• తాజా వార్తలు

అన్ని టెల్కోలు డేటా ఛార్జీలు పెంచ‌డానికి అసలు కార‌ణాలివే

యాన్యువల్ గ్రాస్ రెవిన్యూ కింద టెలికాం కంపెనీలు టెలికాం శాఖకు వేల కోట్ల బకాయి పడ్డాయి. వాటిని  వెంటనే  కట్టాల్సిందే అంటూ సుప్రీం కోర్ట్ డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఎయిర్‌టెల్ 53వేల కోట్ల రూపాయ‌లు, వొడాఫోన్ ఐడియా 36 వేల కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నాయి. ఈ కంపెనీలు వీటిని వాయిదాల రూపంలో కడుతున్నాయి. మార్కెట్లో  పోటీని తట్టుకోవడానికి మొన్నటి  వరకు టెలికాంకంపెనీలు పోటీలు పడి రేట్లు తగ్గించాయి. ఇప్పుడు ఆ నష్టాలు భరించలేక, ఏజీఆర్ రెవెన్యూలు క‌ట్ట‌డం త‌లకు మించిన భార‌మ‌వ‌డంతో  వినియోగ‌దారుల మీదే భారం మోపాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. గ‌త డిసెంబ‌ర్‌లో కంపెనీల‌న్నీ త‌మ టారిఫ్‌ల‌ను 30 శాతం వ‌ర‌కు పెంచేశాయి. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీల‌దీ ఇదే దారి.

ఒక జీబీ డేటా 15 రూపాయ‌లు అంటున్న జియో
రిల‌య‌న్స్ జియో త‌మ టారిఫ్‌ను మ‌రింత పెంచ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే సిగ్న‌ల్స్ ఇచ్చింది.  ఫ్లోర్ ప్రైసెస్ అంటే ఒక జీబీ డేటా ధ‌ర‌ను 15 రూపాయ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలిపింది. దీన్ని నెమ్మ‌దిగా 20 రూపాయ‌ల వ‌ర‌కు పెంచనున్న‌ట్లుకూడా హింట్ ఇచ్చింది. అలా అయితేనే గిట్టుబాటు అవుతుంద‌ని చెబుతోంది.

మినిమం ఫ్లోర్ ప్రైస్ త‌ప్ప‌దా?
దేశంలో సెల్‌ఫోన్ వాడేవారు నెల‌నెలా కనీస మొత్తాన్ని చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోలేక‌పోతే న‌ష్టాలు భ‌రించ‌డం త‌మ వ‌ల్ల కాద‌ని సెల్యుల‌ర్ ఆప‌రేట‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) అంటోంది. ఇదే విష‌యంపై ఫిబ్ర‌వ‌రి 26న ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ఏప్రిల్ నుంచి యూజ‌ర్లు  మినిమం ఫ్లోర్ ప్రైస్ చెల్లించాలని సీవోఏఐ దానిలో క్లియ‌ర్‌గా చెప్పేసింది.  వ్య‌వ‌స్థాప‌ర‌మైన న‌ష్టాల‌తోపాటు ఏజీఆర్ బ‌కాయిల భారం టెలికం కంపెనీల‌ను కోలుకోనివ్వ‌ట్లేదు. ప్ర‌భుత్వం చేయూతనివ్వ‌క‌పోతే ఈ న‌ష్టాల‌ను భ‌రించ‌లేం. అందువ‌ల్ల మినిమం ఫ్లోర్ ప్రైస్ వంటివి తీసుకురావ‌డానికి స‌హ‌క‌రించాలని సీవోఏఐ చెబుతోంది.

అన్ని కంపెనీల‌దీ అదే బాట‌
జియో లేఖ రాసిన కొన్ని రోజుల‌కే వొడాఫోన్ ఐడియా కూడా టెలికం శాఖ ముందు ఇలాంటి ప్ర‌తిపాద‌నే పెట్టింది. త్వ‌రలో ఎయిర్‌టెల్ కూడా ఇదే బాట‌లోకి రాబోతోందని మార్కెట్ నిపుణుల అంచ‌నా. ఏజీఆర్ బ‌కాయిలు చెల్లించాల‌న్నా, న‌ష్టాలు త‌గ్గి వినియోగ‌దారుడికి మంచి స‌ర్వీస్ ఇచ్చేలా సౌక‌ర్యాలు మెరుగుప‌ర‌చాల‌న్నా మేం ఆర్థికంగా కోలుకోవ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని కంపెనీలు అంటున్నాయి. అంటే కంపెనీల‌న్నీ టెలికం టారిఫ్‌లు పెంచ‌డం ప‌క్కా.  ఇక మ‌నం సిద్ధ‌ప‌డ‌ట‌మే మిగిలింది.

జన రంజకమైన వార్తలు