టెలికాం మార్కెట్లోకి ఎంటరయిన రిలయన్స్ జియో వచ్చిన అనతి కాలంలోనే ఐడియా వొడాఫోన్, ఎయిర్‌టెల్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అత్యంత తక్కువ ధరకు డేటా, వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో కారణంగా ప్రత్యర్థి కంపెనీలు ఎన్ని వ్యూహాలు చేసినా జియోకు గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో అవి కొత్త ఎత్తుగడలకు తెరలేపాయి. ఇందులో భాగంగా టారిఫ్ గేమ్‌లో తన గేర్లు మార్చేందుకు ఎయిర్‌టెల్ సిద్ధపడుతోంది.
ప్రీ పెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు ప్రోత్సాహకాలు, ఇతర సేవలు అందించడం ద్వారా జియోను ధీటుగా ఎదుర్కోవాలని భావిస్తోంది. జియో, వొడాఫోన్ ఐడియా వలె కాకుండా ఎయిర్‌టెల్ ARPUపై దృష్టి సారించింది. ఎయిర్‌టెల్ థ్యాంక్స్ పేరుతో కస్టమర్లకు ఆకట్టుకుంది. ఇప్పుడు మరో ప్లాన్‌తో ఎయిర్‌టెల్ ముందుకు వస్తోంది. హై-పేయింగ్ కస్టమర్లకు మరో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌తో ముందుకు వస్తోంది. Airtel Black పేరుతో దీనిని తీసుకు వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా అధికంగా చెల్లించే కస్టమర్లకు ప్రత్యేకమైన ప్రయోజనాలు అందించడంపై ఎయిర్‌టెల్ దృష్టి సారించింది. అదే సమయంలో, ఈ బెనిఫిట్స్ చూపించి ఇప్పటికే తక్కువ ఖర్చు చేస్తున్న కస్టమర్ల ద్వారా ఆర్పును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
బెట్టర్ కంటెంట్ ఆఫరింగ్స్, కన్స్యూమర్ బ్రాండ్స్ పైన డిస్కౌంట్లు, ఇంటర్నేషనల్ రోమింగ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వివిధ రకాల యాప్స్, స్ట్రీమింగ్ సేవలు వంటి బెనిఫిట్స్ ఈ ఫీచర్ ద్వారా అందిస్తారు. ఎయిర్ టెల్ బ్లాక్ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోనే భాగం చేస్తున్నారు. రూ.999 అంతకంటే ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధంగా కస్టమర్లకు ఈ ప్రయోజనాలు ఉంటాయి.
ఖర్చు చేయని కస్టమర్లను దూరం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇలాంటి ఆఫర్ల ద్వారా ఎక్కువ రెవెన్యూ రాబట్టడానికి సిద్ధపడినట్లుగా కనిపిస్తోంది. రిలయన్స్ జియో లో-వ్యాల్యూ ప్లాన్స్ ఎలాగూ తక్కువ ఖర్చు చేసే కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ వినూత్న ఎయిర్ టెల్ బ్లాక్ తీసుకు రానుంది. ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా.. పోస్ట్ పెయిడ్ వ్యాపారం పెంచుకోవడం, ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలోని తక్కువ వ్యాల్యూ కలిగిన కస్టమర్లను బ్లాక్‌లోకి అప్ గ్రేడ్ చేయడం, విలువైన కస్టమర్లను ఎయిర్‌టెల్ కస్టమర్లుగా ఉంచడమే లక్ష్యంగా కంపెనీ ముందుకెళుతోంది.
ఇప్పుడు కంపెనీకి ఎయిర్ టెల్ గోల్డ్ కింద రూ.499 లోపు కస్టమర్లు, ప్లాటినం కింద రూ.499 కంటే ఎక్కువ చెల్లించేవారు ఉన్నారు. ఇప్పుడు ఎయిర్ టెల్ బ్లాక్ ద్వారా అధిక ప్రయోజనాలతో ఎక్కువ మందిని ఆకర్షించాలని చూస్తోంది. ఇది కస్టమర్లకు ప్రయోజనంతో పాటు కంపెనీకి కూడా ఎక్కువ రెవెన్యూ తెచ్చి పెడుతుంది. ఎక్కువ చెల్లించే కస్టమర్లను నిలుపుకునే ఉద్దేశ్యంలో ఎయిర్ టెల్ ఉంది. వీరిని జియో వంటి ప్రత్యర్థి ఆపరేటర్లకు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తోంది.