• తాజా వార్తలు

జియో నుంచి vowifi,అసలేంటిది ?

ఇండియన్ టెలికం పరిశ్రమ రూపురేఖలను రిలయన్స్ జియో వచ్చిన అనతికాలంలోనే మార్చేసిందని చెప్పవచ్చు. ఎల్‌టీఈ నెట్‌వర్క్‌తో దేశంలో అత్యధిక 4జీ నెట్‌వర్క్ కవరేజ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే రిలయన్స్ జియో నెట్‌వర్క్ ప్రత్యర్థి నెట్‌వర్క్ సంస్థలను నిద్రపోనివ్వడంలేదు. దేశీయ టెలికాం రంగంలో రాజుల్లాగా వెలుగొందిన దిగ్గజాలు ఎయిర్ టెల్, ఐడియా,వొడాఫోన్ లాంటి సంస్ధలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో  ఆ కంపెనీలకు మరో ఝలక్ ఇచ్చేందుకు జియో రెడీ అయినట్లు తెలుస్తోంది.

సెల్యూలర్ నెట్వర్కుతో సంబంధం లేకుండా వీవో‌వై-ఫై (వాయిస్ ఓవర్ వై-ఫై) సేవల ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో వీవోఎల్‌టీఈ సేవలు ప్రారంభించిన తొలి కంపెనీగా రికార్డ్ కొట్టేసిన ముకేశ్ అంబానీ జియో ఇప్పుడు ఇది మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా మరో రికార్డుకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. 

ఈ నేపథ్యంలోనే వీవో‌వై-ఫై (వాయిస్ ఓవర్ వై-ఫై) సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కొంతమంది ఫోన్లలో వీవో వై-ఫై చిహ్నం కనిపిస్తోంది. ఈ వైఫై ద్వారా మరికొన్ని రోజుల్లోనే సెల్యూలర్ నెట్వర్కులతో సంబంధం లేకుండా వైఫైతో హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చుఇది మార్కెట్లోకి వస్తే సిగ్నల్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్య ఎదురయ్యే పరిస్థితి వుండదు. కంపెనీ ఇప్పటికే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ వంటి సర్కిళ్లలో ఈ సేవలను పరీక్షిస్తోంది.

జియో యూజర్లకు మాత్రమే
ఇప్పటి వరకు అయితే కంపెనీ ఎప్పుడు పబ్లిక్ వై-ఫై సేవలు ప్రారంభించేది స్పష్టంగా తెలియదు. అయితే రానున్న నెలల్లోనే ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. కాగా జియో వై-ఫై సేవలు తొలిగా జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి రావొచ్చు. కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాకుండా జియో ఫోన్లలోనూ ఈ సేవలు పొందే వీలుండొచ్చు. జియో వైఫై సేవలు అందుబాటులోకి వస్తే సెల్యులర్ నెట్‌వర్క్‌తో పనిలేకుండానే కాల్స్ చేసుకోవచ్చు. దీంతో గ్రామీణ ప్రాంతాలు, నెట్‌వర్క్ సరిగాలేని చోట్ల యూజర్లకు ప్రయోజనం కలుగునుంది.

ఇదిలా ఉంటే రిలయన్స్ జియో దూసుకుపోతోంది. మార్చి నెలలో జియోకు ఏకంగా 94 లక్షల మంది కొత్త కస్టమర్లు జతయ్యారు. వీరిలో అత్యధిక భాగం ఇతర టెలికం కంపెనీల నుంచి వచ్చిన వారే. వీరి చేరికతో దేశంలో జియో యూజర్ల సంఖ్య 30.7 కోట్లకు చేరింది.
 

జన రంజకమైన వార్తలు