జియో, ఎయిర్‌టెల్ సంస్థల మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులను ఆకర్షించేందుకు గిగాఫైబర్‌ను జియో ఈ నెలలో ప్రారంభించిన విషయం తెలిసిందే! ఇప్పుడు ఎయిర్‌టెల్ కూడా ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్‌ను ప్రవేశపెట్టింది. V FIBREగా వ్యవహరించే ఈ సర్వీస్ ద్వారా బ్రాండ్ బ్యాండ్ యూజర్లకు మరింత వేగంతో, కచ్చితత్వంతో ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ఇప్పటికే ఈ కేటగిరీలో ACT Fibernet, Reliance Jio GigaFiber, BSNL సేవలు అందిస్తుండగా.. ఎయిర్‌టెల్ కూడా వీటికి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం V FIBRE సేవలను ఎయిర్‌టెల్ చెన్నైలో ప్రారంభించింది. ప్రస్తుతం 30 నగరాల్లో ఈ హైస్పీడ్ ఫైబర్ నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే దేశంలో ఉన్న 87 నగరాలకూ విస్తరించబోతోంది.
Airtel V-Fiber Technology
యూరప్ నగరాల్లో నంబర్ 1.. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీగా పేరొందిన Vectorisation సాంకేతికతను ఎయిర్‌టెల్ V-Fiberలో ఉపయోగించింది. దీని ద్వారా ఏకంగా 300 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందుతాయి. ఇప్పటి వరకూ ఎయిర్‌టెల్ అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ఇదే కావడం విశేషం! దీని ద్వారా ఎటువంటి బఫరింగ్ లేకుండా ఎంత పెద్ద ఫైల్ అయినా చాలా వేగంతో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సబ్‌స్క్రిప్షన్ ఎలా?
ప్రస్తుతం బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లు.. ఈ V-Fiberకు అప్‌గ్రేడ్ అవ్వడం చాలా సులభం. కేవలం రూ.1000తో ఫైబర్ మోడెమ్ ఉంటే సరిపోతుంది. కొత్త కస్టమర్లు.. ఎయిల్‌టెల్ వెబ్‌సైట్‌లో ఈ ఫైబర్ కనెక్షన్ కోసం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
V-Fiber Plans
మొదట రూ.999 ప్లాన్‌తో ఈ సర్వీసును ఎయిర్‌టెల్ ప్రారంభించింది. అనంతరం రూ.799 కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో 40 ఎంబీపీఎస్ వేగంతో 100 జీబీ వరకూ డేటా లభిస్తుంది. దీని తర్వాత ఉండే ప్లాన్లన్నీ.. 100 ఎంబీపీఎస్ నుంచి 300 ఎంబీపీఎస్ మధ్య ఉండి రూ.999 నుంచి రూ.2,199 వరకూ ఉంటాయి. ఇక ఎంట్రీ లెవెల్ ప్లాన్‌లో 500 జీబీతో పాటు, ఎక్కువ ప్లాన్ అయితే 1000 జీబీ వరకూ డేటాను అదనంగా అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ ఏడాది అక్టోబర్ 31 వరకూ మాత్రమే ఉంటుంది. అన్ని ప్లాన్స్‌లోనూ అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ఇక రూ.1999ప్లాన్‌లో అపరిమితమైన డేటాను కూడా పొందచ్చు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం. కొన్ని సందర్భాల్లో నెలకు సంబంధించిన డేటా మిగిలిపోయినా.. దానిని తర్వాతి నెలకి కలిపే సదుపాయం కూడా ఉంది. ఇది రూ.999, ఆపైన ప్లాన్స్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వీటితో పాటు ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్ అయితే 15 శాతం, సంవత్సర సబ్‌స్క్రిప్షన్ అయితే 20 శాతం డిస్కౌంట్ కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. అంతేగాక హైదరాబాద్ నగరంలో ఎఫ్‌యూపీ లిమిట్‌ని ఎయిర్‌టెల్ తొలగించింది. ఇతర నగరాల్లో మాత్రం ఎఫ్‌యూపీ లిమిట్ కొనసాగుతుంది.
ఎందుకీ ఆఫర్లు?
ప్రస్తుతం మార్కెట్‌లో ఇతర సర్వీస్ ప్రొవైడర్లు ఎయిర్‌టెల్ కంటే తక్కువ ధరలకే ఈ ఫైబర్ సేవలను అందిస్తు న్నాయి. దీంతో ఈ V-Fiber ధరలను భరించడం కష్టమే అవుతుంది. ఇప్పటికీ జిగాబైట్‌లోనే డేటాను అందిస్తోంది. అయితే ఇవి పైకి కనిపించకుండా.. డేటా రోలోవర్ పథకాలు, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వంటి ఆఫర్లు ప్రవేశపెట్టింది. వీటితో పాటు హైదరాబాద్ వంటి నగరాల్లో ఏ ప్లాన్‌కి అయినా అపరిమితంగా డేటాను ఇస్తోంది. ఆరునెలలు, ఏడాది బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ఎంచుకుంటే.. వారికి 20 శాతం డిస్కౌంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది.