భారత టెలికాం రంగం యొక్క పరిస్థితి 2015-16 వరకూ మందకొడి గానే ఉండేది. అయితే ఒక్కసారిగా జియో ఈ రంగం లో అడుగుపెట్టి ఉచిత సర్వీస్ లను ఆఫర్ చేయడం ప్రారంభించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా భారత టెలికాం రంగానికి ఒక సరికొత్త ఊపు వచ్చింది. దేశం లోనే ధనవంతుడైన ముఖేష్ అంబానీ కలల ప్రాజెక్ట్ గా మొదలైన జియో భారత టెలికాం రంగాన్ని భారీ కుదుపునకు గురిచేసింది. దీని రాకతో భారత టెలికాం రంగo లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా వరకూ టెలికాం ఆపరేటర్ లు విలీన ప్రక్రియలను ప్రారంభించాయి. అనుకున్నదంతా జరిగితే మరికొద్ది రోజుల్లో భారత టెలికాం రంగం లో కేవలం 5 లేదా 6 ఆపరేటర్ లు మాత్రమే ఉంటాయి. అవేంటో చూద్దాం.
1. రిలయన్స్ జియో
2. ఎయిర్ టెల్ ( టెలినార్, ఆగర్ వైర్ లెస్, పాక్షికంగా వీడియో కాన్, టికోనా మరియు ఎయిర్ సెల్ ల 4 జి స్పెక్ట్రమ్ లను కలుపుకుని )
3. వోడాఫోన్ – ఐడియా
4. R- com ఎయిర్ సెల్ – SSTL
5. టాటా టెలి
6. BSNL- MTNL
వీటన్నింటిలోనూ వోడాఫోన్ –ఐడియా యొక్క విలీనమే అతి పెద్దది గానూ జియో మరియు ఎయిర్ టెల్ లకు గట్టి పోటీ ఇచ్చేది లానూ కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి నాణ్యమైన 4 జి సేవలను అందించే సత్తా జియో కి మరియు ఎయిర్ టెల్ కు మాత్రమే ఉంది అనేది నిర్వివాదాంశం.
జియో గత సెప్టెంబర్ నుండీ ఉచిత సర్వీస్ లను అందిస్తుంది. ఈ ఉచిత సర్వీసులు అధికారికంగా ఈ ఏప్రిల్ లో ముగిశాయి. అంటే ఒక ఏడు నెలల పాటు జియో తన ఉచిత సర్వీస్ లతో దేశాన్ని ఊపేసింది అన్నమాట. ఇక్కడ జియో యొక్క ప్రణాళిక చాలా స్పష్టం గా కనిపిస్తుంది. మొదటగా వినియోగదారులను జియో కి అలవాటు చేస్తే మరొక రకంగా చెప్పాలి అంటే బానిసలను చేస్తే ఆ తర్వాత పెయిడ్ సర్వీస్ లు పెట్టినా వారు ఎక్కడికీ పోరు అనేది జియో ప్లాన్. అయితే వినియోగదారులు ఏమీ పిచ్చివారు కాదు కదా! దీనికి తోడు జియో ఆఫర్ లను తలదన్నే రీతిలో మిగతా ఆపరేటర్ లు కూడా తమ ఆఫర్ లను ప్రకటించడం తో జియో కూడా వినియోగదారునికి అందుబాటులో ఉండే ఆఫర్ లనే ప్రకటించింది. అయితే ఇక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే రెగ్యులర్ వాయిస్ సర్వీస్ లు, మెసేజ్ లు మరియు డేటా తో పాటు జియో తన ఆఫర్ ను డిజిటల్ సర్వీస్ లైన జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ లాంటివాటికి పొడిగించింది. జియో తనకు పోటీదారులు ఎవరూ ఉండకూడదు అని కోరుకుంటుంది. కొంతవరకూ ఆ ప్రయత్నం లో విజయం సాధించింది కూడా. తత్ఫలితమే వోడాఫోన్ ఐడియా విలీనం మరియు చిన్న చిన్న ఆపరేటర్ లతో ఎయిర్ టెల్ యొక్క ఒప్పందం.
అయితే జియో కి కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి.దీనియొక్క వాయిస్ నెట్ వర్క్ అంత స్థిరంగా లేదు , కాల్స్ చేసేటపుడు కస్టమర్ లు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, కాల్ లు మద్య లోనే కట్ అవుతున్నాయి. ఈ మధ్య జియో సర్వీస్ లు అధికారికంగా లాంచ్ అయిన నేపథ్యం లో ఈ సమస్యలు అన్నింటికీ జియో చెక్ పెడుతుందని మనం భావించవచ్చు. దేశ వ్యాప్తంగా ఇది నెట్ వర్క్ టవర్ లను ఏర్పాటు చేయనుంది. ఈ టవర్ ల వలన అంతరాయం లేని వాయిస్ కాల్స్ తో పాటు హై స్పీడ్ డేటా ను పొందవచ్చని జియో చెబుతుంది.
మరొక పక్క పోటీ కంపెనీలు కూడా ఏమీ తక్కువ తినలేదు అన్నట్లుగా తమ ప్రణాళికల తో సిద్దం గా ఉన్నాయి. జియో వచ్చినప్పటికీ వినియోగదారుల మొదటి ఛాయస్ ఎయిర్ టెల్ మాత్రమే. ఎందుకంటే ఆ విధంగా ఎయిర్ టెల్ పాపులారిటీ ని సంపాదించుకుంది. మరి ఆ పేరు ను నిలబెట్టుకునే చర్యల్లో భాగంగా ఎయిర్ టెల్ కూడా జియో కి పోటీ గా ఆకర్షణీయమైన ఆఫర్ లతో పాటు తమ సేవల యొక్క నాణ్యత ను మరింత పెంచే దిశలో భాగంగా దేశం లోని దాదాపు అన్ని సర్కిల్ లలోనూ 4 జి సేవలను స్టార్ట్ చేయడానికి సిద్దంగా ఉంది. మరొక పక్క ఐడియా, వోడాఫోన్ ల బంధం బలపడి తెరమీదకు వస్తే ఇది దేశంలోనే అతి పెద్ద నెట్ వర్క్ గా అవతరించే అవకాశం ఉంది. దీనికి తగ్గ ఆఫర్ లనూ మరియు సేవల నాణ్యతనూ ఇది ఇప్పటికే సిద్దంగా ఉంచుకున్నట్లు సమాచారం.