ఇప్పటి వరకు 2జీ, 3జీ అంటే అబ్బో అనుకునేవారు. ఇక 4జీ గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే వారు. కానీ.. ప్రస్తుతం 4జీ శకం కూడా ముగియబోతోంది. 5జీ వైపు భారత్ పరుగులు పెడుతోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించి వస్తున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ స్వయంగా టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని ధృవీకరించారు.
టెలికాం శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించి రవి శంకర్ ప్రసాద్ టెలికాం రంగంలో దూకుడు పెంచాలని నిర్ణయించారు. వచ్చే వంద రోజుల్లోనే దేశంలో 5 జీ ట్రయల్స్‌ను మొదలు పెడతామని ప్రకటించారు. ఈ క్యాలెండర్ సంవత్సరంలోనే 5 జీ ఆధారిత తదుపరి స్పెక్ట్రమ్ వేలం నిర్వహిస్తామని చెప్పారు. అమెరికా సర్కారు నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న హువాయి సంస్థ సరికొత్త 5 జీ ట్రయల్స్‌లో పాల్గొనే అంశాన్ని కూడా సీరియస్‌గా ఆలోచించి నిర్ణయం వెలువరిస్తామని తెలిపారు.
భారతదేశంలో 5 జీ ట్రయల్స్ ప్రారంభించడానికి 100 రోజుల గడువుని నిర్ణయించారన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ట్రయల్ మొదలైన తరువాత 5 జీ లో పాల్గొనడం అనేది తప్పనిసరికాదు అని, భద్రతా సమ స్యలతో సహా ఒక కంపెనీ పాల్గొంటుందా లేదా అనేది సంక్లిష్టమైందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా జాబితాలో ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీ ఎన్‌ఎల్ సంస్థలకు కీలక ప్రధాన్యత ఉంటుందన్నారు.
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన ఎంటీఎన్‌ఎల్, బీఎస్‌ఎన్‌ఎల్‌ను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని వివరిం చారు.నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత ప్రభుత్వంలో ఐటీ, న్యాయశాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. 5 లక్షల వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు, టెలికాం మానుఫ్యాక్చరింగ్ వంటివి తమ ప్రాధమ్యాలుగా ఆయన వివరించారు. టెలికాం సంస్థలు నైపుణ్యంతో పాటు పరస్పర సహకారంతో పనిచేయాలని సూచించారు.
5జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. నెట్ స్పీడ్ అమాంతం పెరిగిపోనుంది. ప్రాథమిక దశలో 5జీ సేవల వల్ల మొబైల్ బ్రాడ్ బ్యాండ్ సేవలతో పాటు.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సూపర్ హై డెఫినిషన్ వీడియోలు, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటివన్నీ అత్యంత సులభమైపోతాయి. క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్లు అత్యంత వేగంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కళ్లుమూసి తెరిచేలోగా మూవీ డౌన్‌లోడ్ అయిపోతుంది.