జియో దెబ్బకు ఒకప్పుడు రాజులా వెలిగిన టెల్కోలు అన్నీ కోట్ల నష్టాలోకి వెళ్లాయి. వీటిలో ప్రధానంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ ఒక్కసారిగా అనేక కుదుపులకు లోనైంది. కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. రోజురోజుకీ సంస్థ నష్టాలు పెరిగిపోతుండటంతో నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఇక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకం ద్వారా ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేట్ టెలికాం సంస్థల్లో 25వేల నుంచి 30వేల మంది ఉద్యోగులు మాత్రమే ఉంటే.. వాటికి ఐదు రెట్ల మంది ఉద్యోగులు బీఎస్‌ఎన్‌ఎల్( 2018 వరకు 1,74,000 ఎంప్లాయిస్)లో పనిచేస్తున్నారు. దీంతో కంపెనీ వార్షిక వ్యయాలు రూ.15వేల కోట్లకు చేరాయి. దీంతో ఉద్యోగులకు సంబంధించిన కొన్ని బెనిఫిట్స్‌ను కూడా కంపెనీ నిలిపివేసింది. ఎలక్ట్రిసిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు తగ్గించడం, రూ.5వేల కోట్లను ఆదా చేసేందుకు సంస్థ ఉద్యోగుల బెనిఫిట్స్‌ను స్తంభింపజేయడం ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నాం. అలాగే ఎల్‌టీసీ(ప్రయాణ భత్యం (లీవ్ ట్రావెల్ అలవెన్స్), మెడికల్ ఖర్చులపై కూడా నియంత్రణలు అమలు చేశామమని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.
బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ మనుగడలో ఉండాలంటే ఐఐఎం అహ్మదాబాద్ ఒక నివేదిక కూడా తయారు చేసింది. ప్రాథమిక నివేదిక ద్వారానే సుమారు 35వేల మంది ఉద్యోగులకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలిసింది. దీని కోసం రూ.13వేల కోట్లు అవసరం అవుతాయని సంస్థ అంచనా వేస్తోంది. ఈ సంస్థ ప్రిలిమినరీ రిపోర్ట్‌ను సమర్పించగా.. ఫైనల్ రిపోర్టును త్వరలోనే సమర్పించనున్నారు. వీఆర్‌ఎస్ ప్యాకేజ్‌ను అమలు చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను బీఎస్‌ఎన్‌ఎల్ పరిశీలిస్తున్నట్లు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ప్రభుత్వ మద్దతుతో గానీ, రుణం ద్వారా గానీ సమస్యను పరిష్కరించనున్నట్లు వివరించారు.
కొంతమంది ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అనుపమ్ కూడా ఘాటుగా స్పందించారు. బీఎస్ఎన్ఎల్‌లో కొనసాగాలంటే సంస్థ లాభాలు ఆర్జించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని, సంస్థ లాభాల్లో ఉన్నప్పుడే ఉద్యోగులకు అన్ని రకాల బెనిఫిట్స్ అందజేయగలుగుతామని ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్‌పై కూడా చర్చించామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటా మని తెలిపారు. దీంతో ఉద్యోగులు సంస్థను వీడాల్సి ఉంటుందని ఖచ్చితంగా తెలుస్తోంది. 1.75 లక్షల మంది ఉద్యోగులతో పాటు సంస్థ ముందుకు సాగాలంటే ఏడాదికి బిఎస్‌ఎన్‌ఎల్ 15వేల కోట్లు అవసరం అవుతాయని ఒక సీనియర్ అధికారి వివరించారు.