• తాజా వార్తలు

స్మార్ట్‌ఫోన్ పోతే వెంటనే బ్లాక్ చేయించవచ్చు, ఎలాగో తెలుసుకోండి

స్మార్ట్‌ఫోన్ నిత్య జీవితంలో ఓ భాగమైపోయింది. పర్సనల్ డేటా నుంచి బ్యాంకు ఖాతాల వివరాల వరకు అన్ని పనులు స్మార్ట్‌ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్నారంటే మళ్లీ చేజిక్కించుకోవడం కష్టం. ఫోన్ పోయిందంటే ముఖ్యమైన ఫైల్స్, డేటా కూడా పోయినట్లే. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అది దొరుకుతుందో లేదో తెలియదు. ఫోన్ కొట్టేసినవాళ్లు ఐఎంఈఐ నెంబర్ మార్చి క్లోన్ చేసి సెకండ్ హ్యాండ్‌లో దాన్ని అమ్మేస్తుంటారు. 

దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గట్టి చర్యలు తీసుకోబోతోంది. సెల్‌ఫోన్ చోరీలను, మొబైల్ క్లోనింగ్‌ను అడ్డుకోవడానికి టెలికాం మంత్రిత్వ శాఖ సెంట్రల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్-CEIRను ఏర్పాటు చేయబోతోంది. ఇందులో ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీస్-IMEIs ఉంటాయి.

దీని ద్వారా ఫోన్‌ను ట్రాక్ చేయడం మాత్రమే కాదు... ఫోన్ చోరీకి గురైనప్పుడు డేటా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. సెంట్రల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఏర్పాటైతే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది. ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి తర్వాత హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్‌కు కంప్లైంట్ చేయొచ్చు. దీంతో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్‌ 15 అంకెల IMEI నెంబర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతుంది.

ఇక ఆ ఫోన్‌తో ఏ సెల్యులార్ నెట్వర్క్‌ను యాక్సెస్ చేయడం సాధ్యం కాదు. ఐఎంఈఐ నెంబర్లను బ్లాక్, వైట్, గ్రే పేరుతో మూడు కేటగిరీలుగా ఉంటాయి. వైట్ లిస్ట్‌లో ఉన్న ఐఎంఈఐ నెంబర్లతో ఉన్న ఫోన్లను ఎవరైనా వాడుకోవచ్చు, అమ్మొచ్చు, కొనొచ్చు. బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే అవి చోరీకి గురైన, పోగొట్టుకున్న ఫోన్లు. ఏ సెల్యులర్ నెట్‌వర్క్ యాక్సెస్ లభించదు. ఇక గ్రే లిస్ట్‌లో ఉంటే వాటిని కొన్ని షరతులతో ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్రాజెక్ట్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్‌ 2017 జూలైలో ప్రకటించింది. మహారాష్ట్రలోని పూణెలో ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఇక దేశవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టేందుకు 2019-20 మధ్యంతర బడ్జెట్‌లో కేంద్రం రూ.15 కోట్లు కేటాయించింది. 

జన రంజకమైన వార్తలు