• తాజా వార్తలు

మినిమం రీఛార్జి అంటూ ఎవ‌రెంత బాదుతున్నారు?

టెలికం కంపెనీలు నిన్నా మొన్న‌టి దాకా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే టార్గెట్‌గా రోజుకో కొత్త స్కీమ్ ప్ర‌క‌టించాయి. జ‌నాలంద‌రూ స్మార్ట్‌ఫోన్‌ల‌కు, డేటా వాడ‌కానికి బాగా అల‌వాట‌య్యాక ఇప్పుడు ఛార్జీలు బాదుడు షురూ చేశాయి.  జియో, వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ఇలా అన్నికంపెనీలు ప్రీపెయిడ్ టారిఫ్‌ల‌ను ఏకంగా ఒకేసారి 40 శాతం పెంచేశాయి.  ఇది చాల‌ద‌న్న‌ట్లు మినిమం రీఛార్జి అంటూ కొత్త పాట అందుకున్నాయి. అంటే ఈ మినిమం రీఛార్జి చేయించుకోక‌పోతే ఇన్‌క‌మింగ్ కూడా రాదన్న‌మాట‌. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు మార్కెట్లో ఉన్న‌మూడు పెద్ద కంపెనీలు మినిమం రీఛార్జి పేరుతో ఎంతెంత వ‌సూలు చేస్తున్నాయో చూద్దాం

జియో మినిమం రీచార్జి 75 రూపాయ‌లు
జియోలో మినిమం రీఛార్జి 75 రూపాయ‌లు. అది కూడా ఫీచ‌ర్ ఫోన్‌లా ఉండే జియో ఫోన్‌లో మాత్ర‌మే. 75 రూపాయ‌ల మినిమం రీఛార్జితో 28 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది. 500 ఎంబీ డేటా ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌,  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 500 నిముషాల టాక్‌టైం.

* మామూలు స్మార్ట్‌ఫోన్ల‌లో జియో వాడేవారికి మినిమం రీఛార్జి 98 రూపాయ‌లు. 28 రోజుల వ్యాలిడిటీ వ‌స్తుంది.  మొత్తం 28 రోజుల‌కు క‌లిపి 2జీబీ డేటా ఫ్రీ. జియో టు జియో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌,  ఇత‌ర నెట్‌వ‌ర్క్‌ల‌కు 500 నిముషాల టాక్‌టైం.

వొడాఫోన్ - ఐడియా మినిమం రీఛార్జి 48 రూపాయ‌లు
వొడాఫోన్ - ఐడియాలో అయితే మినిమం రీఛార్జి 48 రూపాయ‌లు. అంటే దీనిలో 14 రోజుల ప్యాక్ 24 రూపాయ‌లు. ఆ లెక్క‌న 28 రోజుల‌కు 2 ప్యాక్‌ల ఖ‌రీదు 48 రూపాయ‌లు. దీనిలో కూడా ఎయిర్‌టెల్‌లో మాదిరిగా ఇన్‌క‌మింగ్ కాల్స్ వ‌స్తాయంతే. డేటా, కాలింగ్‌, ఎస్ఎంఎస్ బెనిఫిట్లేమీ ఉండ‌వు. 

* 49 రూపాయ‌ల ఆల్‌రౌండ‌ర్ ప్యాక్ వేయించుకుంటే 38 రూపాయ‌ల టాక్‌టైం, 100 ఎంబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీతో వ‌స్తాయి.

ఎయిర్‌టెల్ మినిమం రీఛార్జ్ 23 రూపాయ‌లు
ఎయిర్‌టెల్‌లో మినిమం రీఛార్జి 23 రూపాయ‌లు. వ్యాలిడిటీ 28 రోజులు. అయితే కేవ‌లం ఇన్‌క‌మింగ్ మాత్ర‌మే వ‌స్తుంది.  జియో మాదిరిగా దీనిలో కాలింగ్‌, డేటా, ఎస్ఎంఎస్ ఎలాంటి బెనిఫిట్స్ లేవు.

49 రూపాయ‌ల రీఛార్జి చేయించుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతోపాటు 38.43 రూపాయ‌ల టాక్‌టైం, 100 ఎంబీ డేటా వ‌స్తుంది. 79 రూపాయ‌ల‌తో రీఛార్జి చేస‌కుంటే 64 రూపాయ‌ల టాక్‌టైం, 200 ఎంబీ డేటా వ‌స్తుంది. దీనికి కూడా 28రోజుల వ్యాలిడిటీ ఉంది. 

జియోనే ఖ‌రీదా? 
మొన్న‌టి దాకా చౌక ధ‌ర‌ల‌తో ఇండియ‌న్ మార్కెట్‌ను షేక్ చేసిన జియో ఇప్పుడు ధ‌ర‌లు పెంచి క‌స్ట‌మ‌ర్ల‌ను కంగారు పెట్టేస్తోంది. మినిమ‌మ్ రీఛార్జిప‌రంగా చూస్తే ప్ర‌స్తుతం మార్కెట్లో జియోనే ఎక్కువ ఖ‌రీదు.  ఆశ్చర్యం క‌లిగించే విష‌య‌మేమిటంటే మామూలుగా చార్జీలు బాదేసే ఎయిర్‌టెల్ మినిమం రీఛార్జి ధ‌ర‌ల్లో మాత్రం చీపెస్ట్‌గా ఉండ‌టం.  కానీ ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌య‌మేమిటంటే వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ మినిమం రీఛార్జి త‌క్కువ‌గా ఉన్నా ఎలాంటి కాలింగ్ బెనిఫిట్స్ లేవు. ఆ త‌ర్వాత ప్యాక్స్‌లోనూ మినిమం టాక్‌టైమే ఉంటోంది. దాంతో పోల్చితే జియోనే చౌక‌. ఇవన్నీ ప్ర‌స్తుతానికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాక్స్‌. త‌ర‌చూ మారిపోయే అవ‌కాశం ఉంది.

జన రంజకమైన వార్తలు