టెలికం కంపెనీల హనీమూన్ ముగిసింది. నేనంటే నేనంటూ వినియోగదారులపై ఆఫర్ల వర్షం కురిపించిన టెలికం కంపెనీలు ఇప్పుడు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయి. దానికితోడు ఏజీఆర్ బకాయిలు తక్షణం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు టెలికం కంపెనీలకు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు తయారయ్యాయి. సెప్టెంబర్ నెలాఖరుకు ఎయిర్‌టెల్ నికర నష్టం 25వేల కోట్ల పైమాటే. ఇక గతేడాదే కలిసిపోయిన వొడాఫోన్ ఐడియా నష్టం 50 వేల కోట్ల రూపాయలు. ఏజీఆర్ బకాయిలు కొన్ని వేల కోట్లు దీనికి అదనం. ఈ పరిస్థితుల్లో టెలికం కంపెనీలు బతికి బట్టకట్టాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్. ఛార్జీలు పెంచడమే. అందుకు ఇప్పటికే రంగం సిద్ధమైపోయిందని.. కాల్ రేట్లు, డాటా రేట్లు అన్నింటినీ దాదాపు అన్ని కంపెనీలు పెంచబోతున్నాయని మార్కెట్ వర్గాలు బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నాయి.
కాల్ రేట్లు 67% పెరుగుతాయ్
ఎంత పెంచాలి, ఎప్పటి నుంచి పెంచాలని టెలికం కంపెనీలేవీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోయినా ఎంత పెంచాలో ఒక అంచనాకు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం సెల్‌ఫోన్ యూజర్లు కాల్ రేట్లపై 67%, డేటా రేట్లపై 20 శాతం అదనపు భారం మోయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.
6పైసలు కాదు 10 పైసలు
ఒక నెట్‌వర్క్ నుంచి ఇంకో నెట్‌వర్క్‌కు అంటే ఒక కంపెనీ నెంబర్ నుంచి ఇంకో టెలికం కంపెనీకి చేసే కాల్స్‌కు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జి (ఐయూసీ)ని టెలికం శాఖ నిమిషానికి 6 పైసలుగా నిర్ణయించింది. దీన్ని 10 పైసలకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఇది ఫ్రీ. ఐయూసీ ఛార్జీలు నిమిషానికి 10 పైసలు చేస్తే కాల్ రేట్లు దాదాపు 67 % పెరుగుతాయని అంచనా.
డేటా 20% కాస్ట్‌లీ
మరోవైపు డేటా ఛార్జీలు కూడా 20% వరకు పెరగబోతున్నాయి. ప్రస్తుతం సరాసరిన ఒక జీబీ డేటా కాస్ట్ వివిధ టెలికం కంపెనీల్లో 2 రూపాయల 30 పైసల నుంచి 6 రూపాయల వరకు పడుతుంది. త్వరలో మినిమం ఛార్జీ దీనికి 3 రూపాయలు కావచ్చని బిజినెస్ స్టాండర్డ్ పత్రిక కథనం.
మినిమం రీఛార్జి ప్లాన్ కూడా పెరగొచ్చు
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో మినిమం రీఛార్జి ప్లాన్ 28 రోజులకు 23 రూపాయలు, వొడాఫోన్‌లో 24, జియోలో 59 రూపాయలు. వీటి ధరలు కూడా పెరగొచ్చని, ఇన్‌కమింగ్ కాల్స్ మాత్రమే వాడుకునే సాధారణ యూజర్లకు కూడా దీని భారం తగ్గకపోవచ్చని అంచనా. ఎయిర్‌టెల్, వొడాఫోన్ కూడా మినిమం ఛార్జీని జియో లెవెల్‌కు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ఐయూసీ కింద ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు వసూలు చేసినందుకే యూజర్లలో వ్యతిరేకత తెచ్చుకున్న జియో ఇక పెద్దగా ధరలు పెంచకపోవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.