దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ యూజర్లకు నిరాశకరమైన వార్తను అందించింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 3G సేవలను నిలిపివేసే దిశగా అడుగులు వేస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో షట్ డౌన్‌ను ప్రారంభించింది. కోల్‌కతా సర్కిల్ పరిధిలో 3G సేవలు నిలిపి వేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. 4G సేవలను బలోపేతం చేసేందుకు ఈ సర్కిల్‌లో స్పెక్ట్రమ్ మార్పులు చేపట్టినట్లు తెలిపింది. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 3జీ సేవలు ఆపివేస్తామని పేర్కొంది.
2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో రాకతో దేశంలో 4G సేవలు విస్తృతమయ్యాయి. కాగా భారత్‌లో ఒక సర్కిల్‌లో 3G సేవలు నిలిపివేయడం ఇదే మొదటిసారి. అయితే 2G సేవలను మాత్రం కొనసాగిస్తున్నట్లుగా ఎయిర్‌టెల్ తెలిపింది. 4G సేవలు మరింత విస్తృతం చేసే ఉద్దేశ్యంలో భాగంగా 3G సేవలు తగ్గిస్తున్నామని, 4G వైపు మళ్లుతున్నామని ఎయిర్‌టెల్ తెలిపింది. కోల్‌కతా నగరంలో ఎయిర్‌టెల్ మొబైల్ బ్రాడ్‌బాండ్ హైస్పీడ్ 4G సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 3G కస్టమర్లు అందరు కూడా వారి హ్యాండ్‌సెట్స్, సిమ్ కార్డులు అప్ గ్రేడ్ చేసుకోవాలని ఎయిర్‌టెల్ కోరింది.
కాగా, జనవరి - మార్చి క్వార్టర్‌లో సంస్థ ఆర్పు (ARPU-యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 6.5 శాతం పెరిగి రూ.123కు పెరిగిందని భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ప్రకటించింది. అయినప్పటికీ ఇది సరిపోదని పేర్కొంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆర్పు 116గా ఉంది. ఏడాది చివరలో ఆర్పు పెరగడం సంతోషకరమని, అయితే రూ.123తో స్థిరంగా ఉన్నట్లు కాదని భారతీ ఎయిర్‌టెల్ ఇండియా-సౌత్ ఏసియా ఎండీ అండ్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అంతకుముందు వచ్చిన ఏడాది కంటే గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ బిజినెస్ రెండింతల కంటే ఎక్కువగా ఉంది. 2019 జనవరి-మార్చి పీరియడ్‌లో రూ.1,377.8 కోట్లుగా కాగా, అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌లో ఇది రూ.482.2 కోట్లుగా ఉంది.