ఫోన్ రీఛార్జ్.. ఒకప్పుడు ఇదో పెద్ద వ్యాపారం... ఎక్కడ చూసినా రీఛార్జ్ చేయబడును అనే బోర్డులే కనిపించేవి. ప్రతి షాప్‌లోనూ రీఛార్జ్ పాయింట్లు ఉండేవి. రీఛార్జ్ కార్డులు లభ్యమయ్యేవి. అయితే సెల్‌ఫోన్ విప్లవంలో భాగంగా ప్రిపెయిడ్ రీఛార్జ్‌లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి. చాలా తక్కువమంది ఖాతాదారులు మాత్రమే ఇంకా పాత ప్లాన్స్ వాడుతూ రీఛార్జ్‌లు చేయించుకుంటున్నారు. ఎక్కువమంది కాంబో ఆఫర్ల మీద దృష్టి పెట్టారు. మరి 2019 ఏడాదిలో కూడా ఇంకా ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు వాడాల్సిన అవసరం ఉందా?
2018 నుంచి ప్రిపెయిడ్ రీఛార్జ్‌ల ఆదాయం నెమ్మదిగా పడిపోవడం ప్రారంభమైంది. ముఖ్యంగా టాక్ టైమ్ రీఛార్జ్‌ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. చాలా టెలికాం కంపెనీలు ఈ పరిస్థితిని గ్రహించి తక్కువ రేటుకు ఈ ఆఫర్లను అందించాయి. కానీ పరిస్థితిలో మాత్రం ఏ మాత్రం మార్పులేదు. పైగా ఇంకా క్షీణిస్తోంది. దీనికి కారణం జియో టెలికాం రాకే. మూడు నెలలకు ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే చాలు ఇంటర్నెట్‌తో పాటు ఉచితంగా కాల్స్, ఎస్ఎంఎస్‌లు వస్తుండడంతో జనం జియో వైపే మొగ్గు చూపారు. దీనికి తోడు కాంబో ప్లాన్లు రావడంతో కస్టమర్లు ఎక్కువగా వీటి మీదే దృష్టి సారించారు.
మినిమం రీఛార్జ్‌లు ఉపయోగం లేదు
సాధారణంగా ఐడియా, ఎయిర్‌టెల్, వొడాపోన్‌లు ఈ రీఛార్జ్‌ల మీదే ఎక్కువ కాలం మనుగడ సాగించాయి. మినిమం రీఛార్జ్ చేసుకోవాలంటూ షరతు పెట్టి వందల కోట్లు వెనకేసుకున్నాయి. అయితే జియో దెబ్బకు ఈ టెలికాం దిగ్గజాలన్ని వెనక్కి తగ్గాయి. ఉన్న కస్టమర్లు పోకుండా ఉంటే చాలు అన్నట్లు ఉచితంగా రీఛార్జ్ ఇవ్వడం, ఇంటర్నెట్ ఇవ్వడం లాంటివి చేస్తున్నాయి. ఎయిర్‌టెల్ అయితే తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు చాలా రోజులు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందించింది. అంటే ఇప్పుడు మినిమం రీఛార్జ్ అనే దానికి విలువ లేకుండా పోయింది. ఎక్కువమంది కస్టమర్లు కాంబో రీఛార్జ్‌ల మీదే దృష్టి సారిస్తున్నారు. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నెట్‌తో పాటు వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు రావాలని కోరుకుంటున్నారు.