రిలయన్స్ జియో ఎంట్రీతో టెలికాం రంగంలోని ఇతర కంపెనీలన్నీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు నానా తంటాలు పడుతున్నాయి. మొన్న ఐడియా, నిన్న ఎయిర్‌టెల్.. తాజాగా టెలినార్. ఇలా అన్ని కంపెనీలు అన్‌లిమిటెడ్ ప్లాన్స్‌కు తెరలేపాయి. అయితే నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఎవరూ ఊహించని రీతిలో ఓ సంచలన ఆఫర్‌కు తెరలేపింది.
జియో విస్తుపోయేలా..
కేవలం 103 రూపాయలకే అపరిమిత కాలింగ్, 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. యూజర్లందరూ తమ టెలినార్ నెంబర్ పై రూ.103తో రీఛార్జ్ చేసుకుని ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొంది. ఈ స్కీమ్ కింద యూజర్లకు అందుబాటులో ఉండే అపరిమిత 4జీ డేటా 60 రోజుల పాటు వాడుకోవచ్చట. అదేవిధంగా అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని 90 రోజులు వరకు వాడుకోవచ్చని తెలిపింది. రూ.103 ప్యాక్ కింద కొత్త 4జీ యూజర్లైతే 25 రూపాయల ఉచిత టాక్ టైమ్ తో పాటు నిమిషానికి 25 పైసలు మాత్రమే కాల్ ఛార్జ్ భరించేలా రూపొందించింది. అదేవిధంగా అపరిమతి 4జీ డేటా లిమిట్ కూడా వారు రోజుకు 2జీబీ మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. 2జీబీ డేటా అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ 128కేబీపీఎస్ కు పడిపోతుంది. టెలినార్ 4జీ సర్వీసులను ఆఫర్ చేసే అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ అందుబాటులో ఉంచనున్నట్టు కంపెనీ పేర్కొంది.
ఇంతకుముందూ సూపర్ ఆఫర్
కాగా కొద్దివారాల కిందట కూడా టెలినార్ ఓ మంచి ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 47 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా అందించనున్నట్లు ప్రకటించి అప్పట్లోనే జియోను కూడా విస్తుపోయేలా చేసింది. 28రోజుల వ్యాలిడిటీతో ఈ ఆఫర్‌ను అందించనున్నట్లు టెలినార్ తెలిపింది. రోజుకు 2జీబీ వరకూ మాత్రమే వినియోగించుకునే అవకాశమున్నట్లు పేర్కొంది.
ఈ ప్లాన్‌తో 1జీబీ డేటాను 80 పైసలకే అందించనున్నట్లు టెలినార్ ప్రకటించింది. అయితే కేవలం ఎంపిక చేసిన 4జీ సర్కిల్స్‌లో, ఎంపిక చేసిన కస్టమర్స్ మాత్రమే ఈ ఆఫర్‌ను ఇవ్వడంతో పెద్దగా ఆదరణ రాలేదు. దీంతో ఇప్పుడు మొత్తం అన్ని సర్కిళ్లలో ఈ కొత్త ఆఫర్ ప్రకటించింది.
ప్రభావం ఉంటుందా..?
అయితే... జియో నెట్ స్పీడ్‌తో పోల్చుకుంటే టెలినార్ నెట్ స్పీడ్ చాలా తక్కువ. పైగా టెలినార్ 4జీ సర్వీస్ ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ ప్రభావం మిగతావారిపై పడకపోవచ్చంటున్నారు.