“వినియోగదారుల నుంచి స్వీకరించే ఆధార్ డేటాను ప్రైవేటు సంస్థలు తక్షణం తొలగించాలి.. దీనివల్ల టెలికాం వినియోగదారులకు మరిన్ని కష్టాలు”... ఈ వార్తతో తీవ్ర ఆందోళన వెల్లడైన నేపథ్యంలో టెలికాం మంత్రిత్వ శాఖ, విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) ఒక ప్రకటన జారీచేయాల్సి వచ్చింది. “ఎవరైనా తమ ఆధార్ ఈ-కేవైసీని తాజా కేవైసీతో మార్చాలని భావిస్తే మునుపటి తమ ఆధార్‌ను డీ-లింక్ చేయాల్సిందిగా వారు తమ సర్వీస్ ప్రొవైడర్లకు తాజా అధికారిక చెల్లుబాటయ్యే పత్రాల (OVD)ను సమర్పించాలన్నది మునుపటి సర్క్యులర్ల నిర్దేశం. అయితే, ఇలాంటి సందర్భాల్లో వారి మొబైల్ నంబర్ డిస్‌కనెక్ట్ కాదు” అన్‌అది దీని సారాంశం.
అంతకుముందు...
సర్వీస్ ప్రొవైడర్లు ఆధార్ డేటాను నిల్వచేయరాదన్న ఆదేశాల ఫలితంగా ఆధార్ కేవైసీ పద్ధతిలో కనెక్షన్ పొందిన దేశంలోని ప్రస్తుత టెలికాం వినియోగదారులలో దాదాపు 50 శాతం తమ నంబర్ డిస్ కనెక్ట్ అయిపోతుందని అపోహలో పడ్డారు. అయితే, ఇది అపోహ కాదని, వాస్తవం కాగల ప్రమాదం ఉందని సమాచారం. కాగా, ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవాలని, ఆధార్ మాత్రమే ఉపయోగించుకుంటే కొత్త సిమ్ లభిస్తుందని అంతకుముందు టెలికాం కంపెనీలు వినియోగదారులను ఊరించాయి... ఒత్తిడి చేశాయి... బలవంతపెట్టాయి. దీన్ని మనమంతా నమ్మి ఆధార్ నంబర్ సమర్పించి కొత్త సిమ్ తీసుకున్నాం. ఆ తర్వాత ప్రస్తుత నంబర్లకు కొత్తగా కేవైసీ కూడా చేశాం. ఇదంతా తప్పనిపిస్తోంది కదూ! అయితే, కేవలం ఆధార్ కేవైసీతో యాక్టివేట్ చేసుకున్న సిమ్ కార్డులన్నీ డిస్‌కనెక్ట్ అయిపోతాయన్నది తాజాగా అందుతున్న సమాచారంలోని సారాంశం. పైగా ఇలా డిస్‌కనెక్ట్ అయ్యే కనెక్షన్లు 50 కోట్లదాకా ఉంటాయని అంచనా.
ఆధార్ కేవైసీ మొబైల్స్‌కు ముప్పు ఎందుకు?
ఇందుకు రెండు కారణాలున్నాయి... మొదటిది... సుప్రీం కోర్టు ఆదేశాలు... వినియోగదారులకు సంబంధించిన ఆధార్ డేటాను పూర్తిగా తొలగించాలని ప్రైవేటు కంపెనీలన్నిటినీ న్యాయస్థానం ఆదేశించింది. దీని ఆధారంగానే UIDAI కూడా వినియోగదారుల ఆధార్‌ను డీ-లింక్ చేయాలని స్పష్టం చేసింది. తదనుగుణంగా ‘ఎగ్జిట్ ప్లాన్’ను కోరింది. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలు ఆధార్‌ను డీ-లింక్ చేస్తే వారివద్ద కేవైసీ అంటూ ఏదీ ఉండదు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు టెలికాం మంత్రిత్వశాఖ నిబంధనల రీత్యా... మొబైల్ నంబర్ డిస్‌కనెక్షన్ లేదా మరో పద్ధతిలో కేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇక రెండో కారణం... ఆధార్ కేవైసీని డిజిటలైజ్ చేసినందున దానికి ముందటి కేవైసీ పత్రాలను ధ్వంసం చేయాలని ఈ ఏడాది మార్చి నెలలో టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. తదనుగుణంగా పాత పత్రాలన్నీ రద్దయ్యాయి కాబట్టి, తాజాగా డిజిటలైజ్ చేసిన ఆధార్ డీ-లింక్ అయిందిగనుకా- ఇప్పుడిక వినియోగదారుల కేవైసీ అంటూ ఏదీ లేకుండాపోయింది. మరి అలాంటప్పుడు మొబైల్ డిస్‌కనెక్ట్ అయినట్టే కదా!
ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?
ఈ చిక్కునుంచి బయటపడాలంటే ఆధార్‌తో పనిలేని కొత్త కేవైసీ పద్ధతిని అనుసరించడమే ఏకైక మార్గం. దీంతో కొత్తగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, తాజా పద్ధతి అమలు-పర్యవేక్షణల దృష్ట్యా అటు టెలికాం ఆపరేటర్లకు, ఇటు వినియోగదారులందరికీ శిరోభారమే కాగలదు. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ వివిధ ఆపరేటర్ల ప్రతినిధులతో సమావేశమై ఈ సంక్లిష్ట అంశంపై చర్చించారు. ఏదేమైనా... వినియోగదారులకు ఎలాంటి చిక్కులూ ఉండబోవని మాత్రం భరోసా ఇచ్చారు. ఈ కేవైసీ పరివర్తన సజావుగా సాగిపోవాలని, వినియోగదారులకు ఎలాంటి సమస్యా రాకూడదని స్పష్టం చేశారు. ఈ దిశగా పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాన్‌కార్డ్ వంటివాటితో కేవైసీ నిబంధనను పాటించే అవకాశాలున్నాయి.