వినియోగదారులను ఆకర్షించడానికి పోటాపోటీగా ధరలు తగ్గించి రెండేళ్లుగా టెలికం కంపెనీలు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. జియో రంగంలోకి వచ్చేవరకు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లాంటి కంపెనీలు ఒక జీబీ డేటాకు కనీసం 100 రూపాయలు వసూలు చేసే పరిస్థితి. జియో రాకతో సీన్ మారిపోయింది. ఇప్పుడు ఏ టెలికం కంపెనీ కూడా నెలకు ప్రీపెయిడ్ రీఛార్జిని 250కు మించి వసూలు చేసే పరిస్థితి లేదు. అది కూడా అన్‌లిమిటెడ్ కాల్స్, మెసేజ్‌లు, రోజుకు 2జీబీ డేటాలాంటి సౌకర్యాలన్నీ ఇచ్చి మరీ వినియోగదారుణ్ని కాపాడుకుంటున్నాయి. కానీ ఇప్పుడు సీన్ మళ్లీ రివర్స్ అవుతుందా? అంటే టెలికం ఇండస్ట్రీ అవుననే అంటోంది.
లక్ష కోట్లు కట్టాలి
అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) కింద టెలికం కంపెనీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్మంతా చెల్లించాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు, లైసైన్స్ ఫీజులు, పెనాల్టీలు అన్నీ లెక్కేస్తే టెలికం కంపెనీలన్నీ కలిపి ప్రభుత్వానికి కట్టాల్సిన ఏజీఆర్ దాదాపు లక్ష కోట్ల రూపాయలని అంచనా. ఈ మొత్తం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు దాటొచ్చని టెలికం శాఖలోని ఉన్నతాధికారుల లెక్క. ప్రైస్‌వార్‌లో పడి లాభమంటే ఏంటో చూడలేని పరిస్థితిలో ఉన్న టెల్కోలకు ఇప్పుడు ఏజీఆర్ పెనుభారమైనట్లే. దాదాపు 15 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ నిర్ణయాన్ని సుప్రీం వెలువరించడం టెలికం కంపెనీలపై మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్లు చేసింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే టెలికం కంపెనీల ముందున్న ఏకైక మార్గం టారిఫ్ పెంచడమేనని ఇండస్ట్రీ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.
ప్రభుత్వం ఆదుకుంటుందా?
ఏజీఆర్ కట్టమని సుప్రీం కోర్టు చెప్పినా ఎప్పటిలోగా కట్టాలన్నది ఇంకా తేలలేదు. సో కొంత టైమ్ దొరకొచ్చు. కానీ కట్టడమైతే పక్కా. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందేమోనని టెల్కోలు ఆశగా చూస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థిక, న్యాయ, టెలికాం వంటి శాఖల్లోని కార్యదర్శులతో గవర్నమెంట్ ఓ ప్యానల్‌ను నియమించింది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల తగ్గింపుతో పాటు బిడ్‌లో గెలుచుకున్న స్పెక్ట్రమ్‌కు చేసే చెల్లింపులకు గడువును ఇవ్వడం వంటి టెల్కోల డిమాండ్లను ఈ ప్యానెల్ పరిశీలించే అవకాశాలున్నాయని సమాచారం. అదే సమయంలో టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ కూడా వాయిస్, డేటా సేవలకు కనీస ఛార్జీని రూపొందించే అవకాశాన్ని కూడా పరిశీలించనుందని చెబుతున్నారు.
టెల్కోలు ఏం కోరుకుంటున్నాయి?
టెలికం కంపెనీలు తమ వార్షిక ఆదాయంలో 5%ను యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్(యూఎస్‌ఓఎఫ్)కు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ సొమ్ముతో దేశంలోని వెనకబడిన ప్రాంతాల్లో టెలికం వసతులు కల్పిస్తారు. దీన్ని 1 శాతానికి తగ్గించాలన్నది కంపెనీల డిమాండ్. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. స్పెక్ట్రమ్ చెల్లింపులపై మార్చి 2022 వరకు అంటే రెండేళ్ల పాటు నిషేధం ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. లైసెన్సు ఫీజును 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ టెల్కోలు ఎలా ఉన్నా జీతాలు కూడా ఇవ్వలేకపోతున్న బీఎస్ ఎన్ఎల్ ఏం చేస్తుందో చూడాలి. రెండు నెలల్లోగా తమకు రిలీఫ్ ప్యాకేజీ ఇచ్చేలా ప్యానల్ చూడాలని టెల్కోలు అడుగుతున్నాయి. ఆలోగా ప్రభుత్వమేమీ చేయకపోతే టారిఫ్ ధరలు పెంచడమే తప్ప వాటికి వేరేదారి లేదు. ఈ లెక్కన చూస్తే వినియోగదారులకు ధరల మోత మోగడం తప్పదేమో!