉండే ఇమేజ్‌పై రూ.100 అంకెల రూపంలో ఉంటుంది. దేవ‌నాగ‌రి లిపిలో 100 అని రాసి ఉంది. వీటితో పాటు ఇండియా, భార‌త్‌,  ఆర్‌బీఐ అనే ప‌దాలు కూడా క‌నిపిస్తాయి. 

* అంధులు ఈ కొత్త నోటును గుర్తించేందుకు.. మ‌హాత్మాగాంధీ బొమ్మ, అశోక చిహ్నం, త్రికోణ ఆకృతిలో కొన్ని గుర్తులు, మైక్రో అక్ష‌రాల రూపంలో 100 అంకెలు, కుడి, ఎడ‌మ భాగంలోని నాలుగు లైన్లు కొద్దిగా ఉబ్బెత్తుగా ముద్రించింది.

* ఈ కొత్త నోట్లు మార్కెట్‌లోకి విడుద‌ల‌య్యేందుకు మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టొచ్చ‌ని తెలుస్తోంది. ఇందుకోసం మ‌ళ్లీ ఏటీఎంల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాల్సి ఉంటుంది. ఆగ‌స్టు నెలాఖ‌రులోకి ఇవి అందుబాటులోకి రావొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 
 

జన రంజకమైన వార్తలు