• తాజా వార్తలు

ఎంత డేటా కావాలి?


మొబైల్ నెట్‌వ‌ర్క్ 2జీలో ఉన్న‌ప్పుడు డాటా ప్యాక్‌లు ఎంబీల్లో ఉండేవి. ఓ 512 ఎంబీ డాటా ప్యాక్ తీసుకుంటే ఇంచుమించుగా నెలంతా వచ్చేది. కాస్త ఎక్కువ యూజ్ చేసేవాళ్లు 1జీబీ వాడేవారేమో.. కానీ 3జీ వ‌చ్చాక వేగంతోపాటు డాటా వినియోగమూ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు 4జీ యుగం. 1 జీబీ డాటా ప్లాన్ ఒక రోజు వ‌చ్చిందంటే చాలా పొదుపుగా వాడుతున్న‌ట్లే అన్న‌ట్లుంది ప‌రిస్థితి. ఏదో జియో మొద‌లుపెట్టిన డాటా వార్ పుణ్య‌మా అని డాటా చౌక‌గా దొరుకుతుంద కాబ‌ట్టి ఇష్టారాజ్యంగా వాడేస్తున్నాం కానీ నిజంగా మ‌న‌కెంత డాటా అవ‌స‌ర‌మో ఎప్పుడ‌న్నా ఆలోచించామా?
ఈమెయిల్, సోష‌ల్ మీడియా చూడ‌డం వంటి ప్రాథ‌మిక అవ‌స‌రాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతారా? అయితే మీకు చిన్న డాటా ప్లాన్ స‌రిపోతుంది. గేమ్‌లు ఆడేసి, వీడియోలు చూసేస్తుంటారా? అయితే అన్‌లిమిటెడ్ ప్లాన్ తీసుకోవ‌డ‌మే మేలు. ఇలా ఒక్కో అవ‌స‌రానికి ఒక్కోలా డాటా యూసేజ్ ఉంటుంది. అస‌లు ఎవ‌రికి ఎంత డాటా అవ‌స‌ర‌మో చెప్పేందుకు యూఎస్‌లోని నాలుగు మేజ‌ర్ టెలికం కంపెనీలు ఒక అధ్య‌య‌నం చేశాయి. అదేంటో చూడండి..
సోష‌ల్ మీడియా
స్మార్ట్‌ఫోన్ల‌లో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం ఇప్పుడు అంద‌రూ చేస్తుందే. ఫేస్‌బుక్‌లో ఫీడ్ అప్‌డేట్ చేస్తే యావ‌రేజ్‌న 50 కేబీ డాటా అవుతుంది. అదే ట్విట్ట‌ర్‌లో ఫీడ్ అప్‌డేట్ చేస్తే 70 కేబీ కావాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్చ‌ర్ అప్‌లోడ్ చేయాలంటే 30 నుంచి 150 కేబీ ఖ‌ర్చ‌వుతుంది. మీరు రోజుకు 10 పోస్టింగ్‌లు పెడితే యావ‌రేజ్ న నెల‌కు 0.07 జీబీ ఖ‌ర్చ‌వుతుంది. అదే మీ పోస్టులు రోజుకు 200 వ‌ర‌కు ఉంటే ర‌ఫ్ గా 1.43 జీబీ అవ‌స‌రం. మరీ మీరు సోష‌ల్ మీడియాకు దాసోహ‌మైపోయి ప్ర‌తి చిన్న అంశాన్ని పోస్ట్ చేసేసేవారైతే త‌ప్ప ఇంత‌కు మించి మీకు డాటా అవ‌స‌ర‌మ‌వ‌దు.
వెబ్ బ్రౌజింగ్‌
