ఇండియన్ టెలికాం మార్కెట్లో వీవోఎల్టీఈ సేవలందిస్తున్న ఒకే ఒక్క సంస్థ రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్ టెల్ కూడా వీవోఎల్టీఈ సేవలు సోమవారం(10.07.17) ప్రారంభిస్తుందని అంతా భావించారు. అయితే... నిన్న ప్రారంభ కార్యక్రమం ఏమీ లేకపోగా ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తెస్తామని సంస్థ అధికారులు వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం దేశంలోని అయిదు నగరాల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు వీఓఎల్టీఈ అంటే ఎల్టీఈకి దీనికి తేడాలేంటి... వీఓఎల్టీఈతో ప్రయోజనాలేంటి వంటివన్నీ ఆసక్తికరమే. నిత్యం మనం వింటున్న ఈ పదజాలం.... వాటి సాంకేతిక అంశాలు.. ప్రయోజనాలు వంటివన్నీ మీకోసం..
ఎల్టీఈ(లాంగ్ టెర్మ్ ఎవల్యూషన్)..
డాటాను వేగవంతంగా వినియోగించుకోవడానికి వీలు కల్పించే టెక్నాలజీ ఇది. ఇది ఫోన్లలో 4జీ, 3జీ, 2జీ బ్యాండ్ విడ్త్ లలో పనిచేస్తుంది. అంటే అక్కడున్న సిగ్నళ్ల ఆధారంగా ఈ బ్యాండ్ మారుతుంది. డాటా(నెట్) వాడేటప్పుడు 4జీ బ్యాండ్ లో ఉన్నా కాల్స్ కి వచ్చేసరికి అక్కడి సిగ్నళ్ల ఆదారంగా 3జీ లేదా 2జీలోకి మారుతుంది. అంటే డాటా 4జీలో వాడుతున్నా కాల్స్ మాత్రం 3జీ లేదా 2జీ బ్యాండ్ లో జరుగుతాయి.
వీఓఎల్టీఈ(వాయిస్ ఓవర్ ఎల్టీఈ)
ఇది కూడా ఎల్టీఈ లాగానే పనిచేస్తుంది. కానీ ఇందులో ఎల్టీఈ కంటే కొన్ని అదనపు ఫీచర్లు ఉన్నాయి. ప్రధానమైన తేడా కాల్స్ లో కనిపిస్తుంది. ఎల్టీఈలో కాల్స్ 3జీ లేదా 2జీలోకి మారిపోతాయి, కానీ, కాల్స్ కూడా 4జీ బ్యాండ్ లోనే కొనసాగుతాయి. కాల్స్ 4జీ బ్యాండ్ లో రావడం వల్ల వాయిస్ క్లారిటీ బాగుంటుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే 4జీ వేగంతో ఇంటర్నెట్ వాడుకోవడానికి ఎల్టీఈ... ఇంటర్నెట్ తో పాటు వాయిస్ కాల్స్ కూడా 4జీలో పొందేందుకు వీఓఎల్టీఈ తోడ్పడతాయి.
ఎల్టీఈని 4జీ బ్యాండ్ కాల్స్ కి ఎందుకు ఉపయోగించడం లేదు..
కాల్ అంటే రెండు చానల్స్ మధ్య డాటా మార్పిడి. ఈ డాటా మార్పిడి రెండు విధాలుగా చేయొచ్చు.
1. సర్క్యూట్ స్విచ్చింగ్: ఈ విధానంలో రెండు చానళ్ల మధ్య అంటే కాల్ మాట్లాడే ఇద్దరి మధ్య డాటా మార్పిడి నిరంతరాయంగా, ఆగకుండా సాగుతుంది.
వీఓఎల్టీఈలో ఈ విధానం ఉంటుంది.
2. ప్యాకెట్ స్విచ్చింగ్: ఈ విధానంలో డాటా ప్యాకెట్లు రూపంలో మార్పిడి జరుగుతుంది. అంటే బిట్లు బిట్లుగా ఒకరి నుంచి ఒకరికి చేరుతుందన్నమాట. అంటే మనం మాట్లాడే మాటలు ఒక ప్రవాహంలా కాకుండా విడివిడిగా మార్పిడి జరుగుతూ ఒకదానికొకటి కనెక్టివిటీ ఉండేలా ఉంటుంది.
ఎల్టీఈ, 2జీ, 3జీలో ఈ విధానం ఉంటుంది.
కాబట్టి వీఓఎల్టీఈలో కాల్ డాటా మార్పిడి నిరంతర ప్రవాహంలా ఉండడం వల్ల ఉన్నదున్నట్లుగా చేరుతుంది. దానివల్ల స్పష్టత ఉంటుంది. ఎల్టీఈని డాటా స్పీడ్ కోసం డిజైన్ చేస్తే వీఓఎల్టీఈని కాల్ క్వాలిటీ కోసం డిజైన్ చేశారు.
వీఓఎల్టీఈ ప్రయోజనాలు..
1. 3జీ కంటే 3 రెట్లు కాల్ నాణ్యత
వీఓఎల్టీఈలో కాల్ క్వాలిటీ 3జీ కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుంది. అదే 2జీతో పోల్చితే ఆరు రెట్లు అధికంగా ఉంటుంది. ఇందులో హెచ్ డీ క్వాలిటీ కాల్స్ సాధ్యమవుతాయి.
2. బ్యాటరీ సామర్థ్యం 2 గంటలు పెరుగుతుంది..
వీఓఎల్టీఈ ప్రయోజనాల్లో మరో కీలకమైనది బ్యాటరీ సామర్థ్యం పెరగడం. ఈ విధానంలో కాల్స్ చేసుకుంటే బ్యాటరీ మరింత ఎక్కువ సేపు వస్తుంది. సాధారణంగా మన ఫోన్ కి ఫుల్ చార్జింగ్ పెట్టాక 20 గంటల పాటు పనిచేస్తుందనుకుంటే వీఓఎల్టీఈ వినియోగించడం వల్ల 22 గంటల వరకు వస్తుంది.
3. మెరుగైన కనెక్టివిటీ, రేంజ్
వీఓఎల్టీఈలో కాల్ కనెక్టివిటీ 2జీ, 3జీ కంటే రెండు రెట్లు మెరుగ్గా ఉంటుంది. వీఓఎల్టీఈ నెట్ వర్క్ 800, 900, 1800, 2300, తదితరత మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీల్లో పనిచేస్తుంది. దీనివల్ల నెట్ వర్క్ ఎక్కువ దూరం విస్తరిస్తుంది. దూరంతో పాటు ఎక్కువ ప్రాంతానికి కూడా ఈ సిగ్నళ్లు విస్తరించగలవు. అంటే... అండర్ గ్రౌండ్స్.. ఇంటి మూలమూలల్లో కూడా నెట్ వర్క్ ఉంటుంది.
4. వీడియో కాల్ నాణ్యత పెరుగుతుంది..
అధిక వేగంతో డాటా ట్రాన్సఫర్ కావడం వల్ల వీడియో కాల్స్ లో వీడియో నాణ్యత 3జీ కంటే కూడా బాగా ఉంటుంది.
వీఓఎల్టీఈలో పరిమితులు
ఇది మంచి టెక్నాలజీయే అయినా కూడా దీనికి కొన్ని పరిమితులున్నాయి. ఇందులో హెచ్ డీ క్వాలిటీ కాల్స్ చేసుకోవాలంటే ఇద్దరు వ్యక్తులు కూడా వీఓఎల్టీఈ ఉన్న ఫోన్లు వాడాల్సి ఉంటుంది. ఒకరి వద్దే ఇలాంటిది ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు.