స్మార్ట్‌ఫోన్ కొనాలంటే ఎక్కువ మంది ముందు భయపడేది అమ్మో చేతిలో నుంచి జారిపడితే? పొరపాటున నీళ్లలో పడితే? ఇక అంతే సంగతులు. దాన్ని రిపేర్ చేయించడం కంటే కొత్త ఫోన్ కొనుక్కోవడమే బెటర్ అనేంత స్థాయిలో రిపేర్‌కు ఖర్చవుతుంది. అని భావిస్తారు. ఇప్పుడు చాలా కంపెనీలు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్‌తో ముందుకొస్తున్నాయి. ఏడాదిపాటు మీ ఫోన్‌కు ఎలాంటి డ్యామేజ్ జరిగినా ఫ్రీగా రిపేర్‌చేసి ఇచ్చే ప్లాన్‌తో ఇప్పుడు ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ కూడా మన ముందుకు వచ్చింది. కేవలం 49 రూపాయలకే ఏడాది మొత్తం కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ఇస్తామంటున్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ డిటెయిల్స్ ఏమిటో చూద్దాం
ఇదీ ప్లాన్
ఫ్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ మీరు ఫ్లిప్ కార్ట్‌లో ఫోన్ కొన్నప్పటి నుంచి 12 నెలలపాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ తయారుచేసిన కంపెనీతో మాట్లాడుకోవాలి. మొదటి సంవత్సరం మాత్రం ఎలాంటి డ్యామేజి జరిగినా ఫ్లిప్‌కార్ట్ మీ ఫోన్‌ను బాగు చేయించి ఇస్తుంది. ప్రస్తుతానికి ఇటీవలే లాంచ్ చేసిన ఆసస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్ మీద మాత్రమే ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫర్ ఇస్తోంది. త్వరలో యాపిల్, గూగుల్‌తో పాటు అన్ని మేజర్ బ్రాండ్స్ ఫోన్లకు ఈ స్కీమ్‌ను ఎక్స్‌పాండ్ చేస్తామని చెబుతోంది. ఫోన్ కొనేటప్పుడే ఈ ప్లాన్ కోసం 49 రూపాయలు కూడా చెల్లించాలి. భవిష్యత్తులో ఈ ప్లాన్ ఖరీదు పెరిగే అవకాశం ఉంది. పెంచినా సర్వీస్ సెంటర్‌లో చెల్లించేదానికంటే చాలా తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు.
ఎలాంటి డ్యామేజయినా ఓకే
పొరపాటున చేతిలో నుంచి జారిపడినా, నీళ్లు వంటి లిక్విడ్ పడడం వల్ల ఫోన్ పాడయినా, స్క్రీన్ పగిలినా, సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ స్కీమ్‌లో కవర్ అవుతుంది.
* ఫ్లిప్‌కార్ట్ 10 డేస్ రీప్లేస్‌మెంట్ గ్యారంటీ ఆఫర్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రీప్లేస్‌మెంట్ గ్యారంటీ గడువు పూర్తయ్యాకే ఈ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అమల్లోకి వస్తుంది.
* ఫోన్ పాడయిందని ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు మీరు సమాచారం ఇస్తే చాలు వాళ్లే వచ్చి పికప్ చేసుకుంటారు. బాగు చేశాక తీసుకొచ్చి అప్పగిస్తారు. ఇదంతా ఫ్రీ సర్వీసే.
* సర్వీస్ చేసి మీకు ఇవ్వడానికి మ్యాగ్జిమం 10 రోజులు పడుతుంది.