దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్ సర్వీసుల ద్వారా లావాదేవీలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం, గూగుల్ తేజ్(ఇప్పుడు గూగుల్ పే), ఫోన్ పే వంటి యాప్స్ వినియోగం అధికమైంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో దేశంలో దూసుకుపోతున్న షియామి సంస్థ.. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ సర్వీసెస్‌పై దృష్టి సారించింది. Mi Pay పేరుతో యూపీఐ సర్వీసెస్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ సర్వీసును 2016లో చైనాలో షియామి ప్రారంభించింది. ఇది శామ్‌సంగ్ పే, యాపిల్ పే లానే పనిచేస్తుంది. ఎన్ఎఫ్‌సీ లేదా వైర్‌లెస్ ట్రాన్స్‌ఫర్ విధానంలో ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు.
షియామి Mi Pay సర్వీసును త్వరలోనే దేశీయ మార్కెట్‌లోకి విడుదల చేయబోతోంది. ఫోన్‌పే, భీమ్ యాప్‌లలానే యూపీఐ సర్వీసెస్‌పై ఆధారపడి సేవలు అందిస్తుంది. షియామి సంస్థ ఇప్పటికే దీనిపై పలు పరీక్షలు నిర్వహించింది. దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు గల అనుమతి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)కి దరఖాస్తు చేసింది. ఆర్‌బీఐ నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీనిని విడుదల చేయనుంది. ప్రస్తుతం సిస్టమ్ ఇంటిగ్రేషన్ కోసం ప్రముఖ ప్రైవేట్ సంస్థలతో చర్చలు జరుపుతోంది. అంతేగాక మరింతమంది భాగస్వాముల కోసం ప్రయత్నాలు చేస్తోందని నివేదికల ద్వారా తెలుస్తోంది. ప్రముఖ ఆర్థికవేత్త వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాతవే సంస్థ పేటీఎం సంస్థలో దాదాపు 350 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ అంతా ఆన్‌లైన్ పేమెంట్లు, వీటిని అందించే సంస్థలపైనే ఆధారపడి ఉంటుందని తేలింది. దీంతో షియామి కూడా ఆన్‌లైన్ సర్వీసెస్‌పై దృష్టిసారించిందని స్పష్టమవుతోంది. ఇప్పటికే దేశంలో గూగుల్ పే, ఫోన్‌పే వంటివి సమర్థంగా ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్నాయి. సోషల్ మెసెంజింగ్ యాప్ వాట్సాప్ కూడా యూపీఐ ఆధారిత లావాదేవీలను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇది ఇంకా తొలి దశలోనే ఉన్నాయి. అనుమతి, ఇతర అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో షియామికి కూడా ఈ యూపీఐ సర్వీసును విడుదల చేసేందుకు ఆటంకాలు తప్పకపోవచ్చని తెలుస్తోంది.