• తాజా వార్తలు

మూడేళ్లలో బీఎస్సెన్నెల్ సమూలంగా ఎలా మారిందో తెలుసా?


ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్సెన్నెల్ గత మూడేళ్లలో పూర్తిగా మారిపోయింది. అంతకుముందు నిత్యం నష్టాలే చవిచూస్తూ 8 వేల కోట్ల కు పైగా నష్టాల్లో కూరుకుపోయినా ఆ సంస్థ పడిలేచిన కెరటంలా మళ్లీ ఎలా నిలదొక్కుకుంది.. మళ్లీ ఎలా లాభాల్లోకి వచ్చింది.. చివరకు ఇప్పుడు జియో పోటీని కూడా తట్టుకుని మిగతా టెలికాం ఆపరేటర్లకు భిన్నంగా ఎలా మనుగడ సాధించగలుగుతోందన్నది చూస్తే ఆద్యంతం ఆసక్తికరమే. నాలుగేళ్ల కిందట నిండా మునిగిపోయిన ఆ సంస్థ మళ్లీ పుంజుకున్న తీరు ప్రతి వ్యాపార సంస్థకూ ఒక పాఠమే.. అదెలాగో చూద్దాం మరి..
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దీర్ఘకాలిక నష్టాల నుంచి బయట పడి నిర్వహణ లాభాల్లోకి మళ్లింది. 2015 ఆర్థిక సంవత్సరంలో రూ.672 కోట్ల నిర్వహణ లాభం వచ్చినట్లు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, ఆదాయం పుంజుకోవడం వల్లనే లాభాలు వచ్చాయని కంపెనీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.. అయితే.. అందుకు అనుసరించిన విధానాలు ఆసక్తికరమే.

2013-14 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.691 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అలాంటిది 2014-15లో 672 కోట్ల లాభం ఆర్జించింది. అందులో సర్వీసులు అందించడం ద్వారా సంస్థకు రూ.27,242 కోట్ల ఆదాయం సమకూరింది. అంతక్రితం ఏడాదిలో వచ్చిన రూ.26.153 కోట్ల ఆదాయంతో పోలిస్తే 4.16 శాతం వృద్ధి నమోదైంది. గడిచిన ఐదేండ్లలో ఇదే గరిష్ఠ ఆదాయమని ఫలితాల విడుదల కార్యక్రమంలో శ్రీవాత్సవ తెలిపారు.

* మార్కెటింగ్ అదిరింది..
ఒకప్పుడు బీఎస్ ఎన్ ఎల్ అంటే ఎంత మంచి ఆఫర్ ఉన్నా.. ఎంత తక్కువ ధర అయినా ఫెద్దగా ఆదరణ ఉండేది కాదు. కారణం చాలామందికి ఆ ఆఫర్లు తెలియకపోవడం.. వాటిని సంస్థ పెద్దగా ప్రచారం చేయకపోవడం. కానీ.. గత మూడేళ్లుగా సీనుమారింది. ప్రైవేటు ఆపరేటర్ల కంటే మంచి ప్లాన్లు ఇస్తున్న ఆ సంస్థ వాటిని ప్రజల్లోకి వెళ్లేలా ప్రకటనలు జారీ చేస్తోంది.

* వినియోగదారులే పెన్నిధి
నాలుగేళ్ల కిందట బీఎస్ ఎన్ ఎల్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే అది కనెక్టవుతుందో లేదో.. కనెక్టయినా కూడా మన సమస్య పరిష్కారం అవుతుందో లేదో తెలియని పరిస్థితి. కానీ.. గత మూడేళ్లుగా కస్టమర్ కేర్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. దీంతో వినియోగదారులకు బీఎస్సెన్నెల్ పై నమ్మకం పెరిగింది.

* జియో వచ్చిన తరువాత దేశంలో టెలికాం రంగంలోని మిగతా అన్ని సంస్థలకు కుదుపు వచ్చినా బీఎస్సెన్నెల్ మాత్రం బాగానే నిలదొక్కుకుంది. జీయో తరువాత అన్ లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఇచ్చిన తొలి సంస్థ బీఎస్సెన్నెలే. అలాగే..ప్రయివేటు ఆపరేటర్ల కంటే బెటర్ ప్లాన్లు, ఎక్కువ వాలిడిటీతో ఇది వినియోగదారులను ఆకట్టుకోగలిగింది.

* 2015 నుంచి బీఎస్సెన్నెల్ తన డాటా, బ్రాడ్ బ్యాండ్ స్పీడుపై బాగా దృష్టి పెట్టింది. అంతకుముందు స్లో ఇంటర్నెట్ గా పేరు పడిన బీఎస్సెన్నెల్ 2015 నుంచి దూసుకెళ్లడం ప్రారంభించింది. దాంతో బీఎస్సెన్నెల్ మొబైల్ డాటా వినియోగదారులు భారీగా పెరిగారు. దాంతో పాటు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లూ పెరిగాయి.

ఇవన్నీ కలిసి బీఎస్సెన్నెల్ ను లాభాల బాట పట్టించాయి. టెలికాం రంగంలో నష్టాల్లో కూరుకుపోయిన సంస్థలు కానీ.. అలాగే ఒకసారి కిందపడిన ప్రభుత్వ రంగ సంస్థలు మళ్లీ పైకి లేవడం కానీ చాలా అరుదు. బీఎస్సెన్నెల్ మాత్రం అది చేసి చూపించింది.

జన రంజకమైన వార్తలు