ఇండియా.. జనాభాలో ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం. 130 కోట్లు దాటిన మన జనాభాకు తగ్గట్లే మన మొబైల్ ఫోన్ కనెక్షన్ల సంఖ్య కూడా 100 కోట్లు దాటేసింది. అందుకే సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు, నెట్‌వర్క్ ప్రొవైడర్లు ఇండియన్ మొబైల్ మార్కెట్‌ను బంగారుబాతులా ఫీలవుతుంటారు. జియో వచ్చినప్పటి నుంచి కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఆఫర్ల వర్షం కురిపించిన మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు గత రెండు నెలలుగా ఛార్జీల బాదుడు షురూ చేశాయి. జియోతో మొదలైన ఈ బాదుడు ఎయిర్‌టెల్, వొడాఫోన్ కస్టమర్లకూ తాకింది. తాజా రిపోర్ట్‌ల ప్రకారం ఈ సంవత్సరం చివరికల్లా మన మొబైల్ బిల్ ఏకంగా 30% పెరగబోతుందని అంచనా. అందుకు మూడు కారణాలున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన మొబైల్ బిల్లును జేబుకు భారం చేస్తున్న ఆ మూడు కారణాలేంటో చూద్దాం.
1వ కారణం: టెలికం కంపెనీల నెత్తిన 1.47 లక్షల కోట్ల రూపాయల బకాయిలు
అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) కింద టెలికం కంపెనీలు ప్రభుత్వానికి భారీగా బకాయిపడ్డాయి. వీటన్నింటినీ వెంటనే చెల్లించాలని రెండు నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇవి చెల్లించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే టెలికం కంపెనీలు ఏజీఆర్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు రూ.1.47 లక్షల కోట్లు. ఇందులో ఎయిర్‌టెల్ కట్టాల్సింది 35వేల కోట్లు. వొడాఫోన్ 53 వేల కోట్ల రూపాయలు. టాటాటెలి సర్వీసెస్ 13,800 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇన్ని వేల కోట్లు చెల్లించాలంటే కంపెనీలు కచ్చితంగా మొబైల్ ఛార్జీలను పెంచి తీరతాయి. లేదంటే అవి దివాళా తీసేయడం ఖాయం.
2వ కారణం: వొడాఫోన్ ఐడియా మూతపడితే ఎయిర్‌టెల్, జియోలకు అడ్డుండదు
ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న టెల్కో.. వొడాఫోన్ ఐడియానే. ఈ కంపెనీ ఏకంగా 53వేల కోట్ల రూపాయలు ఏజీఆర్ బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం ఏదైనా ఉపశమనం ఇవ్వకపోతే వొడాఫోన్ ఐడియా మునిగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే దేశంలో ఎయిర్‌టెల్, జియోలు చెప్పిందే టారిఫ్.. ఇచ్చిందే ప్లాన్ అన్నట్లు తయారవుతుంది. ఎందుకంటే ఇక ఈ రెండే కంపెనీలు మొబైల్ నెట్‌వర్క్‌లను శాసిస్తాయి. ఈలోగా వొడాఫోన్ ఐడియా రెండోవిడత టారిఫ్ పెంపును ప్రారంభిస్తాయని మార్కెట్ విశ్లేషణ.
3వ కారణం: ఇండియాలో మొబైల్ ఛార్జీలు ఇంకా చౌకగానే ఉండటం
గత నెలలో దాదాపు అన్ని కంపెనీలు డేటా ఛార్జీలు పెంచేశాయి. 14 నుంచి 33% వరకు పెరుగుదల నమోదైంది. దీంతో ఒక్కో యూజర్ నుంచి నెలకు రూ.120 నుంచి రూ.160 వసూలవుతోంది. అయినా కూడా ఇండియాలోనే మొబైల్ టారిఫ్ చౌక. అమెరికా, బ్రిటన్ మాత్రమే కాదు సింగపూర్, మలేషియా, చైనా, హాంకాంగ్, పిలిప్పైన్స్, జపాన్ ఇలా అన్నిదేశాల్లో మొబైల్ ఛార్జీలు మనకంటే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో నెలవారీ ఛార్జీలను ఈ ఏడాది పూర్తయ్యేలోపు 180 నుంచి 200 రూపాయలకు కంపెనీలు పెంచబోతున్నాయని మార్కెట్ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. సో చెప్పొచ్చిదేమిటంటే 2020 చివరికల్లా మన మొబైల్ కనీసం 30 శాతం పెరిగిపోనుంది.. బాదించుకోవడానికి బీ రెడీ .