జియో తన కొత్త ప్లాన్లు ప్రకటించి రెండు రోజులు కూడా కాకముందే మిగతా టెలికం సంస్థలు కూడా జాగ్రత్తపడడం ప్రారంభించాయి. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి జియో కొత్త ప్లాన్ రూ.399కు పోటీగా తమ ప్రీపెయిడ్ ప్యాక్‌లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌సెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు మంచి ఆఫర్ ఒకటి ప్రకటించింది.
కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ రూ.348ను తమ యూజర్లకు అందిస్తున్నట్టు ఎయిర్ సెల్ ప్రకటించింది. ఇందులో రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందించనుంది. ఎయిర్ సెల్ తాజాగా ప్రకటించిన ఈ ప్యాక్, ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్‌కు గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
జియో రూ.399 యూజర్లు కూడా తమ కొత్త ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్‌ఎంఎస్‌లు వాడుకోవడానికి వీలుంది. అయితే రెండు ప్యాక్ ల మధ్య 51 రూపాయలు తేడా ఉంది. అయితే ఎయిర్‌సెల్ ప్రకటించిన ఈ కొత్త ప్యాక్ ప్రస్తుతానికి నార్త్ ఉత్తర ప్రదేశ్ లో మాత్రమే ఉంది. ఈ ప్యాక్ కింద యూజర్లు ఏ నెట్‌వర్క్‌కైనా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్(లోకల్, ఎస్‌టీడీ) చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్ స్పీడు 3జీ మాత్రమే. అదే రిలయన్స్ జియో నెట్‌వర్క్‌పై అయితే 4జీ స్పీడును పొందవచ్చు.
అయితే.. ఉత్తర్ ప్రదేశ్ లో ఈ ప్లానుకు ఆదరణ వస్తే దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని ఎయిర్ సెల్ భావిస్తోంది. ధర... డాటా ప్రకారం ఆఫర్ ఆకర్షణీయంగా ఉన్నా కూడా ఇది 3జీ ఆఫర్ మాత్రమే కావడం వల్ల ఆదరణ దొరుకుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.