ఇండియన్ టెలికం ఇండస్ట్రీలో నెంబర్‌వన్‌గా నిలబడాలని జియో, ఎయిర్‌టెల్ ఏడాదిన్నర కాలంగా నిత్యం పోటీపడుతూనే ఉన్నాయి. అందుకోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. టారిఫ్‌లు, ఆఫర్లు ఇలా ప్రతి విషయంలోనూ ఒకదానితో ఒకటి పోటీపడడమే కాదు ట్రాయ్‌కు ఫిర్యాదులు కూడా చేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా ఈ రెండు టెలికం కంపెనీలు కలిసి యాపిల్ వాచ్‌ను కూడా వివాదంలోకి లాగాయి. అదేంటో చూడండి.
ఇదీ గొడవ
జియో, ఎయిర్‌టెల్ కూడా ఈ నెల నుంచి యాపిల్ వాచ్ అమ్మకాలను తమ సేల్స్ ఛానల్స్ ద్వారా ప్రారంభించాయి. యాపిల్ వాచ్, ఐ ఫోన్ రెండూ వేర్వేరు సిమ్‌లతో పని చేస్తాయి. అయితే ఐఫోన్‌తో వాచ్‌ను సింక్ చేస్తే వాచ్‌లో ఫిజికల్ సిమ్ కాకుండా ఈ-సిమ్ వేస్తే సరిపోతుంది. అయితే ఇందుకోసం ఓ డెడికేటెడ్ నెట్‌వర్క్ నోడ్ అవసరం. ఆపరేటర్ వివరాలు, సిమ్ డిటెయిల్స్,పిన్, రిమోట్ ఫైల్ మేనేజ్‌మెంట్ వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ నోడ్‌లో ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్ ఈ నెట్‌వర్క్ నోడ్‌ను ఇండియాకి బయట ఓ రిమోట్ సర్వర్‌లో సెట్ చేసుకుందని, ఇది టెలికం శాఖ లైసెన్సింగ్ నిబంధనలకు విరుద్ధమని జియో టెలికం డిపార్ట్‌మెంట్‌కు కంప్లయింట్ చేసింది. యూజర్ల విలువైన సమాచారానికి దీని వల్ల భద్రత ఉండదని కంప్లయింట్‌లో చెప్పింది.
ఎయిర్‌టెల్‌కు డీవోటీ నోటీసులు
జియో కంప్లయింట్ నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం..ఎయిర్‌టెల్‌కు నోటీసులిచ్చింది. అయితే జియో కంప్లయింట్స్‌ను ఎయిర్‌టెల్ తోసిపుచ్చింది. ఈ ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తమపై బురద చల్లేందుకు జియో చేస్తున్న ప్రయత్నాలని కొట్టిపారేసింది. ఎయిర్‌టెల్ మాత్రమే కాదు జియోతో సహా ఏ ఆపరేటరయినా ఈ-సిమ్‌ల కోసం SMDP serverని ఇండియా బయటే సెటప్ చేస్తాయని సమాచారం.