భారత్‌లో జియో రాకముందు ఎయిర్‌టెల్‌కు తిరుగేలేదు. జియో వచ్చిన తర్వాత కూడా ఎయిర్‌టెల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌టెల్ కొత్త టారిఫ్‌లను కూడా అమల్లోకి తెచ్చింది. దీనిలో భాగంగా ప్రతి కస్టమర్ నుంచి నెలకు రూ.300 రాబడి రాబట్టాలని ఆ సంస్థ వ్యూహం రచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఛైర్మన్ సునీల్ మిత్తల్ ఇటీవల వెల్లడించారు. మరి ఎయిర్‌టెల్ కొత్త స్ట్రాటజీ ఏంటో చూద్దామా...
1.2 కోట్ల కొత్త యూజర్లు
ఎయిర్‌టెల్ తమ కొత్త యూజర్లను గణనీయంగా పెంచుకుంది. గత 2.5 నెలల కాలంలో ఎయిర్‌టెల్ 1.2 కోట్ల కొత్త యూజర్లు ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో భాగస్వాములు అయ్యారు. 4జీ ఫెర్మార్‌మెన్స్ బాగుండడంతో కొత్త యూజర్లు పెరుగుతున్నారు. జియో వచ్చిన తర్వాత చాలామంది కస్టమర్లను పోగొట్టుకున్న ఎయిర్‌టెల్.. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా యూజర్లను పెంచుకుంటుంది. యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (ఏఆర్‌పీయూ)ని నెలకు రూ.300కు పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఏపీఆర్‌యూ రూ.300 అయితే లోయర్ ఎండ్ కంజ్యుమర్స్ నెలకు ఖర్చు పెట్టే వ్యయం రూ.100 కానుంది. హయర్ ఎండ్ కస్టమర్లు 400 నుంచి 500 వరకు నెలకు వ్యయం అయ్యే అవకాశం ఉంది.
ఏమిటి దీని ప్రత్యేకత?
ఈ డిసెంబర్‌లో బీఎస్ఎన్ఎల్ తప్పించి అన్ని టెలికాం ఆపరేటర్లు తమ టారిఫ్‌లు పెంచేశాయి. ఏకంగా 40 శాతం వరకు టారిఫ్‌లు పెరిగాయి. నిజంగా ఇది భారత టెలికాం రంగంలో పెద్ద కుదుపే. ఎందుకంటే రానురాను టారిఫ్‌లు తగ్గుతాయని ఆశించిన వినియోగదారులకు టారిఫ్‌లు పెరగడం మింగుడు పడని అంశం. ప్రతి టెలికాం ఆపరేటర్‌కు బేస్ ప్రైస్ నిర్ణయిస్తామని ట్రాయ్ ఇటీవలే చెప్పింది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే కనీస ధర అనే అంశం తెర మీదకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఎయిర్‌టెల్ తాజా ప్రకటనే ఇందుకు సాక్ష్యం.