టెలికాం సేవల కంపెనీలు పాతకాలపు మంచి టాక్ టైమ్ ప్లాన్లను ఉద్దేశపూర్వకంగా మాయం చేస్తున్నాయ్. ఆ మేరకు కాపీ కొట్టడమే అత్యుత్తమ ప్రశంసా రూపమైన పక్షంలో రిలయన్స్ జియో ఇప్పుడు చాలా సంతోషిస్తూంటుందేమో! ఎందుకంటే... జియో ప్రవేశపెట్టిన ప్లాన్లనే ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌లు కూడా ఫాలో అవుతున్నాయి. ఈ దిశగా కొన్ని టాక్‌టైమ్ ప్లాన్లను పూర్తిగా మూలపడేస్తున్నాయి. ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్‌లతో నిమిత్తం లేకుండా కేవలం టాక్‌టైమ్ మాత్రమే కావాలనుకునే వినియోగదారులకు ఇది దుర్వార్తే. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర అనేక నెట్‌వర్క్‌లలో ఇప్పటిదాకా చిన్న డినామినేషన్లలోనూ టాక్‌టైమ్ రీచార్జి సదుపాయం ఉండేది. కానీ, వాటిని మెల్లమెల్లగా ఆ నెట్‌వర్క్‌లు తొలగిస్తున్నాయి. వినియోగదారులు తప్పనిసరిగా 28 రోజుల రీచార్జి ప్లాన్లకు మళ్లాల్సిన పరిస్థితి కల్పిస్తున్నాయి.
ఇది సముచితమేనా?
ఈ అంశాన్ని తొలుత Redditలో కొందరు ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రముఖ టెలికాం బ్లాగ్‌లలో ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్‌ల నిర్వాకాన్ని లేవనెత్తారు. ఈ నేపథ్యంలో MyAirtel యాప్‌ను ఓపెన్ చేసి టాక్‌టైమ్ ప్లాన్లను పరిశీలిస్తే- రూ.10, రూ.1000, రూ.5,000 ప్లాన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇందులో రూ.10తో రీచార్జి చేస్తే రూ.7.47 టాక్‌టైమ్ వస్తుండగా వ్యాలిడిటీ ‘అపరిమితం’ అని కనిపిస్తోంది. అలాగే రూ.1,000తో రీచార్జికి లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో రూ.వెయ్యి టాక్‌టైమ్, అవుట్‌గోయింగ్ వ్యాలిడిటీ 28 రోజులుగా చూపుతోంది. ఇక రూ.5,000తో రీచార్జికి కూడా లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో రూ.5,000 టాక్‌టైమ్, అవుట్‌గోయింగ్ వ్యాలిడిటీ 28 రోజులుగానే కనిపిస్తోంది. అయితే, ఈ మూడు ప్లాన్లూ ఎంతమాత్రం ఆచరణసాధ్యం కానివేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇక పేటీఎం యాప్‌లో మరో ప్రముఖ సంస్థ వొడాఫోన్ ప్లాన్లను పరిశీలించినప్పుడు కూడా ఎయిర్‌టెల్‌తో ‘సేమ్ టు సేమ్’గా రూ.10, రూ.1000, రూ.5,000 ప్లాన్లు మాత్రమే కనిపిస్తున్నాయి.
మనం 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లకు మళ్లక తప్పదా?
ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్-ఐడియా సిమ్ కార్డుగల వినియోగదారు కేవలం మాట్లాడటానికి మాత్రమే దాన్ని వాడాలనుకుంటే అతడికి ప్రతినెలా రూ.100 ఖర్చవుతుందని భావిద్దాం- ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి మరో చాన్స్ లేదు... తప్పనిసరిగా రూ.199 కనీస ప్లాన్‌తో 28 రోజుల వాయిస్ కాల్స్+డేటాతో రీచార్జి చేసుకోవాల్సిందే. లేదంటే డేటాతో కూడిన కాంబో-పాక్స్ ఎంచుకోవాల్సిందే. అదే వొడాఫోన్-ఐడియా నెట్‌వర్క్ విషయానికొస్తే రూ.209 కనీస ప్లాన్‌తో రీచార్జి చేసుకోక తప్పదు. అంటే... ప్రతి వినియోగదారు నెలకు కనీసం రూ.200దాకా ఖర్చుచేసి, అపరిమిత కాల్స్‌తోపాటు డేటా, ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చుగదా అన్నది టెల్కోల తర్కం. ఏతావాతా... ప్రతి వినియోదారుపై సగటు రాబడి (ARPU) పెంచుకోవడమే ఈ వ్యూహంలోని అంతస్సూత్రంగా కనిపిస్తోంది. సంప్రదాయ టాక్‌టైమ్ ప్లాన్లకు క్రమేణా స్వస్తి పలుకుతుండటం అందరికీ మతి పోగొడుతోంది. ఈ ‘విచిత్ర ధోరణి’కి కారణం జియో రంగప్రవేశమేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. తొలినాళ్లలో జియో వాయిస్‌కాల్స్-ఇంటర్నెట్ కాంబో ప్లాన్లను తీసుకొచ్చింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా ఆ విధానం నుంచి పక్కకు మళ్లలేదు. కానీ, ఎయిర్‌టెల్‌తోపాటు వొడాఫొన్ నెట్‌వర్క్‌లో ‘వాయిస్ ఓన్లీ’ టాక్‌టైమ్ ప్లాన్లు ఉండేవి కాబట్టి వాటిని మాయంచేయడం వెనుక జియో ప్రభావం ఉందనడం సరికాదు. ఏదెలా ఉన్నా తమకేం కావాలో దాన్ని టెలికాం ఆపరేటర్లు కొనసాగించేలా వినియోగదారులు చేయగలిగింది ఏమైనా ఉందా? అన్నది ప్రశ్నార్థకమే!