తక్కువ ధరకే బ్రాడ్ బ్యాండ్ సేవలను ఆగస్టు 15వ తేదీ నుంచి అందించేందుకు రిలయన్స్ జియో ఏర్పాట్లు చేస్తోంది. దేశంలోని 1,100 నగరాల్లో జియో జిగాఫైబర్ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీనికి రిజిస్ట్రేషన్లు 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ (ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఈ సేవలు ముందు) పద్ధతిన ఈ ఎఫ్‌టీటీహెచ్ సర్వీసు అందించబోతోంది. ఏ ప్రాంతం నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు వస్తే.. ఆ ప్రాంతంలో తొలిదశలో ఈ ఫైబర్ సేవలను ప్రవేశపెడతారు. ఈ జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
రిజిస్ట్రేషన్ విధానం
* మైజియో యాప్ లేదా జియో వెబ్‌సైట్ నుంచి జియో గిగా ఫైబర్ కనెక్షన్ కోసం రిజిస్ట్రర్ చేసుకోవాలి.
* తర్వాత రిలయన్స్ జియో నుంచి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఏ ప్రాంతం నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు వచ్చాయో కంపెనీ లెక్కిస్తుంది.
* ఎక్కువ కనెక్షన్ల కోసం రిక్వెస్ట్‌లు వచ్చిన ప్రాంతాన్ని కంపెనీ నిర్ధారించుకుని తొలి దశలో జియోగిగా ఫైర్ కనెక్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తారు. తర్వాత జియో గిగాఫైబర్ మోడెమ్‌తో పాటు జియో గిగా టీవీని అందిస్తారు.
* ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత.. హైస్పీడ్‌తో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అత్యధిక మొత్తంలో 1 జీబీపీఎస్ వరకూ డౌన్‌లోడ్ స్పీడ్ ఉంటుంది.
మరిన్ని వివరాలు..
జియో మోడెమ్‌తో పాటు జియో గిగాటీవీ ఉంటుంది. జియో గిగాటీవీ సెటాప్ బాక్సు అందజేస్తారు. దీనిని టీవీకి అనుసంధానం చేసుకుని దేశంలో ఎక్కడికైనా హెచ్‌డీ క్వాలిటీతో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అంతేగాక అపరిమితమైన జియో టీవీ, సర్వీసులు పొందవచ్చు. ఇప్పటివరకూ ఈ బ్రాండ్ సర్వీస్ ప్లాన్‌లను జియో ప్రకటించకపోయినా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పూర్తి ఉచితం.. కానీ ఇన్‌స్టాల్ చేసినందుకు కొంత మొత్తంలో చార్జీ వసూలు చేస్తారు. ఇతర సర్వీసుని ఎంచుకుంటే అప్పుడు ఈ ఇన్‌స్టాలేషన్ చార్జీలను తిరిగి ఇచ్చేస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. కనెక్షన్ అందజేసే సమయంతో పాటు ఇతర వివరాలను తెలియజేస్తారు. రెండేళ్ల నుంచి ఈ ఎఫ్‌టీటీహెచ్ సేవలపై పరీక్షలు నిర్వహిస్తోంది.