స్మార్టు ఫోన్లు లెక్కలేనన్ని వస్తున్నాయి కానీ సర్వీస్ విషయంలో అన్నీ ఆకట్టుకోలేకపోతున్నాయి. తాజాగా వన్ ప్లస్ 3 ఫోన్ కొనుగోలు చేసిన ఓ కస్టమర్ కు ఎదురైన అనుభవం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పాడైన ఫోన్ బాగు చేయడానికి ఆ ఫోన్ విలువ కంటే రెట్టింపు మొత్తాన్ని సర్వీస్ సెంటర్ చార్జ్ చేయడంతో ఆయన ఆశ్చర్యపోయాడు.
ఆక్లాంక్ జైన్ అనే వ్యక్తి వన్ ప్లస్ 3 ఫోన్ ను కొన్నాడు. దాని విలువ రూ.28 వేలు. అయితే.. అనుకోకుండా దానిపై నీళ్లు పడ్డాయి. వెంటనే ఆయన దాన్ని స్విచ్ఛాఫ్ చేసి రెండు రోజుల తరువాత మళ్లీ ఆన్ చేశాడు. అన్ని ఫీచర్లు పనిచేస్తున్నా బ్యాక్ బటన్ ఒకటి పనిచేయకపోవడంతో సర్వీస్ సెంటర్ కు ఇవ్వాలనుకున్నాడు. ఫోన్ కు యాక్సిడెంటల్ వారంటీ ఉండడంతో దాన్ని క్లెయిమ్ చేస్తూ ‘సర్విఫై’ ద్వారా ఫోన్ ను సర్వీస్ సెంటర్ కు ఇచ్చాడు.
అయితే... సర్విఫై నుంచి ఆ ఫోన్ వెనక్కు వచ్చింది. యాక్సిడెంటల్ వారంటీ కింద రూ.6 వేలు మాత్రమే వస్తుందని.. కానీ, ఈ ఫోన్ రిపేర్ కు రూ.48,030 ఖర్చవుతందని చెప్తూ వెనక్కి ఇచ్చారు. అసలు ఫోనే రూ.28 వేలు అయితే రిపేరుకు అంత ఎందుకవుతుందంటూ జైన్ వారిని ప్రశ్నించినా సమాధానం లేదు. దీంతో జైన్ దీనిపై ఫేస్ బుక్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నాడు.