ఇండియన్ టెలికాం వినియోగదారులను ఉచిత ఆఫర్లతో ఉర్రూతలూగిస్తున్న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఆ ఊపును అప్పుడే ఆపేలా కనిపించడం లేదు. ప్రత్యర్థి సంస్థలు ఎన్ని రకాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నా జియో మాత్రం ఇంకా ఆఫర్ల మంత్రం వదలడం లేదు. తాజాగా జియో తన వెబ్ సైట్లో చేసిన ప్రకటనతో కంజ్యూమర్స్ ఈలలు వేస్తున్నారట. జియో ఫ్రీ ఆఫర్ల కాలం ముగియడం.. ఆ తరువాత ప్రైమ్ మెంబర్ షిప్ పెట్టడం.. మళ్లీ మూడు నెలలకు తక్కువ మొత్తంతో ఎక్కువ డాటా ఇవ్వడం.. అలా ఇస్తున్న సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను ట్రాయ్ వద్దనడం వంటి పరిణామాల నేపథ్యంలో జియో వినియోగదారులు కాస్త డీలా పడ్డారు. ఇక జియో ఫ్రీ ఆఫర్లు పెద్దగా ఉండకపోవచ్చని డిసైడైపోయారు. జియో ఇది పసిగట్టిందో ఏమో కానీ తన వినియోగదారుల బెంగ తీర్చేందుకు సిద్ధమవుతోంది. మళ్లీ ఉచిత ఆఫర్లు ఉన్నాయని తన వెబ్ సైట్లో ప్రకటించింది.
అఫర్డబుల్ ఆఫర్లు
మరిన్ని అద్భుత ఆఫర్లు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని రిలయన్స్ జియో తన వెబ్ సైట్లో వెల్లడించింది. కొత్త కస్టమర్లకు ఆల్ట్రా-అఫోర్డబుల్ డేటా టారిఫ్స్ తో పాటు, జియో ప్రైమ్ మెంబర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇవ్వబోతున్నట్టు తెలిసింది. ''త్వరలోనే మేము మా టారిఫ్ ప్యాక్స్ ను అప్ డేట్ చేస్తాం. మరిన్ని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెడతాం'' అని అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది. టెలికాం సర్వీసు ప్రొవైడర్లకు ఇస్తున్న పోటీని తగ్గకుండా ఇవ్వడానికి, కొత్త సబ్స్క్రైబర్లను ఆకట్టుకోవడానికి కొత్త టారిఫ్ స్కీమ్ ను తాము లాంచ్ చేస్తామని జియో అధికార ప్రతినిధి కూడా ప్రకటించారు.
పోటీదారుల నెత్తిన మరో దెబ్బ
జియో ఇటీవల తీసుకొచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ దెబ్బకొట్టడంతో ఈ ప్రభావం యూజర్ల మీద పడకుండా ఉండేందుకు ఈ ప్లాన్స్ లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ మెంబర్ షిప్ గడువు 15 రోజుల పొడిగింపుతో పాటు రూ.303 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకున్న వారికి మూడు నెలలు ఉచిత సేవలను అందించనున్నట్టు పేర్కొంటూ జియో సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ ను తీసుకొచ్చింది. కానీ ఆ ఆఫర్ ను వెంటనే విత్ డ్రా చేసుకోమని జియోను ట్రాయ్ ఆదేశించింది. జియోకు వ్యతిరేకంగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలతో కాస్త ఊపిరి పీల్చుకున్న పోటీదారులు ఈ తాజా ప్రకటనతో మళ్లీ బెంగపెట్టుకున్నారట.