కారణం ఏదైనా కానీ ప్రస్తుత భారత టెలికాం రంగం లోని ఆపరేటర్ ల మధ్య విపరీతమైన పోటీ నెలకొని ఉంది. మరి ఇంతటి పోటీ వలన టెలికాం ఆపరేటర్ లకు ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ వినియోగదారుడు మాత్రం ఫుల్ ఖుషీ గా ఉంటున్నాడు. ఆపరేటర్ లు పోటీలు పడి మరీ ఆఫర్ లు ప్రకటించి అంతిమంగా వినియోగదారునికి లాభాన్ని చేకూరుస్తున్నాయి. క్వాలిటీ విషయం లో కానీ, అందుబాటులో ఉండే ఆఫర్ ల విషయం లో కానీ నచ్చకపోతే వేరే ఆపరేటర్ కు మారిపోయే స్వేచ్చ విషయం లో కానీ వినియోగదరుడే అంతిమ విజేత. అయితే అందరు వినియోగదారులు అలా ఆనందం గా ఉంటున్నారా అంటే మాత్రం ఖచ్చితంగా కాదు అని చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే వినియోగదారులు పోస్ట్ పెయిడ్ మరియు ప్రీ పెయిడ్ అని రెండు రకాలుగా ఉంటారు అనే విషయం మనకు తెలిసినదే. అయితే పోటీ పడి ఆపరేటర్ లు ప్రకటిస్తున్న ఆఫర్ ల వలన ప్రీ పెయిడ్ వినియోగదారుడు లాభపడుతున్నాడు కానీ పోస్ట్ పెయిడ్ వినియోగదారునికి ఏ విధమైన లాభం ఉండక పోగా ప్రీ పెయిడ్ వినియోగదారుని తో పోల్చి చూసుకుని అసంతృప్తి కి గురయ్యే పరిస్థితులు నేడు ఉన్నాయి. అవును, అదెలాగో కొంచెం వివరంగా చూద్దాం.
మార్కెట్ లో ఏ చిన్న మార్పు వచ్చినా దాని యొక్క ప్రయోజనాలను ముందుగా పొందుతుంది ప్రీ పెయిడ్ యూజర్ లే. అంతేగాక ఏ ఆఫర్ కైనా సరే వెంటనే మారిపోతున్నారు. అదే పోస్ట్ పెయిడ్ యూజర్ లకు అయితే ఎంత ఆకర్షణీయమైన ఆఫర్ వచ్చినా సరే నెలమొత్తం అయిందాకా వేచి చూడాల్సిందే. తక్కువ ధరలో లభించే ఆఫర్ లు కూడా ప్రీ పెయిడ్ యూజర్ లకే ఎక్కువ ఉంటున్నాయి. ఇది ఈ మధ్య వచ్చిన పోకడ. ఇంతకుముందు పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఎక్కువ ఆఫర్ లు ఉండేవి. మంచి మంచి కాంబో ప్యాక్ లన్నీ పోస్ట్ పెయిడ్ యూజర్ లకే ఉండేవి. అయితే అదంతా గతం. ప్రీ పెయిడ్ యూజర్ లు ఫుల్ టాక్ టైం , డేటా ప్యాక్ లన్నీ సర్వీసు టాక్స్ ను మినహాయించేలా ఉన్న ప్లాన్ లతో పొందుతూ ఉంటే పోస్ట్ పెయిడ్ యూజర్ లు మాత్రం సర్వీస్ టాక్స్ తో కూడా కలిపి బిల్ చెల్లించవలసి వస్తుంది. అలా అని వీరు ప్రీ పెయిడ్ యూజర్ లకంటే తక్కువ ఏమైనా చెల్లిస్తున్నారా అంటే అది కూడా కాదు. ఒకానొక దశ లో పోస్ట్ పెయిడ్ యూజర్ గా ఉండి ఏ ఉపయోగం అనే స్థితి కి వినియోగదారుడు వచ్చేశాడు. కంపెనీ లు ప్రకటిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్ లు అన్నీ ప్రీ పెయిడ్ వినియోగదారులకే ఉండడం తో పోస్ట్ పెయిడ్ వినియోగదారులు కూడా ప్రీ పెయిడ్ కు మారాలనే యోచన చేస్తున్నారు. ఇది ఏ ఒక్క కంపెనీ కి సంబందించింది కాదు, దాదాపు అందరు ఆపరేటర్ లదీ ఇదే పరిస్థితి. ఇదిలా ఉంటే ఈ పరిణామాలు అన్నింటినీ నిశితంగా గమనిస్తున్న కొత్త వినియోగదారుడు ఎవరైనా ప్రీ పెయిడ్ లో ఇన్ని ఆకర్షణీయమైన ఆఫర్ లు ఉంటే పోస్ట్ పెయిడ్ కు మారతాడా?
అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కొన్ని ఆపరేటర్ లు దిద్దుబాటు చర్యలను ప్రారంభించాయి. టెలి కాలర్ ల ద్వారా వినియోగదారులకు ఫోన్ లు చేయించి తమ కంపెనీ యొక్క పోస్ట్ పెయిడ్ ఆఫర్ ల గురించీ మరియు పోస్ట్ పెయిడ్ మహత్యం గురించీ బలవంతంగా వినియోగదరులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది వినియోగదారులకు ఇలాంటి కాల్ లకు స్పందించడం లేదు. ఎలా స్పందిస్తాడు?