• తాజా వార్తలు

టెలికం దిగ్గజాలకు బాడ్ న్యూస్, పోస్ట్ పెయిడ్ వద్దంటున్న కస్టమర్లు

దేశీయ టెలికాం రంగంలో 4జీ రాక‌తో మొబైల్‌ వినియోగదారులు పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై అనాసక్తిని వ్యక్తం చేస్తున్నారు. టెల్కోలు పోస్టు పెయిడ్‌లో అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వారు ప్రీపెయిడ్‌కు మారుతున్నారు. ఏడాదికేడాది పోస్ట్ పెయిడ్ వినియోగించే వారి సంఖ్య భారీగా తగ్గిపోతోంది.  కంపెనీల ఆదాయంలోనూ 10 శాతం పైగానే తగ్గుదల చోటు చేసుకుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. 

గతేడాది సెప్టెంబర్‌ నాటికి టెలికం రంగంలో ప్రీపెయిడ్‌ ఖాతాదారుల సంఖ్య 95.6 శాతానికి చేరింది. ఈ ఏడాది కి మరింతగా అది కిందకు జారింది. గతేడాది కాలంలే 5.17 కోట్ల మంది పోస్టుపెయిడ్‌ వినియోగదారులు ఉన్నారని టెలికాం నియంత్ర‌ణ సంస్థ‌ ఈ మధ్య కాలంలో ఒక నివేదికలో తెలిపింది. ఇంతక్రితం వినియోగదారులతో పోల్చితే 1.84 శాతం తగ్గారు. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కేటగిరి ఎ, బి సర్కిళ్లలో పోస్టుపెయిడ్‌ ఖాతాదారులు క్రమంగా తగ్గిపోతున్నారు.

టెలికం కంపెనీలు పోస్టు పెయిడ్‌ ఖాతాదారులను ఆకర్షించి రెవెన్యూ పెంచుకోవాలని భావిస్తున్నాయి. అయితే ప్రీపెయిడ్‌ విభాగంలో ఆకర్షణీయ ఆఫర్లు రావడంతో ఖాతాదారులు వీటిపైనే ఆసక్తి చూపుతున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పోస్టుపెయిడ్‌ సెగ్మెంట్‌పై మరింత ఆర్ధిక ఒత్తిడి నెలకొననుందని విశ్లేషిస్తున్నారు. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌ టారీఫ్‌ల మధ్య ఉన్న భారీ అంతరమే ప్రీపెయిడ్‌ చెల్లింపుల వైపు మొగ్గేలా చేస్తున్నాయని ఫిచ్‌ డైరెక్టర్‌ నితిన్‌ సోనీ పేర్కొన్నారు. 

కాగా పోస్టు పెయిడ్‌లోని సౌలభ్యాలను ప్రీపెయిడ్‌ సెగ్మెంట్‌ మాత్రం పూర్తి చేయలేదని మరో టెలికం విశ్లేషకులు పేర్కొంటున్నారు. పోస్టు పెయిడ్‌లో నిరంతర వాయిస్‌ కాల్స్‌, డాటా సర్వీసెస్‌, ఇంటర్నేషనల్‌ రోమింగ్‌ లాంటి కీలక సదుపాయాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, టెలినార్‌, టాటా టెలీ సర్వీసెస్‌ లాంటి టెలికం కంపెనీల పోస్టుపెయిడ్‌ వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారారు. జియో ఆకర్షణీయ ప్రీపెయిడ్‌ ఆఫర్లు ఖాతాదారులను ఈ విభాగం వైపు ఆసక్తిని పెంచేలా చేశాయనే చెప్పవచ్చు

జన రంజకమైన వార్తలు