వేగవంతమైన 4జీ మొబైల్ ఇంటర్నెట్ ను ఉచితంగా ఇవ్వడంతో పాటు కాల్స్ కూడా ఫ్రీగా ఇచ్చి అన్ని టెలికాం సంస్థలనూ చాపచుట్టేసిన రిలయన్స్ జియో ఇప్పుడు ఇంటర్నేషనల్ కాల్స్ ధరలు కూడా బాగా తగ్గంచేసిమిగతా సర్వీస్ ప్రొవైడర్లను ఇరకాటంలో పడేసింది. ఇంటర్నేషనల్ కాల్స్ ధరలు కూడా భారీగా తగ్గిస్తే మిగతా సంస్థలు అంతటి నష్టాన్ని తట్టుకోవడం కష్టం. దీంతో జియో దెబ్బకు తట్టుకోలేక అంతా విలవిలలాడుతున్నారు.
జియో లేటెస్టుగా అంతర్జాతీయ కాల్స్ పైనా ఇతర టెలికాం దిగ్గజాలతో ధరల యుద్ధాన్ని ప్రకటించింది. 'రేట్ కట్టర్ ప్లాన్' ను ప్రకటించింది. ఈ ప్లాన్ను యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు వారి అంతర్జాతీయ కాల్ ఛార్జీలు భారీగా కిందకి దిగొస్తాయని రిలయన్స్ జియో వెబ్సైట్లో ప్రకటించారు. నిమిషానికి కనిష్టంగా మూడు రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు పేర్కొంది. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, హాంకాంగ్, సింగపూర్, అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్ గినియా, ఇటలీ, లుక్సెంబర్గ్, మాల్టా, మంగోలియా, మోరోకో, పోలాండ్, పోర్చుగల్, రోమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, యూకే వంటి దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఈ దేశాలకు కాల్స్ చేసుకునే జియో యూజర్లకు నిమిషానికి 3 రూపాయల ఛార్జీ మాత్రమే వేయనున్నట్టు వెల్లడించింది. దీనికోసం 501 రూపాయలతో రిలయన్స్ జియో ''రేట్ కట్టర్ ప్లాన్'' ను యూజర్లు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, జపాన్, అర్జెంటీనా, డెన్మార్క్, దక్షిణకొరియా దేశాల కాల్స్ రేట్లను నిమిషానికి 4.8గా నిర్ణయిస్తున్నట్టు కంపెనీ వెబ్ సైట్ రిపోర్టు చేసింది. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ కు పోటీగా తమ పోస్టు పెయిడ్ కొత్త ఆఫర్లు ప్రకటించిన ఎయిర్ టెల్ విదేశాలకు వెళ్లేవారికి డిస్కౌంట్ ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. వెంటనే జియో కూడా అంతర్జాతీయ కాల్స్ పైనా తనస్టైల్లో ఆపర్ పెట్టేసింది.