రెండు, మూడేళ్ల కిందటి వరకు సెల్‌ఫోన్ యూజర్లు కాల్స్ కోసం ఓ ప్రీపెయిడ్ ప్యాక్, డేటా కోసం మరో ప్యాక్ వేసుకోవాల్సి వచ్చేది. ఎయిర్‌టెల్, ఐడియా లాంటి సంస్థలు కొన్ని కాంబో ప్లాన్స్ తీసుకొచ్చినా అవి ఖరీదు ఎక్కువగా ఉండేవి. జియో రాకతో ఇలా రెండు ప్యాక్స్ అనే మాట చెరిగిపోయింది. ఎప్పుడయితే జియో కాంబో ప్లాన్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఎయిర్‌టెల్, ఐడియా ఇలా అన్ని కంపెనీలు కూడా కాంబో ప్లాన్స్ (డేటా, వాయిస్, ఎస్ఎంస్, రోమింగ్ అన్నింటికీ కలిపి ఒకటే ప్లాన్) తీసుకొచ్చాయి. అయితే కానీ మళ్లీ ఇప్పుడు వాయిస్ ఓన్లీ ప్రీ పెయిడ్ ప్లాన్స్‌ను ఎయిర్‌టెల్, ఐడియా వంటివి తెస్తున్నాయి.. ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలోనూ కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే ఇచ్చే ఈప్లాన్స్ ఎంతవరకు నిలదొక్కుకుంటాయో చూద్దాం.
ఐడియా, ఎయిర్‌టెల్ ప్యాకేజీలు
ఐడియా 295 ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఎలాంటి డైలీ డేటా బెనిఫిట్స్ ఉండవు. 42రోజుల వ్యాలిడిటీతో 5జీబీ (2జీ/ 3జీ / 4జీ) బండిల్డ్ డేటా ఇస్తుంది. దీన్ని ఈ వ్యాలిడిటీ పీరియడ్‌లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇక వాయిస్ కాల్స్ అన్‌లిమిటెడ్ ఫ్రీ. అయితే రోజుకు 250 నిముషాలు, వారానికి 1000 నిముషాలు మించకూడదు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీ. అలాగే 149 రూపాయలతో మరో ప్లాన్ ఉంది. దీనిలో అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్, రోజూ 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. వాలిడిటీ 21 రోజులు.
ఎయిర్‌టెల్ 299 వాయిస్ ఓన్లీ ప్లాన్‌లో ఎలాంటి డేటా బెనిఫిట్స్ ఉండవు. అన్‌లిమిటెడ్ ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ 45 రోజులు. రోజుకు 100 ఎస్ఎంస్‌లు ఫ్రీ. ఎయిర్‌టెల్ 199 ప్లాన్‌లో ఇదే ఆఫర్ 28 రోజలు వర్తిస్తుంది. అయితే రోజుకు 1.4 జీబీ డేటా కూడా ఇస్తుంది. అయితే జియో మాత్రం ఇలాంటి ప్లాన్లేవీ తీసుకురాలేదు.
ఎవరికోసం?
ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల యూజర్లు కోట్ల మంది ఉన్నారు. అలాగే ఇంకా కొన్ని కోట్ల మంది ఫీచర్ ఫోన్లే వాడుతున్నారు. నగర ప్రాంతాల్లో అన్ని వయసులు, వర్గాలవారు యాప్స్, ఇంటర్నెట్ వాడకానికి బాగా అలవాటుపడ్డారు. వారికి కాంబో ప్యాక్‌లే నడుస్తాయి. అందుకే అత్యధిక మంది యూజర్లు తమ పాత నెంబర్‌ను వాయిస్ కాల్స్ కోసం అట్టిపెట్టుకుని రెండో సిమ్‌గా జియో తీసుకుంటున్నారు. దీనిలో ఫ్రీ కాల్స్ రోజూ కనీసం 1 జీబీ డేటా వస్తుండడంతో ఇలా వాడుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ, పట్టణ ప్రాంతాల్లో పెద్ద వయసువారు, పెద్దగా చదువుకోనివారు నేటికీ వాయిస్ కాల్స్ మీదే ఆధారపడుతున్నారు. అందుకే ఇంకా ఫీచర్ ఫోన్లు నడుస్తున్నాయి. వీళ్లనే టార్గెట్ చేసుకుని అన్‌లిమిటెడ్ కాల్స్‌తో వాయిస్ ఓన్లీ ప్లాన్లను కంపెనీలు ప్రవేశపెడతున్నాయి.
ఎన్నాళ్లుంటాయో?
రిలయన్స్ జియో ఫోన్ తీసుకురావడం, స్మార్ట్‌ఫోన్ ధరలు కూడా బాగా తగ్గడం, డేటా యూసేజ్‌కు క్రమంగా అందరూ అలవాటు పడడంతో ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ ఫోన్లకు మారేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే వాయిస్ ఓన్లీ ప్లాన్స్ బతికి బట్టకట్టడం కష్టం. ఆ విషయం టెలికం కంపెనీలకు కూడా తెలుసు. అందుకే సాధ్యమైంత తక్కువ కాలంలో ఎక్కువ బిజినెస్ చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని తాపత్రయపడుతున్నాయి.