వెబ్ బ్రౌజింగ్‌కు ఎంత డాటా ఖ‌ర్చ‌వుతుంద‌నే మ‌నం చూసే వెబ్‌సైట్ల‌ను బ‌ట్టి మారుతుంది. మ‌ల్టీమీడియా ఫీచ‌ర్లున్న వెబ్‌సైట్ల‌లోకి వెళితే డాటా ఎక్కువ తీసుకుంటుంది. మీ ఫోన్‌లో సాధార‌ణ బ్రౌజింగ్ తీసుకుంటే నెల‌కు 100 ఎంబీ మించి ఖ‌ర్చు కాదు.. అయితే స్మార్ట్‌ఫోన్ల‌కు ఆప్టిమైజ్ కాని సైట్ల‌లోకి త‌ర‌చూ వెళ్లేవారయితే నెల‌కు 1 జీబీ వ‌ర‌కూ అవ‌స‌రం. కేవ‌లం స‌ర్ఫింగ్ మాత్ర‌మే చేస్తే నెల‌కు 200 ఎంబీ చాలు.
ఈమెయిల్‌
సోష‌ల్ మీడియా,వెబ్ బ్రౌజింగ్ త‌ర్వాత స్మార్ట్‌ఫోన్ల‌లో ఎక్కువ‌గా వాడే ఫీచ‌ర్ ఈ మెయిల్‌. మీరు మెయిల్స్‌తో బాగా బిజీగా ఉండి రోజుకు 500 మెయిల్స్ సెండ్ చేసేవార‌యితే మీకు నెల‌కు 0.5 జీబీ ఈ మెయిల్‌కు ఖ‌ర్చ‌వుతుంది. ఎక్కువ మంది యూజ‌ర్లు 10 నుంచి 20 ఈ మెయిల్స్ పంపేవారేన‌ని, వీరికి నెలంతా ఇలా వాడినా 0.02 జీబీ కంటే ఎక్కువ ఖ‌ర్చ‌వ‌దట‌. అయితే ఇది టెక్ట్స్ మెసేజ్ ల‌కు మాత్ర‌మే. ఎటాచ్‌మెంట్స్‌లో ఫొటోలు అవీ ఎక్కువ ఉంటే కాస్త పెర‌గొచ్చు. రోజుకు రెండు ఈ మెయిల్స్ ఒక‌టో రెండో ఫొటోలు ఎటాచ్ చేసి పంపినా నెల‌కు 100 ఎంబీ కంటే ఎక్క‌వు ఖ‌ర్చ‌వదు.
ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌
ఆన్‌లైన్‌లో పాట‌లు వింటే మాత్రం మీ డాటా ఇట్టే క‌రిగిపోతుంది. రోజూ రెండు గంట‌లు మ్యూజిక్ స్ట్రీమింగ్ చేస్తే మీకు నెల‌కు 3.5 జీబీ ఈజీగా ఖ‌ర్చ‌యిపోతోంది. వీడియో స్ట్రీమింగ్‌దీ ఇదే దారి. రోజూ ఓ గంట‌సేపు స్టాండ‌ర్డ్ డెఫినిష‌న్ వీడియో క‌నుక చూస్తే నెల‌కు 8 జీబీ వ‌ర‌కు డాటా కన్‌జంప్ష‌న్ ఖాయం. ఆన్‌లైన్‌లో పాట‌లు విన‌డం, వీడియోలు చూడ‌డం వైఫై మీద అయితేనే బెట‌ర్‌. అన్‌లిమిటెడ్ డాటా ఆఫ‌ర్లుఉన్నా కూడా వీటిని మొబైల్ డాటాతో చూడ‌డం వేస్ట్‌. ఎందుకంటే రోజుకు 1 జీబీ డాటా దాటితే డాటా స్పీడ్ కేబీల్లోకి ప‌డిపోతుంది..
గేమింగ్‌
క్యాండీ క్ర‌ష్‌, టెంపుల్ ర‌న్ లాంటి సాధార‌ణ గేమింగ్‌కు ఆన్‌లైన్లో పెద్ద‌గా డాటా అవ‌స‌రం ఉండదు. కానీ మ‌ల్టీప్లేయ‌ర్ గేమింగ్స్ డాటాను తినేస్తాయి కాబట్టి ఇలాంటివి వైఫై మీదే బెట‌ర్‌.
డౌన్‌లోడింగ్‌
సోష‌ల్ నెట్‌వ‌ర్క్‌ల నుంచి వాట్సాప్ వంటి మెసేంజ‌ర్ల నుంచి వ‌చ్చే ఫొటోలు, వీడియోలు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ కాకుండా మీ ఫోన్లో ఆప్ష‌న్ మార్చుకోండి. లేదంటే మీకు తెలియ‌కుండానే డాటా అయిపోతోంది.

జన రంజకమైన వార్తలు