ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయిన ఇండియా నుంచి మరో ఫోన్ కంపెనీ నిష్క్రమించబోతోంది. ఒకప్పుడు మార్కెట్‌లో మంచి పోటీదారుగా నిలబడిన హెచ్‌టీసీ ఇండియాను వదిలివెళ్లిపోబోతోంది. తైవాన్‌కు చెందిన ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు ఇండియన్ మార్కెట్‌లో ఒకప్పుడు మంచి పేరుండేది. చైనా కంపెనీలు ఇండియన్ మార్కెట్‌ను ఆక్రమించేయడంతో నెమ్మదిగా ఉనికి కోల్పోతూ వచ్చింది. ఇక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టమని తెలుసుకున్న హెచ్‌టీ ఇండియాను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధమైపోయింది. గత సంవత్సరమే ఇండియాలో ఉన్న తన సెల్‌ఫోన్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లన్నీ మూసేసిన హెచ్‌టీసీ ఇక్కడున్న తన టీమ్‌ను కూడా వదులుస్తోంది. ఇండియాతోపాటు దక్షిణాసియా దేశాలో హెచ్‌టీసీ హెడ్ ఫైజల్ సిద్ధిఖీ ఇటీవలే రాజీనామా చేశారు. సేల్స్ హెడ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్ నయ్యర్ కూడా ఇదే బాటలో వెళ్లబోతున్నారు. మరోవైపు ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్‌తో ఉన్న ఒప్పందాలన్నింటినీ హెచ్‌టీసీ క్లోజ్ చేసేస్తోంది. దీంతో హెచ్‌టీసి ఇండియా వదిలివెళ్లిపోతున్నామని లాంఛనంగా ప్రకటించడం ఒకటే మిగిలి ఉందని అర్ధమవుతోంది.
తొలి ఆండ్రాయిడ్ హెచ్‌టీసీదే
ఫోన్ల తయారీలో ఇన్నోవేటివ్ కంపెనీగా హెచ్‌టీసికి మంచి పేరుంది. 2008లో హెచ్‌టీసీ జీ1 పేరుతో ప్రపంచంలో తొలి ఆండ్రాయిడ్ ఫోన్‌ను హెచ్‌టీసీనే తయారుచేసింది. తర్వాత పిక్సెల్ ఫోన్లను ఫస్ట్ తయారుచేసింది హెచ్‌టీసీనే. లాస్ట్ ఇయర్ ఈ పిక్సెల్ ఫోన్ టీమ్ మొత్తాన్ని గూగుల్‌కు 1బిలియన్ డాలర్లకు అమ్మేసింది. బిల్డ్ క్వాలిటీ పరంగానూ, పెర్‌ఫార్మెన్స్ పరంగా కూడా యూజర్ల నమ్మకాన్ని బాగానే పొందగలిగింది.
11% నుంచి 1% కి పడిపోయిన మార్కెట్ షేర్
2001లో 10.7% మార్కెట్‌షేర్‌తో ప్రపంచంలోనే నాలుగో పెద్ద మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీగా నిలిచింది. 2011లో ఒకానొక దశలో యూఎస్‌లో యాపిల్, శాంసంగ్‌లను కూడా దాటి దూసుకెళ్లింది. అయితే ఇప్పుడు తైవాన్, యూఎస్ మార్కెట్లతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు పూర్తిగా పడిపోయా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెచ్‌టీసీ ఫోన్ల మార్కెట్ షేర్ 1%కే పరిమితమైపోయింది.
ఇవీ కారణాలు
* ప్రీమియం ఫోన్ల మార్కెట్‌ను శాంసంగ్, యాపిల్ పూర్తిగా ఆక్రమించేశాయి. షియోమి, వివో, ఒప్పోలాంటి కంపెనీలు ఎంత ప్రయత్నించినా ప్రీమియం ఫోన్ల విభాగంలో ఆ రెండింటిదే పై చేయి. మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్‌లో షియోమి, ఒప్పో, వివో, లెనోవో లాంటి కంపెనీలు దూసుకొచ్చేశాయి. తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెర్షన్లతో ఫోన్ల రిలీజ్ చేస్తూ ఇవి సక్సెస్ అయ్యాయి. దీంతో హెచ్‌టీసీ హై రేంజ్‌కి, మీడియం రేంజ్‌కు కూడా కాకుండా పోయింది.
* తక్కువ మార్జిన్‌తో ఎక్కువ ఫోన్లు అమ్ముకోవాలనే చైనా కంపెనీల మార్కెట్ సూత్రం ముందు హెచ్‌టీసీ నిలవలేకపోయింది.
* ఆఫ్‌లైన్ మార్కెట్‌నే ఎక్కువగా నమ్ముకోవడం కూడా హెచ్‌టీసీ వైఫల్యానికి ఓ కారణం.
* హెచ్‌టీసీలో ఏ ఫోన్ అయినా దాదాపు 10 వేల పైనే ప్రారంభమవుతుండడం, అదే సమయంలో రెడ్‌మీ లాంటి ఫోన్లు 5,6 వేలకే దొరుకుతుండడంతో మార్కెట్‌లో హెచ్‌టీసీని వెనక్కినెట్టింది.
భవిష్యత్తేంటి?
ఇండియాలో హెచ్‌టీసీ ఫోన్ల ప్రస్థానం దాదాపు ముగిసినట్లే. అయితే వీఆర్ విభాగంలో ఉత్పత్తులను కొనసాగించబోతోంది. సరైన సమయంలో సరైన ప్రొడక్ట్‌తో వస్తామని హెచ్‌టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఏమో నోకియాలాగే రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.